శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - తొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 9)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
తొమ్మిదవ సర్గ
“రామా! వాలి, నేను, అన్నదమ్ములము. వాలి అంటే మా నాన్న గారికి ఎంతో ప్రేమ. నాకు కూడా వాలి అంటే ఎంతో ప్రేమ, అభిమానము. నా తండ్రి గారు చనిపోయిన తరువాత, పెద్ద కుమారుడు అయిన వాలిని కిష్కింధా రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసారు. వంశపారంపర్యముగా వచ్చిన రాజ్యమును వాలి పరిపాలిస్తూ ఉంటే, నేను వాలికి సేవకునిలా అతనిని సేవించేవాడిని. మయునికి ఇద్దరు కుమారులు. వారు మాయావి, దుందుభి. మాయావికి, మా అన్న వాలికి ఒక స్త్రీమూలకంగా విరోధము ఏర్పడింది. ఒకరోజు అర్థ రాత్రి అందరమూ నిద్రపోతున్నాము. అప్పుడు మాయావి మా కోట వద్దకు వచ్చి పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. పరాక్రమ వంతుడైన వాలి మాయావితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అర్థరాత్రి శత్రువు యుద్ధానికి వచ్చాడంటే అందులో ఏదో మర్మం ఉంటుందని ఎంత నచ్చచెప్పినా వినకుండా వాలి మాయావితో యుద్ధానికి వెళ్లాడు. నేను కూడా వాలితో పాటు వెళ్లాను. మా ఇద్దరినీ చూచి మాయావి పారిపోయాడు. నేను, వాలి, మా అనుచరులతో మాయావిని వెంబడించాము. ఆ మాయావి భూమిలో ఉన్న సొరంగములోకి ప్రవేశించాడు. ఆ సొరంగము గడ్డితో కప్పబడి ఉంది. నేను వాలి బయట నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ఇలా అన్నాడు. “తమ్ముడా! సుగ్రీవా! నేను ఈ బిలములో ప్రవేశించి, శత్రువును చంపి వస్తాను. నేను వచ్చువరకూ నీవు ఈ బిలము వద్ద నా కోసం వేచి ఉండు.” అని అన్నాడు.దానికి నేను ఒప్పుకోలేదు. నేను కూడా తన వెంట వస్తానని ఎంత బతిమాలుకున్నా వాలి వినలేదు. తాను ఒక్కడే ఆ సొరంగము లోకి వెళ్లాడు. నేను సొరంగము బయట నిలబడి ఉన్నాను. దాదాపు ఒక సంవత్సర కాలము గడిచిపోయింది. వాలి బయటకు రాలేదు. నేను ఓపికగా ఆ సంవత్సరకాలము సొరంగము బయట వేచి ఉన్నాను. నాలో ఏదో శంక మొదలయింది. వాలి మహావీరుడు. కానీ సంవత్సరకాలము రాకపోవడంతో నామనసు కీడు శంకించింది. అయినా గుండె నిబ్బరంతో ఎదురు చూచాను.
కొంత కాలానికి ఆ సొరంగము నుండి నురుగతో కూడిన రక్తం మడుగులాగా బయటకు ప్రవహించింది. రాక్షసులు గట్టిగా అరుస్తున్నట్టు ధ్వనులు వినబడ్డాయి. కాని నా సోదరుడు అరుస్తున్న గొంతు వినబడలేదు. నా సోదరుడు వాలి ఆ రాక్షసుని చేతిలో చంపబడినట్టు నిర్ధారణ చేసుకున్నాను. ఇంక అక్కడ ఉండి చేసేది ఏమీ లేకపోవడంతో, నేను ఆ బిలమును పెద్ద పెద్ద బండ రాళ్లతో మూసి వేసాను. నా అన్న వాలికి జలతర్పణములు కూడా విడిచాను. తరువాత కిష్కింధకు తిరిగి వచ్చాను.
నా అన్న వాలి మరణాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాను. కాని మంత్రులు ఆ విషయాన్ని పసిగట్టారు. తెలుసుకున్నారు. నేను ఎంత వద్దన్నా, అందరూ కలిసి నన్ను ఈ కిష్కింధకు రాజ్యాభిషిక్తుని చేసారు. ఆ విధంగా నేను కిష్కింధకు రాజునై ధర్మంగా పరిపాలిస్తున్నాను.
ఇంతలో వాలి ఆ రాక్షసుడు మాయావిని చంపి కిష్కింధకు తిరిగి వచ్చాడు. నన్ను కిష్కింధకు రాజుగా చూచాడు. తట్టుకోలేక పోయాడు. నా మీద ఆగ్రహించాడు. నా మంత్రులను బంధించాడు.
నేను వాలి అంతటి పరాక్రమ వంతుడనైనా, అన్నగారి మీద గౌరవంతో నేను వాలిని ఎదిరించలేదు. నా అన్నకు అభివాదము చేసాను. గౌరవించాను. కాని వాలి నన్ను ఆదరించలేదు. నా మీద ఆగ్రహించాడు.
నేను వాలి పాదాల మీద పడి ప్రార్థించాను. కాని వాలికి నా మీద కోపం పోలేదు. నన్ను అనుగ్రహించలేదు.
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment