శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది తొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 59)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
యాభై తొమ్మిదవ సర్గ
సంపాతి చెప్పిన మాటలు వానరుల చెవులకు ఇంపుగా తోచాయి. వారు ఆనందంతో ఉరకలు వేసారు. వారందరిలోకి పెద్ద వాడైన జాంబవంతుడు లేచి సంపాతితో ఇలా అన్నాడు."సీత ఎక్కడ ఉంది? సీతను ఎవరు చూచారు? సీతను అపహరించిన వాడు ఎవరు? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? మాకు తెలియజెయ్యి. పైవివరాలు మాకు తెలియజేస్తే నీవు మాకు మహోపకారము చేసినవాడివి అవుతావు. ఇంతకూ సీత రాముని భార్యఅని తెలిసీ, రాముని బాణము శక్తి, మహిమ తెలిసీ సీతను అపహరించిన ఆ మూర్ఖుడు ఎవరు? " అని అన్నాడు జాంబవంతుడు.
దానికి సంపాతి ఇలా చెప్పసాగాడు. "సీతను అపహరించడం గురించి నాకు ఎలా తెలిసిందో, నాకు ఎవరు చెప్పారో, ఇప్పుడు సీత ఎక్కడ ఉందో, మీకు వివరంగా చెబుతాను. వినండి. మీకు ఇదివరకే చెప్పాను కదా. నేను సూర్యకిరణముల వేడికి తాళలేక, రెక్కలు కాలిపోయి ఈ పర్వతము మీద పడిపోయాను. కదలలేక పడిఉన్నాను. పైగా నేను వృద్ధుడను. నా బలము, పరాక్రమము నశించిపోయాయి. కదలలేను.
అట్టి పరిస్థితిలో నా కుమారుడు సుపార్శ్వుడు నాకు ప్రతి దినము ఆహారము తెచ్చి పెట్టేవాడు. గంధర్వులకు కామము అధికము. పాములకు కోపము ఎక్కువ. లేళ్లకు భయం ఎక్కువ. అలాగే
పక్షులమైన మాకు ఆకలి అధికము. ఒక రోజు నా కుమారుడు నాకు ఆహారము ఏమీ తేలేదు. సూర్యాస్తమయ సమయానికి వట్టి చేతులతో వచ్చాడు. నాకు ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది. ఆకలికి తట్టుకోలేక నేను నా కొడుకును ఆహారం తేలేదని తిట్టాను. నా కొడుకు నన్ను తిట్టవద్దని ప్రార్థించాడు. తాను ఆహారము తీసుకురాకపోవడానికి కారణం ఈ విధంగా చెప్పాడు.
"తండ్రీ! నేను ప్రతి దినము వలె ఆహారము కొరకు మహేంద్రపర్వత శిఖరము మీద కూర్చుని ఉన్నాను. నా తల వంచి సముద్రములో ఉన్న చేపలను పట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ సమయంలో ఒకడు పెద్ద రాక్షసుడు, నలట్లికొండ మాదిరి ఆకారముతో ఉన్నవాడు, ఒక స్త్రీని తన చేతులతో ఎత్తుకొని ఆకాశంలో తీసుకు పోతున్నాడు. వాడిని నేను చూచాను. సముద్రంలో జంతువులను పట్టుకొనే బదులు, వీరిద్దరినీ ఆహారంగా తీసుకు పోవచ్చుకదా అని ఆ రాక్షసుని అడ్డగించాను. వాడు తనను పోనివ్వమని నన్ను వేడుకున్నాడు. తనకు దారి ఇవ్వమని బతిమాలే వాడిని చంపడం నాకు ఇష్టం లేదు. వాడిని వదిలి పెట్టాను. వాడు ఆ స్త్రీని తీసుకొని వాయువేగంతో వెళ్లిపోయాడు.
ఆ సమయంలో ఆకాశంలో సంచరించు సిద్ధులు నా వద్దకు వచ్చి నాతో ఇలా అన్నారు. “ఆమె ఎవరో కాదు. దశరధ మహారాజు కుమారుడు, రాముని భార్య. ఆమెను రావణుడు అనే రాక్షసుడు అపహరించుకొని పోతున్నాడు. నీవు వాడిని విడిచిపెట్టావు." అని అన్నారు.
ఆ సమయంలో ఆకాశంలో సంచరించు సిద్ధులు నా వద్దకు వచ్చి నాతో ఇలా అన్నారు. “ఆమె ఎవరో కాదు. దశరధ మహారాజు కుమారుడు, రాముని భార్య. ఆమెను రావణుడు అనే రాక్షసుడు అపహరించుకొని పోతున్నాడు. నీవు వాడిని విడిచిపెట్టావు." అని అన్నారు.
ఇదంతా జరిగేటప్పటికి సూర్యాస్తమయము అయింది. అందుకని నేను నీకు ఏమీ ఆహారము తీసుకురాలేకపోయాను." అని అన్నాడు నా కుమారుడు.
నాకు వెంటనే పోయి ఆ రావణుని చంపి సీతను రక్షించవలెనని కోరిక కలిగింది. కానీ రెక్కలు లేక జీవచ్ఛవంలా పడి ఉన్న నాకు అది సాధ్యంకాదు కదా! అందువలన సీతను రక్షించలేక
పోయాను.
పోయాను.
కాని నేను మీకు కొంత ఉపకారము చేయగలను. రామునికి సాయం చెయ్యడం అంటే నాకు కూడా ఇష్టమే కదా! సుగ్రీవుడు వానర రాజు. రాముడు గొప్ప పరాక్రమ వంతుడు. రామ బాణమునకు తిరుగు లేదు. కానీ మీ వానరుల సాయం లేనిది వారు ఏమీ చేయలేరు. మీ బుద్ధికి పదును పెట్టండి. కార్యరంగములోకి దూకండి. కార్యసాధకులకు అసాధ్యము ఏమీ లేదు.” అని అన్నాడు సంపాతి.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము యాభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment