శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 67)
శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై ఏడవ సర్గ పారిపోయి తిరిగివచ్చిన వానర వీరులు ప్రాణాలకు తెగించి యుద్ధంచేస్తున్నారు. వారు పెద్ద పెద్ద వృక్షములను, గండ శిలలను, పర్వత శిఖరములను తీసుకొని కుంభకర్ణుని మీదికి విసురుతున్నారు. కుంభకర్ణుడు తన గదను అటు ఇటు ఊపుతూ వానరులను చెదరగొడుతున్నాడు. ఆ చెదర గొట్టడంలో వందలు వేలు వానరులు దూరంగా విసిరివేయబడుతున్నారు. కుంభ కర్ణుడు వందల కొద్దీ వానరులను రెండు చేతులతో పట్టుకొని నోట్లో కుక్కుకొని తింటున్నాడు. అయినా వానరులు కుంభకర్ణుని మీదికి వృక్షములు, రాళ్లు విసురుతూ యుద్ధం చేస్తున్నారు. ఇంతలో ద్వివిదుడు ఒక పర్వత శిఖరమును పెకలించి చేతపట్టుకొని కుంభకర్ణుని వైపుకు పరుగెత్తాడు. ద్వివిదుడు ఆ పర్వతమును తీసుకొని పైకి ఎగిరి దానిని కుంభకర్ణుని మీదికి విసిరాడు. ఆ పర్వత శిఖరము కుంభకర్ణుని మీద పడకుండా రాక్షససేనల మీద పడింది. ఆ పర్వతము కిందపడి వందలకొద్దీ రాక్షసులు మరణించారు. అది చూచిన రాక్షస సైనికులు వానరుల మీద పడి బాణములతో వానరుల శిరస్సులను బంతుల మాదిరి ఎగురగొడుతున్నారు. వానరులు కూడా పెద్ద పెద్దవృక్షములను బండరాళ్లను తీసుకొని రాక్షసులను చంపుతున్నారు. హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి ...