శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది ఒకటవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 61)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
అరువది ఒకటవ సర్గ
అప్పుడు నేను సూర్యమండలము వైపు వెళ్లడం, సూర్యుని వేడికి నా రెక్కలు కాలిపోవడం, అన్ని విషయాలు ఆ ఋషికి వివరంగా చెప్పాను. కాలిన గాయములతో నా ఒళ్లు స్వాధీనం తప్పిందని చెప్పాను. అసలు అలా ఎందుకు చేసారు అని ఆ ఋషి అడిగాడు. అప్పుడు నేను ఆ ఋషితో ఈ విధంగా చెప్పాను.“నేను, నా తమ్ముడు జటాయువు, ఒక సారి పందెం వేసుకున్నాము. నాకు ఎక్కువ బలం ఉందంటే నాకు ఎక్కువ బలం ఉందని గర్వించాము. సూర్యునితో పాటు ఉదయాద్రి నుండి అస్తాద్రివరకూ ఎగరాలని, హిమాచలము మీద ఉన్న ఋషుల ముందు, ఇద్దరం పోటీ వేసుకొన్నాము. ఇద్దరం ఆకాశంలోకి ఎగిరాము. సూర్యుని అనుసరించి ఎగురుతున్నాము. దగ్గర దగ్గరగా సూర్యుని సమీపానికి వెళ్లాము. సూర్యుని సమీపానికి వెళ్లేటప్పటికి మా ఇద్దరికీ తీవ్రంగా చెమట పట్టింది. భయం వేసింది. మూర్ఛవచ్చినట్టయింది. అక్కడ ఉన్న మాకు ఏ దిక్కూ తెలియడం లేదు. అంతా మండుతున్న అగ్నిగోళం లాగా ఉంది. నాకు మనస్సు పనిచేయడం మానేసింది. కేవలం నేత్రాలతో చూస్తూ వెళుతున్నాను.
అప్పుడు మాకు సూర్యుడు భూమిప్రమాణంలో కనపడ్డాడు. నేను నా తమ్ముడు జటాయువు వంక చూచాను. అతను భూమి మీదికి జారిపోతున్నాడు. నాకు కూడా భయం వేసింది. నా తమ్ముడితో నేను కూడా భూమి మీదికి జారిపోయాను. నా తమ్ముడి దగ్గరగా వెళ్లి నా రెక్కలను నా తమ్ముడికి రక్షణగా నిలిపాను. నా రెక్కల రక్షణలో జటాయువు శరీరం కాలిపోలేదు. కాని, నారెక్కలమీద సూటిగా సూర్యరశ్మిపడటం వలన నా రెక్కలు పూర్తిగా కాలిపోయాయి.
నేను వింధ్యపర్వత ప్రాంతంలో పడిపోయాను. నా తమ్ముడు జటాయువు దండకారణ్యంలో జనస్థానంలో పడ్డట్టు ఊహించాను. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. ఒంటరి వాడను. ఈ విధంగా బతకడం వృధా. అందుకని చనిపోదలచుకున్నాను.” అని ఆ ఋషితో నా వృత్తాంతము సవిస్తరంగా చెప్పాను.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము అరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment