శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది ఎనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 58)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
యాభై ఎనిమిదవ సర్గ
అంగదుడుచెప్పిన మాటలు విని సంపాతికి కన్నీళ్లు ఆగలేదు. సోదరుడు జటాయువు మరణాన్ని తలుచుకొని ఏడుస్తున్నాడు. సంపాతి ఆ వానరులతో ఇలా అన్నాడు.“రాముని కోసరం, సీతను కాపాడటం కోసరం, తన ప్రాణాలు అర్పించాడు అని మీరు చెబుతున్న జటాయువు నా తమ్ముడు. నాకు ఈ విషయము ఇంతకు ముందే కొద్దిగా తెలుసు. ఇప్పుడు మీ నుండి పూర్తిగా రూఢిపరచుకున్నాను. ఇప్పుడు నాకు రెక్కలు లేవు. అందుకని నా తమ్ముడి మరణానికి నేను రావణుని మీద ప్రతీకారము తీర్చుకోలేను.
పూర్వము వృత్రాసుర వధ జరిగిన కాలంలో నేను, నా తమ్ముడు జటాయువు, పోటీలు పడి సూర్యమండలము వైపుకు ఎగురుతున్నాము. సూర్యవేడికి నా తమ్ముడు జటాయువు
సొమ్మసిల్లాడు. నేను నా రెక్కలతో నా తమ్ముడు జటాయువుకు రక్షణ కల్పించాను. అప్పుడు సూర్యుని వేడికి నా రెక్కలు కాలిపోయాయి. నేను వింధ్యపర్వతము మీద పడ్డాను. నా తమ్ముడు జటాయువు ఎక్కడ పడ్డాడో తెలియదు. ఇప్పుడు మీ మాటల వలన నా తమ్ముడి గురించి తెలిసింది." అని అన్నాడు సంపాతి.
అప్పుడు అంగదుడు సంపాతితో ఇలా అన్నాడు. “రావణుడు సీతను అపహరించాడు అని జటాయువు వలన రామునికి తెలిసింది. కాని ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో చెప్పకుండానే జటాయువు మరణించాడు. ఆ రావణుని నివాసము గురించి నీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పు. దాని వలన మేము సీత యొక్క జాడ కనుక్కోడానికి వీలు కలుగుతుంది." అని అన్నాడు అంగదుడు.
ఆ మాటలకు సంపాతి ఇలా చెప్పాడు. “నా తమ్ముడు జటాయువు రాముని కోసరం తన ప్రాణాలు అర్పించాడు. నాకు రెక్కలు లేవు కాబట్టి నేను కేవలం మాట సాయం చేస్తాను. నాకు వరుణలోకము, భూలోకము, స్వర్గలోకము పాతాళలోకము, దేవాసుర యుద్ధము, అమృతాన్ని మథించడం అన్నీ నాకు తెలుసు. రావణుడు సీతను తీసుకుపోవడం నేను కూడా చూచాను. అప్పుడు సీత “రామా రామా" అని అరుస్తూ ఉంది.
ఇంక ఆ రావణుని గురించి చెబుతాను వినండి. రావణుడు విశ్రవసుని కుమారుడు, కుబేరునికి తమ్ముడు. ఆ రావణుడు లంకానగరంలో నివసిస్తున్నాడు. ఇక్కడికి నూరుయోజనముల దూరంలో సముద్రమధ్యలో ఒక ద్వీపము ఉంది. ఆ ద్వీపములో విశ్వకర్మచే నిర్మింప బడిన లంక అనే నగరము ఉంది. ఆ నగరము చాలా విలాస వంతంగా ఉంటుంది. బంగారు ద్వారములు, బంగారు అరుగులు, పెద్ద పెద్ద భవనములు ఆ నగరంలో ఉన్నాయి. ఆ నగరం చుట్టు శత్రువులకు ప్రవేశించరాని పెద్ద ప్రాకారము ఉంది.
రావణుడు సీతను ఆ లంకా నగరంలో బంధించి ఉంచాడు. మీరు లంకా నగరం వెళ్లగలిగితే అక్కడ సీతను చూడగలరు. కాని మీరు నూరు యోజనములు సముద్రము దాటి వెళ్లాలి. అక్కడి నుండి సముద్రమధ్యలో ఉన్న లంకను చేరాలి. మీరు తొందరగా వెళ్లండి. మీరు సీతను చూడగలరు అని నా దివ్యదృష్టికి గోచరమవుతూ ఉంది.
నాకు మా పక్షుల గురించి బాగా తెలుసు. కొన్ని పక్షులు కేవలం ధాన్యము తిని జీవించేవి భూమికి సమాంతరంగానే ఎగురుతాయి. రెండవ జాతి పక్షులు అంటే కాకులు మొదలగునవి ఇంకొంచెం పైగా ఎగురగలవు. క్రౌంచ పక్షులు మొదలగునవి ఇంకా పైన ఎగురగలవు. ఇంక నాలుగవ జాతి పక్షులు అయిన గ్రద్దలు మొదలగునవి ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురగలవు. ఇంకా హంసలుమొదలగు పక్షులు ఇంకా ఎత్తులో ఎగురగలవు.
వినతకు గరుడుడు, అరుణుడు జన్మించారు. వారిది ఇంకా ఎత్తున ఎగురగల పక్షి సంతతి. మేము అరుణుని సంతతివారము. రావణుడు నా సోదరుడు జటాయువును చంపాడు. కాబట్టి నేను రావణుని మీద ప్రతీకారము తీర్చుకోవాలి. మేము ఆకాశంలో ఎంత ఎత్తున ఎగురుతున్నా, నేల మీద ఉన్న ఎంత చిన్న వస్తువునైనా నిశితంగా చూడగలము. నాకు లంకలో ఉన్న సీత స్పష్టంగా
కనపడుతూ ఉంది.
మేము మాకు సహజంగా ఉన్న తీక్షణమైన చూపు చేత నూరుయోజనముల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా చూడగలము. ఎందుకంటే మేము ఆకాశంలో ఎగురుతూ ఎంతో కింద భూమి మీద ఉన్న సూక్ష్మమైన జంతువులను కూడా చూడగల శక్తిని మాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. మీరు ముందుగా సముద్రమును దాటే ఉ పాయమును ఆలోచించండి. సముద్రమును దాటితే గానీ లంకా నగరము చేరలేరు. మీరు నన్ను సముద్రము వద్దకు తీసుకొని వెళ్లండి. చనిపోయిన నా సోదరుడు జటాయువుకు జలతర్పణము విడవాలి.” అని అన్నాడు సంపాతి.
సంపాతి చెప్పిన మాటలకు వానరులు ఎంతో సంతోషించారు. రెక్కలు కాలిపోయిన సంపాతిని ఎత్తుకొని అందరూ సముద్ర తీరమునకు వెళ్లారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము యాభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment