శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పన్నెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 12)

శ్రీమద్రామాయణము

కిష్కింధాకాండము

పన్నెండవ సర్గ

సుగ్రీవుని మాటలను విన్న రాముడు, అతని మనసులో ఉన్న సందేహమును నివారించ నిశ్చయించుకున్నాడు. మారుమాటాడ కుండా తన ధనుస్సును చేత బట్టుకున్నాడు. శరమును సంధించాడు. ఒకే ఒక బాణంతో ఒక సాల వృక్షము కాదు, వరుసగా ఉన్న ఏడు సాలవృక్షములను పడగొట్టాడు. సుగ్రీవునికి నోట మాట రాలేదు. ఆశ్చర్యపోయాడు. తాను ఒక్క వృక్షమును కొట్ట మంటే ఏడు వృక్షములను కొట్టాడు రాముడు. రాముని కాళ్ల మీద సాష్టాంగ పడ్డాడు.

“రామా! చాలు చాలు. నీవు సాక్షాత్తు ఇంద్రుడినే చంపగల సమర్ధుడవు. నీకు వాలి ఒక లెక్కా! ఏడు సాలవృక్షములను కూల్చిన నీముందు ఎవడు నిలిచి యుద్ధము చేయగలడు? నీవు నాకు మిత్రుడుగా లభించినందుకు నా మనసంతా ఆనందంతో నిండి పోయింది. రామా! చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. వాలిని చంపి నాకు మనశ్శాంతిని చేకూర్చు." అని అన్నాడు సుగ్రీవుడు.

"మిత్రమా! సుగ్రీవా! నీవు చెప్పినట్టే చేద్దాము. ముందు నీవు కిష్కింధకు వెళ్లు. నీ వెనువెంటనే మేము వస్తాము. నీవు వెళ్లి వాలిని యుద్ధానికి రమ్మని పిలువు. వాలితో యుద్ధము చెయ్యి. నేను చాటుగా ఉంది నా బాణముతో వాలిని చంపుతాను." అని అన్నాడు రాముడు.

రాముని మాటల మీద నమ్మకంతో సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లాడు. సుగ్రీవుని మంత్రులు, రాముడు, లక్ష్మణుడు అతని వెంటనే వెళ్లి సమీపములో ఉన్న పొదల మాటున దాగి ఉన్నారు. సుగ్రీవుడు పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. సుగ్రీవుని పిలుపు విని వాలి బయటకు వచ్చాడు.
తాను ఇంతకాలము ఎవరి కోసరం వెతుకుతున్నాడో ఆ సుగ్రీవుడు కంటపడేసరికి, వాలికి కోపం ముంచుకొచ్చింది. సుగ్రీవునితో తలపడ్డాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసుకుంటున్నారు. 

రాముడు పొదల మాటున నిలబడి వాలిని తన బాణంతో కొట్టవలెనని శతవిధాలా ప్రయత్నించాడు. కానీ వాలి, సుగ్రీవుడు ఒకే రూపంలో ఉండటం వలన ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడు అని పోల్చుకోలేకపోయాడు. వాలికి బదులుగా సుగ్రీవుని కొడతానేమో అని భయపడ్డాడు. అందువలన బాణప్రయోగము చేయలేదు.

ఈ లోపల వాలి సుగ్రీవుని చావ చితక కొట్టాడు. వాలి కొట్టిన దెబ్బలకు సుగ్రీవుని శరీరం అంతా రక్తసిక్తము అయింది. ఆ దెబ్బలు తట్టుకోలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతము మీదికి పారిపోయాడు. వాలి సుగ్రీవుని కొంత దూరం తరిమాడు. కాని సుగ్రీవుడు ఋష్యమూక పర్వతము మీదికి పోవడం చూచి, శాపానికి భయపడి వెనుదిరిగి పోయాడు. సుగ్రీవుని వెంట అతని మంత్రులు, రామలక్ష్మణులు వెళ్లారు.

రాముని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు. “ఓ రామా! ఏమిటీ పని! వాలిని యుద్ధానికి పిలువ మన్నావు. వాలిని చంపుతానని నన్ను నమ్మించావు. కాని వాలి చేత నన్ను కొట్టించావు. చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చాను. ఇలా ఎందుకు చేసావు. నేను వాలిని చంపను అని ముందే చెప్పి ఉంటే నేను అసలు వాలితో యుద్ధానికి పోను కదా!" అని దీనంగా పలికాడు.

సుగ్రీవుని చూచి రాముడు జాలి పడ్డాడు. "మిత్రమా! నేను ఏ పరిస్థితులలో బాణం వెయ్యలేదో వివరిస్తాను. కోపం లేకుండా విను. నీవు, వాలి, ఎత్తు, లావు, శరీర ఛాయ అన్నిటిలోనూ ఒకే విధంగా ఉన్నారు. నిన్ను, వాలిని, పోల్చుకోలేకపోయాను. నేను వదిలిన బాణం నీకు తగిలి నీవు మరణిస్తావేమో అని భయపడ్డాను. అప్పుడు మిత్రునికి ద్రోహం చేసినవాడిని అవుతానుకదా! అందుకని బాణం వదలలేదు. నా తొందరపాటుతో గానీ, పొరపాటున గానీ, ఆ బాణం నీకు తగిలితే.
శాశ్వతంగా నీ వంటి మంచి మిత్రుని పోగొట్టుకున్నవాడిని అవుతాను కదా!

నేను నీకు అభయం ఇచ్చాను. వాలిని చంపకపోయినా బాధ లేదు కానీ నిన్ను చంపితే అభయం ఇచ్చిన వాడిని చంపిన పాపం నాకు చుట్టుకుంటుంది. నీవు లేకపోతే మాకు ఎవరు దిక్కు. కాబట్టి నీవు మరలా వాలిని యుద్ధానికి పిలువు. కాని నిన్ను గుర్తించుటకు ఒక ఆనవాలు పెట్టుకో. ఆ ఆనవాలు సాయంతో నేను వాలిని ఒకే ఒక బాణంతో నేలకూలుస్తాను. నీవు నిశ్చింతగా ఉండు.” అని అన్నాడు రాముడు.

రాముడు చుట్టూ చూచాడు. రామునికి ఎదురుగా ఒక పుష్టములతో కూడిన ఒక తీగ కనపడింది. "లక్ష్మణా! పుష్పములతో కూడిన ఆ తీగను తెచ్చి సుగ్రీవుని మెడలో హారంగా అలంకరించు.” అని అన్నాడు. వెంటనే లక్ష్మణుడు పోయి గజపుష్పములతో నిండి ఉన్న తీగను తీసుకొని వచ్చి సుగ్రీవుని మెడలో వేసాడు. ఎర్రగా ఉన్న ఆ పూలు సుగ్రీవుని మెడలో మెరిసిపోతున్నాయి. అందరూ కలిసి తిరిగి కిష్కింధకు వెళుతున్నారు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)