శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఎనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 8)

శ్రీమద్రామాయణము

కిష్కింధాకాండము

ఎనిమిదవ సర్గ

అలా మాట్లాడు కోడంలో సుగ్రీవుడు తనకూ, తన అన్న వాలికి శత్రుత్వము ఎందుకు వచ్చిందీ అన్న విషయం రామునితో చెప్పసాగాడు. “ఓ రామా! నీవు నా స్నేహితుడవు కావడం నా అదృష్టం. దేవతలు నా మీద కరుణ చూపడం వలననే నీవు నా మిత్రుడివి అయ్యావు. నీవు నాకు మిత్రుడుగా, నాకు అండగా ఉంటే నేను ఒక్క కిష్కింధా రాజ్యమే కాదు, స్వర్గలోక ఆధిపత్యము కూడా పొందగలను.

ఓ రామా! నీతో స్నేహం చేయడం వలన నాకు నా బంధుమిత్రులలో గౌరవం పెరిగింది. నా గురించి, నా గుణగణముల గురించి నేను చెప్పుకోకూడదు కానీ, నేను నీకు మంచి స్నేహితుడిని అవుతాను అని మాత్రం చెప్పగలను. ఎందు కంటే అతడు ధనికుడైనా, పేద వాడైనా, సుఖాలలో మునిగి తేలుతున్నా, దు:ఖాలలో కుంగి పోతున్నా, మంచి వాడైనా, చెడ్డ వాడైనా, ఎటువంటి వాడికైనా స్నేహితుడే దిక్కు. స్నేహమునకు మించినది ఈ లోకములో ఏదీ లేదు. స్నేహాన్ని గురించి బాగా తెలిసిన వాళ్లు తన స్నేహితుని కొరకు ధనమును గానీ, సుఖములను గానీ, సంపదలను కానీ ఆఖరుకు ఉన్న ఊరును కానీ, త్యజించుటకు వెనుకాడరు. అటువంటి స్నేహము మనది."అని అన్నాడు సుగ్రీవుడు. రాముడు నవ్వి "మిత్రమా! నువ్వు చెప్పినది యదార్థము.” అని అన్నాడు.

“రామా! నా సోదరుడు వాలి నన్ను అవమానించాడు. నా భార్యను నా నుండి లాక్కున్నాడు. నన్ను రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు. వాలికి భయపడి నేను ఇక్కడ తలదాచుకున్నాను. కాబట్టి నీవు నాకు ఉపకారము చెయ్యాలి" అని మరలా గుర్తు చేసాడు సుగ్రీవుడు.

"మిత్రమా! స్నేహమునకు ఫలము ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమే కదా! ఒకరికి ఒకరు అపకారము చేసుకోవడం శత్రువుల లక్షణము. నేను నీ మిత్రుడను కాబట్టి నీకు అపకారము చేసిన వారిని వధించి, నీకు మేలు చేస్తాను." అని తన ప్రతిజ్ఞను గుర్తు చేసాడు రాముడు.

సుగ్రీవుడు చాలా దీన స్థితిలో ఉన్నాడు అందుకని రామునికి పదే పదే గుర్తు చేస్తున్నాడు. వానరులు చపల స్వభావులు కదా! “రామా! నీవు నా స్నేహితుడవు. అందుకని నా కష్టములను నీతో చెప్పుకుంటున్నాను. సాయం చెయ్యమని పదే పదే అడుగుతున్నాను. ఏమీ అనుకోకు. నీతో నా కష్టములు అన్నీ చెప్పాలని ఉంది. కాని నోరు పెగలడం లేదు." అని కళ్ల నిండా కన్నీరు కారుస్తున్నాడు సుగ్రీవుడు. అతి కష్టం మీద తన దు:ఖమును ఆపుకుంటూ, సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు.

“నీకు చెప్పాను కదా! వాలి నా అన్న. చాలా బలవంతుడు. నన్ను తిట్టాడు. అవమానించాడు. రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు. నేను నా భార్యను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అటువంటి భార్యను నా నుండి దూరం చేసాడు. నా అన్న వాళ్లందరినీ బంధించాడు. నన్ను చంపడానికి ఎంతో మందిని పంపాడు. నేను వారి నందరినీ చంపాను. అందుకే నిన్ను చూచినప్పుడు కూడా నీవు వాలి పంపిన వాడివి అని అనుమానించాను. భయపడ్డాను.
శరీరంలో భయం ఉంటే, దేనిని చూచి అయినా భయపడడం, మానవ స్వభావము కదా! ఇంక మా వానరుల సంగతి చెప్పాలా! ఇదుగో! హనుమంతుడు మొదలగు వారు నా వెంట ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నాను. వీళ్లే నేను నమ్మిన స్నేహితులు. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇదీ నా వృత్తాంతము. ఇంతకన్నా వివరాలు అనవసరము అనుకుంటున్నాను.

వాలి నాకు శతృవు. వాలి నా సోదరుడే అయినప్పటికీ, వాలి చస్తేనే గానీ నా దుఃఖము ఉపశమించదు. నా సమస్తదు:ఖములకు కారకుడు వాలి. నా సుఖజీవనము వాలి మరణం మీద ఆధారపడి ఉంది. రామా! నా దు:ఖమునకు కారణము, నా దు:ఖము ఎలా తీరుతుందో వివరంగా చెప్పాను. కష్టాలలో ఉన్న మిత్రుడికి మిత్రుడే గతికాబట్టి, ఒక మిత్రుడుగా నాకు సాయం చెయ్యి.” అని అన్నాడు సుగ్రీవుడు.

రాముడికి ఒక విషయం బోధపడటం లేదు. సుగ్రీవుడు ఇన్ని విషయాలు చెబుతున్నాడు కానీ అసలు తనకూ, వాలికీ ఎందుకు వైరం వచ్చిందో చెప్పడం లేదు. అడిగితే గానీ చెప్పేట్టు లేడు అని అనుకున్నాడు.

"మిత్రమా! సుగ్రీవా! నీకూ నీ అన్న వాలికీ వైరం ఎందుకు, దేని గురించి, ఏ కారణం చేత కలిగింది. వివరంగా చెప్పు. అప్పుడు మీ ఇద్దరిలో తప్పు ఒప్పు నిర్ణయించడానికి వీలు కలుగుతుంది. అసలు వైరకారణం తెలిస్తే గానీ, మా బలాబలములను సరి చూచుకోడానికి వీలు ఉండదు కదా! అప్పుడు వాలిని సులభంగా అంతమొందించ వచ్చును. నీకు నీ అన్న వలన జరిగిన అవమానమును విని నాకూ కోపం తారస్థాయిని చేరుకుంది. నేను నీ అన్నను చంపేలోగా మీ ఇద్దరి మధ్య ఉన్న వైరమునకు కారణం తెలుసుకోగోరుతున్నాను. నా మీద విశ్వాసము ఉంచి మీ ఇరువురి మధ్య ఉన్న విరోధమునకు కారణం చెప్పు" అని అన్నాడు రాముడు.

ఇంక తప్పదని సుగ్రీవుడు రామునికి తనకు తన అన్న వాలితో ఎందుకు విరోధము వచ్చిందో వివరంగా చెప్పనారంభించాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)