శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 57)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

యాభై ఏడవ సర్గ

సంపాతి మాటలు వానరులు నమ్మలేదు. “వీడెవడో రాక్షసుడు. కామరూపంలో ఉన్నాడు. వీడిని కిందికి దించితే మనలనందరినీ తినేస్తాడు." అని అనుమానపడ్డారు. అందుకని సంపాతిని పర్వతశిఖరము మీదినుండి కిందికి దింపాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. వారికి మరో ఆలోచన కూడా వచ్చింది. “ఎటూ తాము చావడానికే ప్రాయోపవేశం చేస్తున్నారు. అటువంటిది తాము ఈ రాక్షసుడి చేతిలో చావడం మేలుకదా. తొందరగా చావాలనే కోరిక ఈ విధంగా నెరవేరుతుంది." అని కూడా అనుకున్నారు.

ఇలా ఆలోచించిన తరువాత, అంగదుడు సంపాతిని ఆ పర్వత శిఖరము మీది నుండి కిందికి దింపి నేలమీద పెట్టారు. అప్పుడు అంగదుడు సంపాతితో తమ వృత్తాంతము ఇలా చెప్పసాగాడు.

"ఓ పక్షిరాజా! పూర్వము ఋక్షజుడు అనే వానర రాజు ఉండేవాడు. ఆయన నా పితామహుడు. (తాతగారు). వాలి, సుగ్రీవుడు ఆయనకు ఔరసపుత్రులు. వాలి నా తండ్రి. నా తండ్రి తన పరాక్రమంతో ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు జన్మించాడు. ఆయన కుమారుడు రాముడు. తండ్రి ఆజ్ఞ పాటించడానికి రాముడు, తన భార్య సీత, సోదరుడు లక్ష్మణునితో అరణ్యవాసం చేస్తూ దండకారణ్యానికి వచ్చాడు. రావణుడు అనే రాక్షసుడు రాముని భార్య సీత జనస్థానము నుండి బలవంతంగా తీసుకుపోయాడు. రావణుడు సీతను తీసుకుపోతుంటే జటాయువు అనే పక్షిరాజు చూచాడు. సీతను రక్షించాలని రావణునితో యుద్ధం చేసాడు. కాని రావణుడు జటాయువు రెక్కలు ఖండించి చంపాడు. రామకార్యంలో మరణించిన జటాయువు ఉత్తమగతులు పొందాడు. రాముడు సీతను వెతుకుతూ నా పినతండ్రి సుగ్రీవుని వద్దకు వచ్చాడు. రాముడు సుగ్రీవునితో స్నేహం చేసాడు. సుగ్రీవునికి ఇచ్చినమాట ప్రకారము రాముడు నా తండ్రి వాలిని చంపాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు.

సుగ్రీవుని ఆజ్ఞప్రకారము మేము సీతను వెదుకుతూ ఇక్కడకు వచ్చాము. కాని సీత జాడను తెలుసుకోలేకపోయాము. సీతను వెదుకుతూ, నీరు దొరుకుతుందేమో అని మేము ఒక బిలము లోకి ప్రవేశించాము. ఆ బిలములో మేము ఆహారము, నీరు కొరకు వెదుకుతండగానే సుగ్రీవుడు మాకు ఇచ్చిన ఒక మాసము కాలము దాటి పోయింది. ఇప్పుడు మేము కిష్కిందకు పోతే సమయపాలన చేయనందుకు సుగ్రీవుడు మమ్ములను చంపుతాడు. రాముడికి, లక్ష్మణునికి సుగ్రీవునికి కోపం తెప్పించి మేము కిష్కిందలో బతకలేము. అందుకని మేము ఇక్కడ ప్రాయోపవేశము చేస్తున్నాము.” అని చెప్పాడు అంగదుడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము యాభై ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)