శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది మూడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 63)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
అరువది మూడవ సర్గ
"ఓ వానరులారా! ఆ తరువాత ఆ ఋషి నాతో ఇంకా కొన్ని మాటలు చెప్పి తన ఆశ్రమమునకు వెళ్లిపోయాడు. అప్పటి నుండి నేను ఈ వింధ్యపర్వతము మీద కూర్చుని మీ కొరకు ఎదురు చూస్తున్నాను. ఆ మహర్షి చనిపోయి నూరు సంవత్సరముల కాలము గడిచిపోయినది. నాకు అప్పుడప్పుడు ఈ దుర్భర జీవితము గడపలేక చనిపోవాలని అనుకొన్నాను. కానీ, ఆ ఋషి చెప్పిన మాటలు మీకు చెప్పాలి కదా! అందుకని మీ రాక కోసం ఎదురు చూస్తూ, జీవించి ఉన్నాను.దశరథ మహారాజు నాతమ్ముడు జటాయువు కే కాదు నాకు కూడా మిత్రుడు. సీత దశరథుని కోడలు అని తెలిసి కూడా నా కుమారుడు ఆమెను కాపాడలేకపోయాడు. రావణుని విడిచిపెట్టాడు. అందుకని నేను నా కుమారుని తిట్టాను. కాని ఏమి చేసేది. జరగాల్సింది జరిగిపోయింది.”అని వానరులతో మాట్లాడుతూ ఉండగానే సంపాతికి రెక్కలు మొలిచాయి.
“ఓ వానరోత్తములారా! ఆ మహాఋషి ఆజ్ఞప్రకారము ఆయన చెప్పిన మాటలు మీకు చెప్పగానే నాకు ఆ ఋషి ప్రభావము వలన రెక్కలు మొలిచాయి. ఇప్పుడు నేను ఎక్కడి కంటే అక్కడకు ఎగిరిపోగలను. నా బలము పరాక్రమము నాకు తిరిగి లభించాయి. నేను ఇప్పుడు నవయవ్వనంలో ఉన్నంత ఉత్సాహంగా ఉన్నాను. మీరు అన్నివిధాలా ప్రయత్నం చేయండి. సీత మీకు లభిస్తుంది. ఆ మహాఋషి మహిమ వలన నాకు రెక్కలు ఎలా వచ్చాయో, మీకు కూడా సీత జాడ లభిస్తుంది. సందేహము లేదు." అని చెప్పి ఆ పక్షిరాజు సంపాతి తనకు నిజంగా ఎగిరే సామర్థ్యము వచ్చిందా అని పరీక్షించుకోడానికి ఒక్కసారి తన రెక్కలు టపటపలాడించి పైకి ఎగిరాడు. సంతోషంగా ఎగురుకుంటూ వెళ్లిపోయాడు. వానరులు సముద్రం ఎలా దాటాలా, లంకకు ఎలా చేరాలా అని ఆలోచిస్తున్నారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము అరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment