శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 7)
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము
ఏడవ సర్గ
రాముని పలుకులు విన్న తరువాత సుగ్రీవునకు కూడా దు:ఖము ముంచుకొచ్చింది. దుఃఖముతో పూడుకుపోయిన గొంతుతో సుగ్రీవుడు ఇలా అన్నాడు.“రామా! సీతను అపహరించిన ఆ రాక్షసుని నివాసము గానీ, వాడి పరాక్రమము గానీ, బలము కానీ నాకు తెలియదు. కాని నా శాయశక్తులా ప్రయత్నించి వాడిని గురించి తెలుసుకుంటాను. నీ దు:ఖమును విడిచి పెట్టు. నన్ను నమ్ము. నిశ్చింతగా ఉండు. నీ భార్యను నీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఇదే నా ప్రతిజ్ఞ. నీవు అతి త్వరలో సీతను అపహరించిన ఆ రావణుడు అనే రాక్షసుని చంపి సీతను పొందు తావు.
కాని ముందు నీవు ఈ దుఃఖమును, దీనత్వమును, వదిలి పెట్టు. ధైర్యము అవలంబించు. నీ పరాక్రమాన్ని, వీరత్వాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ వలెనే నా భార్యను కూడా ఎత్తుకు పోయారు. కానీ నేను నీ వలె దు:ఖించడం లేదు. క్రుంగి పోవడం లేదు. ధైర్యము విడిచి పెట్టలేదు. నా భార్యను ఎత్తుకుపోయిన వాలిని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను. నా వంటి సాధారణ వానరుడే పోయిన భార్యను గురించి చింతించడం లేదంటే ఇంక నీ వంటి ధీరోదాత్తుడు, పరాక్రమవంతుడు, పండితుడు ఇలా దీనంగా భార్యకోసరం ధైర్యాన్ని విడనాడి దు:ఖించడం ఏమాత్రం తగదు.
బుద్ధిమంతుడైన వాడు ఆపదలలో గానీ, ధన నష్టము సంభవించి నప్పుడు గానీ, ప్రాణాపాయ స్థితిలో గానీ, ధైర్యమును విడిచిపెట్టడు. దు:ఖించడు. బుద్ధికి పదును పెట్టి తగిన ఉపాయము గురించి ఆలోచిస్తాడు. అలా కాకుండా మూర్ఖత్వముతో ఎల్లప్పుడూ దీనత్వముతో ఉండేవాడు, తన మనసును తన అధీనములో ఉంచుకోలేక, నడి సముద్రంలో నావలాగా మునిగిపోతాడు.
కాబట్టి ఓ రామా! ఒక స్నేహితుడుగా నిన్ను వేడుకుంటున్నాను. దీనత్వాన్ని వదిలిపెట్టు. శోకానికి స్వస్తి చెప్పు. బుద్ధికి పదునుపెట్టు. పౌరుషాన్ని తెచ్చుకో. ఎందుకంటే అనుక్షణం శోకంతో కుమిలిపోయేవాడికి సుఖం ఎంతో దూరంలో ఉంటుంది. శోకార్తునకు అన్నీ సందేహాలే కలుగుతాయి. వాడు ఏ పనీ సక్రమంగా చెయ్యలేడు. ధైర్యవంతుడు అన్ని పనులు సక్రమంగా నిర్వహించగలడు. రామా! నేను నీకు నీతులు ఉపదేశించడం లేదు. కేవలం ఒక స్నేహితుడుగా నీ దుఃఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను." అని సుగ్రీవుడు రామునికి సాంత్వన చేకూర్చడానికి ప్రయత్నించాడు.
సుగ్రీవుని మాటలకు రాముడు స్వస్థత పొందాడు. సుగ్రీవుని కౌగలించుకొని ఇలా అన్నాడు. "మిత్రమా సుగ్రీవా! హితమును కోరే స్నేహితుడు ఎలా చేస్తాడో అదే నువ్వు చేసావు. నీ సాంత్వన వచనములతో నాకు స్వస్థత లభించింది. నీ వంటి స్నేహితుడు, బంధువు నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. నీవు నాకు ఇచ్చిన మాట ప్రకారము, సీతను, ఆ రావణుడు అనే రాక్షసుని వెతికే ప్రయత్నం చెయ్యాలి. దానికి ప్రతిఫలంగా నేను నీకు ఏం చెయ్యాలో వివరంగా చెప్పు. మన ఇరువురి కార్యములు సఫలం అవుతాయి అనే నమ్మకం నాకు ఉంది. నా సాయం గురించి నీవు సందేహించకు. నేను ఇప్పటి దాకా అబద్ధము చెప్పలేదు. ఇంక మీదట చెప్పను కూడా. నీకు సాయం చేస్తాను అని ప్రతిజ్ఞచేస్తున్నాను.” అని అన్నాడు రాముడు.

రాముని మాటలు విని సుగ్రీవుడు, హనుమంతుడు ఎంతో సంతోషించారు. రాముడు చేసిన ప్రతిజ్ఞను విని సుగ్రీవుడు తన పని సఫలం అయినట్టే అని ఎంతో సంతోషించాడు. తరువాత రాముడు, సుగ్రీవుడు ఒక ఏకాంత ప్రదేశములో కూర్చుని తమ కష్టసుఖములు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment