శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరవయ్యవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 60)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
అరవయ్యవ సర్గ
వానర నాయకులు అందరూ సంపాతితో కలిసి చనిపోయిన జటాయువుకు జలతర్షణములు విడిచారు. తరువాత తీరుబడిగా అందరూ సంపాతి చుట్టు కూర్చున్నారు. అప్పుడు సంపాతి వారితో ఇలా అన్నాడు.“ఇప్పుడు నేను మీకు సీత ఎక్కడ ఉన్నదీ అనే విషయం నాకు ఎలా తెలుసో చెబుతాను. సావధానంగా వినండి. నేను సూర్యుని వేడికి రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతము పడిపోయాను అని మీకు చెప్పాను కదా! నాకు ఏమీ తెలియడం లేదు. నేను ఎక్కడ ఉన్నది కూడా తెలియదు. తెలివి తప్పి పడి ఉన్నాను. నాకు తెలివి వచ్చి చుట్టు చూచాను. నేను దక్షిణ సముద్ర తీరము దగ్గర ఉన్న వింధ్యపర్వతము మీద ఉన్నట్టు, నాకు దగ్గరలో నిశాకరుడు అనే ఋషి ఆశ్రమము దగ్గర ఉన్నట్టు తెలుసుకున్నాను.
(ఇక్కడ మీకు ఒక సందేహము రావచ్చు. దక్షిణ దిక్కుగా వెదకమంటూ అంగదుని వింధ్యపర్వతము దగ్గర నుండి వెదక మన్నాడు సుగ్రీవుడు. మనకు తెలిసీ వింధ్యపర్వతము భారతదేశము మధ్యభాగంలో ఉంది. పంపానది కేరళ ప్రాంతంలో ఉంది. కిష్కింధ కూడా అక్కడే ఉండి ఉండవచ్చు. సీతను గోదావరీ తీరం నుండి రావణుడు అపహరించాడు అని మనము చదువుకున్నాము. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంది కదూ. ఈ శ్లోకంలో మన సందేహాలు అన్నీ తీర్చాడు వాల్మీకి మహర్షి.
హృష్టపక్షిగణాకీర్ణ: కన్దరోదరకూటవాన్।
దక్షిణసోదరేథేస్తీరే విన్దో అయమితి నిశ్చిత॥
దక్షిణస్య=దక్షిణదిక్కున ఉన్న
ఉదధే:=సముద్రము యొక్క
తీరే= తీరమున ఉన్న
విద్య: ఇతి = వింధ్య అను పర్వతము అని
నిశ్చితి= నిశ్చయించుకున్నాను.
కాబట్టి ఇప్పటి దాకా మనము అనుకున్నట్టు భారతదేశ
మధ్యలో ఉండే వింధ్యపర్వతము కాదు. దక్షిణ సముద్ర తీరములో
మరొక వింధ్యపర్వతము ఉంది అని తెలుస్తూ ఉంది. రామాయణ కధ త్రేతాయుగానికి సంబంధించింది. అప్పుడు ఉన్న భౌగోళిక పరిస్థితులు ఇప్పుడు లేవు. కొన్ని నగరాలు పట్టణాలు పర్వతాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని కొత్త కొత్తవి వెలిసాయి. కాబట్టి ఈనాడు ఉన్న భారతదేశంతో మనం ఆనాటి భారతదేశాన్ని పోల్చడం సరికాదు అని నా భావన.)
నేను ఆ పర్వతము మీద ఎనిమిది వేల సంవత్సరములు ఉన్నాను. అతికష్టం మీద నేను ఆ వింధ్య పర్వత శిఖరము నుండి కిందికి దిగి వచ్చాను. నాకు ఆ ఋషిని చూడవలెనని కోరిక పుట్టింది. ఒకచెట్టు కింద కూర్చుని ఆ ఋషి కొరకు ఎదురు చూస్తున్నాను. అప్పుడు ఆ ఋషి సముద్రములో స్నానం చేసి వస్తుండగా చూచాను. ఏనుగులు, సింహాలు, పాములు, పులులు మొదలగు క్రూరజంతువుల ఆయనను చుట్టు ముట్టి వస్తున్నాయి. ఆ ఋషి ఆశ్రమము లోనికి వెళ్లగానే అవి అన్నీ ఎవరి దోవన అవి వెళ్లిపోయాయి.
ఆ ఋషి దారి మధ్యలో చెట్టుకింద కూర్చుని ఉన్న నన్ను చూచాడు. లోపలకు వెళ్లిన కొంచెంసేపటికి బయటకు వచ్చాడు. నా వద్దకు వచ్చి నన్ను చూచాడు.
“నేను ఇదివరకు నిన్ను చూచాను. నువ్వు సంపాతి కదూ. నీ రెక్కలు కాలిపోయి వికృతంగా ఉండడం వలన నిన్ను వెంటనే గుర్తించలేకపోయాను. నీ తమ్ముడు జటాయువు కదూ! ఇంతకు పూర్వము మీరు నన్ను కలిసేవాళ్లు. ఇంతకూ నీ రెక్కలు ఎందుకు కాలిపోయాయి? నీవు వికృతంగా ఎందుకు అయ్యావు. వివరంగా చెప్పు." అని అడిగాడు ఆ ఋషి.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము అరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment