శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 10)
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము
పదవ సర్గ
నేను నా అన్నకు జరిగిన విషయము వివరంగా చెప్పాను. నా మీద కోపగించవద్దని బతిమాలుకున్నాను.“అన్నయ్యా! నేను చెప్పేది విను. నీవు మన శత్రువును సంహరించి విజయోత్సాహంతో తిరిగి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా కందరికీ ఇప్పటికీ నీవే రక్షకుడవు. నీవే ఈ సింహాసనము అధిష్టించు. నేను నీ వెనక నిలబడి ఛత్రము పట్టి నిల్చుంటాను. అన్నా! నీవు ఆదేశించినట్టు నేను ఆ బిలము బయట ఒక సంవత్సరము పాటు వేచి ఉన్నాను. నీవు రాలేదు. ఇంతలో ఆ బిలము లో నుండి రక్తం ఏరులుగా ప్రవహించింది. అది చూచి నాకు భయం వేసింది. నిన్ను ఆ రాక్షసుడు చంపి ఉంటాడని అనుకున్నాను. ఆ బిలమును పెద్ద పెద్ద బండరాళ్లతో మూసివేసాను. కిష్కింధకు తిరిగి వచ్చాను. నేను ఎంత వద్దన్నా, ఈ మంత్రులు నన్ను రాజును చేసారు. అది జరిగిన సంగతి.
నేను ఈ కిష్కింధకు రాజుగా తగను. నీవే రాజువు. నీవు వచ్చేవరకూ నేను ఈ రాజ్యాన్ని నీ బదులు సంరక్షిస్తూ ఉన్నాను. ఇప్పుడు నీ రాజ్యమును నీకు అప్పగిస్తున్నాను. నేను ఇదివరకటి మాదిరి నిన్ను సేవిస్తూ ఉంటాను. నా మీద కోపించకు. శాంతం వహించు. నీ పాదాల పడి ప్రార్థిస్తున్నాను. అన్నయ్యా! మరొకసారి చెబుతున్నాను. నేను నాకుగా ఈ రాజ్యానికి అభిషిక్తునిగా కాలేదు. మంత్రులు, ప్రజలు, రాజ్యమునకు రక్షకుడు లేకుండా ఉండకూడదని, నన్ను రాజుగా చేసారు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. " అని ఎన్నోవిధాలుగా వాలిని వేడుకున్నాను.
కాని నా అన్న వాలి నా ప్రార్థనలను పెడచెవిని పెట్టాడు. నన్ను ఛీ కొట్టాడు. “ఏరా! ఒకనాడు అర్థరాత్రి మాయావి వచ్చి నన్ను యుద్ధానికి పిలిచాడు అని నీకు తెలుసు కదా! అప్పుడు వాడితో తలపడడానికి నేను వెళ్లాను కదా! అప్పుడు క్రూరుడవైన నీవు నా వెంట వచ్చావు కదా! మన ఇద్దరిని చూచి ఆ రాక్షసుడు పారిపోయాడు కదా! ఒకబిలములో ప్రవేశించాడు కదా! "నేను ఈ రాక్షసుడిని చంపి గానీ కిష్కింధకు తిరిగిరాను. నేను వచ్చువరకు నీవు ఈ బిలము బయట వేచి ఉండు" అని ఆదేశించి నేను ఆ బిలములో ప్రవేశించాను కదా!
నీవు బిలము వద్ద ఉన్నావు కదా అనే ధైర్యముతోనే కదా నేను బిలములోకి ప్రవేశించింది. నేను వాడి కోసరము సంవత్సరము పాటు వేచి ఉండి, వాడిని వాడి బంధుమిత్రులను సమూలంగా సంహరించాను. వారి రక్తముతో ఆ బిలము పూర్తిగా తడిసిపోయింది. నడవడానికి కూడా వీలు కాలేదు. అందువల్ల నేను బయటకు రావడం ఆలస్యం అయింది. నేను బిలద్వారము దగ్గరకు వచ్చాను. కాని అది మూసి ఉంది. “సుగ్రీవా! సుగ్రీవా” అంటూ అరిచాను. కేకలు పెట్టాను. కాని నీవు అక్కడ లేవు. నాకు దుఃఖము వచ్చింది. ఎంతో ప్రయాస పడి నీవు బిలద్వారమునకు అడ్డుగా పెట్టిన రాళ్లను తొలగించి బయటకు వచ్చాను.
క్రూరుడు, దుర్మార్గుడు అయిన నా తమ్ముడు సుగ్రీవుడు అడ్డు తొలగించుకొని ఈ రాజ్యమును అపహరించవలెననే దురుద్దేశముతో నన్ను ఆబిలములో బంధించి, సమాధి చేసాడు అని అర్థం అయింది. ఇప్పుడు తెలిసిందా నీవు చేసిన తప్పు ఏంటో! కాబట్టి నీవు ఈ రాజ్యములో ఉండ తగవు." అంటూ నా అన్న వాలి నన్ను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెడలగొట్టాడు. నా భార్యను తన వద్దనే ఉంచుకున్నాడు.
నేను వాలికి భయపడి ఈ భూమి అంతా చుట్టబెట్టాను. ఎక్కడా నాకు వాలి నుండి ఆశ్రయం దొరకలేదు. కారణాంతరాల వల్ల వాలి ఈ ఋష్యమూక పర్వతము మీదకు రాలేడని తెలిసింది. అందువల్ల ఇక్కడ తలదాచుకుంటున్నాను. రామా! విన్నావు కదా నా కధ. ఇందులో నా తప్పు ఏమీ లేకపోయినా, నా అన్న వాలి నన్ను రాజ్యభష్టుని చేసాడు. నా భార్యను అపహరించాడు. వాలికి భయపడి నేను ఈ పర్వతము మీద నివసిస్తున్నాను." అని పలికాడు సుగ్రీవుడు.
రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. "మిత్రమా! సుగ్రీవా! వాలిని చంపడానికి తగిన కారణం దొరికింది. నా బాణములతో వాలిని చంపుతాను. వాలి నా కంటపడనంతవరకే జీవించి ఉంటాడు. నిన్ను మరలా కిష్కింధకు రాజుగా చేస్తాను. నీ భార్యను నిన్ను చేరుకుంటుంది. నా మాట నమ్ము.” అని అన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment