శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదకొండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 11)
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము
పదకొండవ సర్గ
తనలో సంతోషాన్ని వృద్ధి చెందేట్టు రాముడు పలికిన మాటలకు సుగ్రీవుడు ఎంతో ఆనందించాడు. “రామా! నాకు ఆ మాత్రం తెలియదా! నీకు కోపం వస్తే ముల్లోకములనే భస్మం చేయగల శక్తి, సామర్థ్యము నీకు ఉంది. కాని వాలికి ఎంత పౌరుషము, పరాక్రమము ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేయమని నా కోరిక. రామా! వాలి సూర్యోదయానికి ముందే లేచి, ఏ మాత్రం శ్రమలేకుండా నాలుగు సముద్రములకు వెళ్లి, సంధ్యావందనము చేస్తాడు.(ఇక్కడ ఒక చమత్కారము ఉంది. కన్యాకుమారి దగ్గరకు వెళితే, మూడు సముద్రాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇంక నాలుగో సముద్రం అప్పట్లో ఉందేమో తెలియదు. ప్రస్తుతం హిమాలయాలు ఉన్నాయి. కాబట్టి అది అతిశయోక్తి కావచ్చును. పైగా పంపానది, ఋష్యమూకము కన్యాకుమారికి దగ్గరగానే ఉన్నాయి. వాలి ఏ మాత్రం శ్రమ లేకుండా మూడు సముద్రాలలో సంధ్యావందనము చేసాడు అనేది సంభవమే కదా!).
వాలి పర్వతముల మీద ఎక్కి పెద్ద పెద్ద రాళ్లను బంతుల మాదిరి పైకి ఎగరవేసి ఆడుకుంటూ ఉంటాడు. వాలి తన బల ప్రదర్శన కొరకు పెద్ద పెద్ద వృక్షములను పెకలించి వేస్తూ ఉంటాడు.
దుందుభి అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు మహా బలవంతుడు. పెద్ద కొండ వంటి శరీరము కలవాడు. గర్వముచే మదించిన వాడు. వాడు ఒక సారి సముద్రుని వద్దకుపోయి తనతో యుద్ధానికి రమ్మని సముద్రుని పిలిచాడు. సముద్రుడు ఆ రాక్షసునితో ఇలా అన్నాడు. "ఓ దుందుభీ! నేను నీతో యుద్ధము చేయలేను. కానీ నీతో యుద్ధము చేయగల వీరుడి గురించి చెపుతాను.
హిమవంతుడు అనే పర్వత రాజు ఉన్నాడు. ఆయన సాక్షాత్తు మహాశివునికి మామగారు. ఆయన ఎంతో మంది మునులకు, ఋషులకు తపస్సుచేసుకోడానికి ఆశ్రయం ఇచ్చాడు. నీతో యుద్ధము చేయుటకు ఆయన సమర్థుడు." అని చెప్పాడు సముద్రుడు.
సముద్రుడు తనకు లొంగి పోయాడు అనే గర్వంతో దుందుభి హిమవంతుని వద్దకు వెళ్లాడు. హిమవంతుని పర్వత శిఖరములను పడగొట్టాడు. నలుమూలలకూ విసిరివేసాడు. అప్పుడు హిమవంతుడు దుందుభితో ఇలా అన్నాడు. ఎందుకు నా శిఖరము లను ధ్వంసం చేస్తావు. నా శిఖరముల మీద ఎంతో మంది మునులు, ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వారి తపస్సుకు ఆటంకము కలిగించకు. నేను సాత్వికుడను. నాకు యుద్ధం చేయడం చేతకాదు.” అని అన్నాడు.
ఆ మాటలకు దుందుభి ఇలా అన్నాడు. “నీవు నాతో యుద్ధం చేయగలవనే నీ దగ్గరకు వచ్చాను. నీవు నాతో యుద్ధం చెయ్యి లేకపోతే నాతో యుద్ధం చేయగల పరాక్రమవంతుడు ఎవరో చూపించు." అని అన్నాడు.
"ఓ దుందుభీ! ఇంద్రుని కుమారుడు, కిష్కింధ రాజ్యాధిపతి, అమిత ప్రతాపవంతుడు, వాలి నామధేయుడు ఉన్నాడు. అతడు నీతో యుద్ధము చేయగల సమర్థుడు. వెంటనే అతని వద్దకు పోయి అతనితో యుద్ధము చెయ్యి. కాని ఇంతవరకూ యుద్ధములో వాలిని ఎవరూ గెలవ లేదు. అది గుర్తుపెట్టుకో.” అని చురక అంటించాడు హిమవంతుడు.
దుందుభికి కోపం మిన్ను ముట్టింది. మారు మాటాడకుండా దుందుభి వాలి వద్దకు వెళ్లాడు. దుందుభి మహిష రూపం(దున్నపోతు) ధరించాడు. కిష్కింధా పుర ద్వారము వద్ద నిల్చి పెద్ద పెద్దగా రంకెలు వేసాడు. పక్కనే ఉన్న వృక్షములను పెకలించాడు. సింహద్వారములను తన కొమ్ములతో కుమ్ముతున్నాడు. దుందుభి చేస్తున్న ఆగడాలు అంతఃపురంలో ఉన్న వాలి దృష్టికి వచ్చాయి. వాలి తన అంతఃపుర స్త్రీలతో కలిసి బయటకు వచ్చాడు. దుందుభిని
చూచాడు.
"ఓ దుందుభీ! నువ్వా! నీ సంగతి నాకు తెలుసు కానీ, వెళ్లి నీ ప్రాణాలు కాపాడుకో. నాతో అనవసరంగా యుద్ధం చేసి నీ ప్రాణాల మీదికి తెచ్చుకోకు.” అని అన్నాడు. ఆ మాటలకు దుందుభి కోపం మిన్నుముట్టింది. “వాలీ! అంతఃపుర స్త్రీల ముందు ప్రగల్భాలు పలుకకు.
ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి. లేకపోతే ఓడిపోయానని ఒప్పుకొని అంత:పురానికి వెళ్లు. నీకు మరొక అవకాశము ఇస్తున్నాను. రాత్రి అంతా నీ అంత:పుర స్త్రీలతో కామ సుఖాలు అనుభవించు. నీ వాళ్లందరికీ వీడ్కోలు చెప్పు. నీ కిష్కింధను ఆఖరు సారిగా తనివిదీరా చూసుకో. మరలా ఇంకొక సారి కామభోగములు అనుభవించు. రేపు ఉదయం నా వద్దకు రా! నాతో యుద్ధం చెయ్యి. నా చేతిలో నీకు చావు తప్పదు.
రేపటిదాకా ఎందుకు సమయం ఇస్తున్నాను అంటే ప్రస్తుతం నీవు మద్యం మత్తులో ఉన్నావు. అంతఃపుర స్త్రీలతో కామ సుఖాలు అనుభవిస్తున్నావు. నీ చేతిలో ఏ ఆయుధమూ లేదు. ఆయుధములు లేని వానినీ, మద్యం మత్తులో ఉన్నవాడినీ, ఏమరుపాటుగా ఉన్న వాడినీ, నీ వంటి బలం లేని వాడినీ, ఓడి పోయిన వాడినీ, నీ లాగా కామసుఖాలలో మునిగి తేలుతూ సగంలో లేచి వచ్చిన వాడినీ చంపడం మహా పాపం అని నాకు తెలుసు. అందుకే రేపు ఉదయం రా!" అని గర్వంతో పలికాడు దుందుభి.
ఆ మాటలకు వాలి నవ్వాడు. తనతో ఉన్న అంతః పుర కాంతలను లోపలకు పంపాడు. దుందుభి వద్దకు వచ్చాడు. “నేను మద్యం మత్తులో లేను. యుద్ధం చేసే ముందు మద్యం సేవించడం ఆచారం. అదే నేను చేసాను. నాతో యుద్ధానికి రా!" అని దుందుభిని యుద్ధానికి పిలిచాడు.
తన తండ్రి దేవేంద్రుడు తనకు ఇచ్చిన మాలను మెడలో వేసుకున్నాడు. దుందుభి కొమ్ములు పట్టుకున్నాడు. దుందుభిని పట్టుకొని గిరా గిరా తిప్పి నేలకేసి కొట్టాడు. దుందుభికి దిమ్మ తిరిగింది. చెవులలో నుండి రక్తం కారింది. పైకి లేచి వాలిని పట్టుకున్నాడు. వాలికి, దుందుభికి ఘోర యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు పిడికిళ్లతో గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ, వృక్షములు, బండరాళ్లు ఒకరి మీద ఒకరు విసురుకుంటూ యుద్ధం చేసారు.
యుద్ధం చేసే కొద్దీ దుందుభి బలం తగ్గుతూ ఉంది. వాలి బలం పెరుగుతూ ఉంది. వాలి, దుందుభిని పైకి ఎత్తి నేల మీద పడవేసి తొక్కుతున్నాడు. దుందుభి నవ రంధ్రముల నుండి రక్తం ధారాపాతంగా కారిపోతూ ఉంది. వాలి బలానికి తట్టుకోలేక దుందుభి ప్రాణాలు విడిచాడు. వాలి దుందుభి శరీరాన్ని రెండు చేతులతో పైకి ఎత్తి ఒక యోజన దూరంలో పడేట్టు విసిరి వేసాడు.
ఆ మాదిరి విసిరి వేయడంలో దుందుభి శరీరం నుండి కారిన రక్తం మతంగాశ్రమము మీద చల్లినట్టు పడింది. ఆ రక్తపు బిందువులను చూచి మతంగ మహర్షి కోపించాడు. ఆ రక్తము చల్లిన వాడు ఎవడా అని చూచాడు. మహర్షికి దున్నపోతురూపంలో చచ్చి పడి ఉన్న దుందుభి మృతకళేబరము కనిపించింది. ఆ మహర్షి తన తపోబలంతో ఆ పని చేసిన వాడు వాలి అని గ్రహించాడు. అనవసరంగా ఆ రాక్షసుని మృతకళేబరమును తన ఆశ్రమ ప్రాంతంలో
విసిరివేసిన వాలిని శపించాడు.
ఆ మాదిరి విసిరి వేయడంలో దుందుభి శరీరం నుండి కారిన రక్తం మతంగాశ్రమము మీద చల్లినట్టు పడింది. ఆ రక్తపు బిందువులను చూచి మతంగ మహర్షి కోపించాడు. ఆ రక్తము చల్లిన వాడు ఎవడా అని చూచాడు. మహర్షికి దున్నపోతురూపంలో చచ్చి పడి ఉన్న దుందుభి మృతకళేబరము కనిపించింది. ఆ మహర్షి తన తపోబలంతో ఆ పని చేసిన వాడు వాలి అని గ్రహించాడు. అనవసరంగా ఆ రాక్షసుని మృతకళేబరమును తన ఆశ్రమ ప్రాంతంలో
విసిరివేసిన వాలిని శపించాడు.
“నా ఆశ్రమ ప్రాంతంలో ఈ రాక్షసుని శరీరాన్ని విసిరి, నా ఆశ్రమంలోని వృక్షములను నాశనం చేసి, ఈ దుష్టుని రక్తంతో కలుషితం చేసిన వాలి నా ఆశ్రమ ప్రాంతంలోకి కానీ, నా ఆశ్రమము నకు ఒక యోజన విస్తీర్ణములో గానీ ప్రవేశించకూడదు. అలా ప్రవేశిస్తే వెంటనే మరణిస్తాడు అంతే కాదు ఇప్పటి దాకా ఈ అరణ్యములో నివసించుచున్న వాలి అనుచరులు, వానరులు తక్షణమే ఈ వనమును విడిచి పెట్టి వెళ్లవలెను. నేను ఈ ఆశ్రమమును ఈ ఆశ్రమములోని వృక్షములను, లతలను కన్నబిడ్డలవలె కాపాడుకుంటున్నాను. ఆ వృక్షములను, లతలను వానరములు పాడుచేస్తున్నారు. కాబట్టి వానరజాతి అంతా ఈ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్లాలి. వారికి ఒక్కరోజు గడువు ఇస్తున్నాను. ఒక్కరోజు లోగా వానరులందరూ వెళ్లకపోతే వారిని కూడా శపించవలసి వస్తుంది. రేపటి నుండి నా కంటబడిన వానరుడు శిల అయి పోతాడు." అని వాలికి శాపం ఇచ్చాడు మతంగ మహర్షి.
ముని శాపము విషయం తెలుసుకొని వానరములు అన్నీ మతంగ మహర్షి వనము విడిచిపెట్టి వాలి వద్దకు వెళ్లాయి. “మీరంతా ఇక్కడకు ఎందుకు వచ్చారు. మీకు క్షేమమే కదా!"అని అడిగాడు. అప్పుడు ఆ వానరులు వాలికి, మతంగ మహర్షి ఇచ్చిన శాపము గురించి చెప్పారు. వెంటనే వాలి పరుగు పరుగున మతంగ ముని వద్దకు వెళ్లాడు. ఆయన కాళ్ల మీద పడి క్షమించమని ప్రార్థించాడు. కాని మహర్షి కనికరించలేదు.
ఆ నాటి నుండి వాలి శాపగ్రస్తుడయ్యాడు. ఈ ఋష్యమూక పర్వతము మీదికి వచ్చుటకు కానీ, కనీసము ఈ పర్వతము వంక కన్నెత్తి చూచుటకు కానీ భయపడేవాడు. నా అన్న వాలి ఇక్కడకు రాలేడని తెలిసి, నేను ఇక్కడ నివాసము ఏర్పరచుకొని నిర్భయంగా జీవించుచున్నాను. రామా! అదుగో ఆ నాడు వాలి విసిరిన దుందుభి అస్థిపంజరము కొండవలె ఎలా పడి ఉన్నదో చూడు. దాని పక్కనే ఏడు సాల వృక్షములు ఉన్నవి. వాలి అప్పుడప్పుడు వాటిని ఊపి వాటికి ఉన్న ఆకులు, పండ్లు రాలగొడుతూ ఉంటాడు.
మిత్రమా రామా! వాలి గురించి అతని బల పరాక్రమముల గురించి నీకు వివరంగా చెప్పాను. అటువంటి వాలిని నీవు చంప గలవా! ఆలోచించుకో!" అని రాముని మనసులో సందేహాన్ని రేకెత్తించాడు సుగ్రీవుడు.
ఆమాటలు విని లక్ష్మణుడు నవ్వాడు. “ఓ సుగ్రీవా! నీవు చెప్పావు సరే. ఇప్పుడు రాముడు ఏమి చేస్తే, నీవు రాముడు వాలిని చంపగలడు అని నమ్మగలవు" అని అడిగాడు.
ఇప్పుడు సుగ్రీవుడు తన మనసులో మాట బయట పెట్టాడు. “రామా! పూర్వము వాలి ఈ సాలవృక్షములు ఏడింటిని అటు ఇటు ఊపేవాడు అని చెప్పాను కదా! రాముడు తన బాణముతో ఈ సాల వృక్షములలో ఒక దానిని పడగొట్ట గలిగితే, రాముడు వాలిని చంపగలడు అని నమ్మడానికి అవకాశము ఉంది. పోనీ రాముడు అక్కడ ఉన్న దుందుభి అస్థిపంజరమును తన కాలితో ఎత్తి రెండు వందల ధనుస్సు ప్రమాణముల అవతల విసర గలిగితే అప్పుడు కూడా రాముడు వాలిని చంపగలడు అని నమ్ముతాను." అని అన్నాడు. సుగ్రీవుడు.
(ధనుస్సు పొడుగు 6 అడుగులు. అంటే రెండు గజాలు. 200 ధనుస్సులు అంటే 400 వందల గజాలు.).
సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు. "రామా! మరొక మాట. వాలి మహా బలవంతుడు. పరాక్రమశాలి. ఇప్పటి వరకూ ఎవరి చేతిలోనూ ఓడిపోవడం అనేది ఎరుగడు. వాలి దేవతలకు కూడా అజేయుడు.
అందుకనే వాలికి భయపడి నేను ఇక్కడ తలదాచుకుంటున్నాను. వాలిని ఓడించుటకు కానీ, జయించుటకు కానీ ఎవరికీ సాధ్యము కాదు. ఇంక నా మాట చెప్పడం ఎందుకు. అందుకే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని అనుక్షణం భయపడుతూ నా మంత్రులతో సహా ఇక్కడ దాక్కున్నాను.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే. నాకు వాలి పరాక్రమము గురించి తెలుసు. కానీ నీ పరాక్రమము గురించి నాకు తెలియదు. అని చెప్పి నిన్ను పరీక్షించవలెనని గానీ, నీ పరాక్రమమును వీరత్వమును శంకించిగానీ నేను ఇలా అనడం లేదు. వాలి వలన కలిగిన భయంతోనే ఇలా మాట్లాడుతున్నాను. కాని నిన్ను, నీ ఆకారాన్ని, నీ ధనుస్సును చూస్తే నీవు వాలిని చంపగలవని నమ్మకం నాకు ఉంది. నీ తేజస్సు అటువంటిది." అని తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పాడు సుగ్రీవుడు.
రాముడు సుగ్రీవుడు చెప్పిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్నాడు.
"మిత్రమా సుగ్రీవా! నీవు నా మీద నమ్మకం పెట్టు. నీకు నా పరాక్రమము మీద నమ్మకము లేకుంటే. నేను నీకు నమ్మకం కలిగేట్టు చేస్తాను.” అని అన్నాడు.
వెంటనే దుందుభి అస్థిపంజరము వద్దకు వెళ్లాడు. తన కాలి బొటనవేలితో ఆ అస్థి పంజరమును పదియోజనముల దూరం పడేటట్టు విసిరాడు. అది చూచిన సుగ్రీవునికి మనసులో మరొక సందేహము కలిగింది. రాముని చూచి ఇలా అన్నాడు.
“మిత్రమా! వాలి ఈ కళేబరమును విసిరినపుడు ఇది పూర్తిగా రక్త మాంసములతో బరువుగా ఉండింది. ఇప్పుడు ఎండిపోయి, అస్థిపంజరంగా మారింది. తన మునుపటి బరువును కోల్పోయింది. దీనిని బట్టి నీ బలము అధికమా, వాలి బలము అధికమా అని నిర్ణయించలేము కదా! అందుకని, నీవు ధనుస్సుకు బాణము సంధించి ఆ సాలవృక్షమును కొట్టినచో నాకు నమ్మకము కలుగుతుంది. రామా! నాకు తెలుసు. నీవు ఆ సాలవృక్షమును కొట్టగలవు. ఈ ఒక్కపని చేసి. నాలో ఉన్న సందేహమును తొలగించు.” అని తన మనసులో ఉన్న సందేహమును బయట పెట్టాడు సుగ్రీవుడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment