శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 6)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ఆరవ సర్గ
సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు. “రామా! నీ గురించి హనుమంతుడు నాకు అంతా చెప్పాడు. నీవు నీ సోదరుడు లక్ష్మణుడు ఈ అరణ్యవాసము ఎందుకు చేస్తున్నారో వివరంగా చెప్పాడు. నీ భార్య సీతను మీరు లేని సమయమున ఒక రాక్షసుడు అపహరించిన విషయం కూడా చెప్పాడు. నీవు నాకు మిత్రుడవు అయినావు. ఇంక నీ దు:ఖమును విడిచి పెట్టు. నీ భార్యఎక్కడ ఉన్నా వెతికి తీసుకొని వచ్చి నీకు అప్పగిస్తాను. నీ దుఃఖాన్ని తొలగిస్తాను. నీ భార్య ఆకాశములో ఉన్నా, పాతాళములో ఉన్నా వెతికి తీసుకొని వస్తాను. ఇది సత్యము. నేను మాట తప్పను.
రామా! నీవు చెబుతుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంది. ఒక రోజు మేమందరమూ ఈ పర్వత శిఖరము మీద కూర్చుని ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుకు పోవడం, ఆమె రామా, రామా అని అరవడం మేము చూచాము. ఆమె సీతయే. సందేహము లేదు. ఆ రాక్షసుడు రావణుడు అయి ఉంటాడు. ఆమె అలా ఏడుస్తూ తన పైనున్న వస్త్రములో కొన్ని ఆభరణములను మూటగా కట్టి జారవిడిచినది. ఆ మూట మా దగ్గర పడింది. మేము వాటిని మా దగ్గరే ఉంచాము. వాటిని నీకు చూపిస్తాను. ఆ ఆభరణములను నీవు గుర్తు పట్టగలవేమో చూడు.”అని అన్నాడు సుగ్రీవుడు.
ఆ మాటలు విని రాముడు ఉత్సాహంగా "మిత్రమా! ఆ ఆభరణములు వస్త్రము త్వరగా తీసుకొనిరా. నా సీత ఆభరణములు, వస్త్రము నేను చూడాలి." అని ఆతురతగా అన్నాడు రాముడు.
సుగ్రీవుడు వెంటనే పక్కనేఉన్న గుహలోకి వెళ్లాడు. క్షణములో ఒక ఉత్తరీయములో కట్టబడిన ఆభరణములను తీసుకొని వచ్చాడు. “రామా! ఇదే ఆ వస్త్రము. ఇవే ఆ ఆభరణములు. చూడు. ఇవి నీ భార్య సీతకు చెందినవేమో!"అని అన్నాడు.
రాముడు ఆ ఉత్తరీయమును, ఆభరణములను చూచాడు. రాముని కళ్లనిండా నీళ్లు కమ్మాయి. ఏమీ కనిపించడం లేదు మనసు వశం తప్పింది. “హా సీతా!" అంటూ కిందపడి పోయాడు. రాముడు ఆ ఆభరణములను ఉత్తరీయమును తన గుండెలకు హత్తుకున్నాడు. రాముని శ్వాస భారంగా వస్తూ ఉంది. నోట మాట రావడం లేదు. ఉ ద్వేగంతో ఉన్నాడు. రాముని కళ్ల నుండి నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఏడుస్తూ లక్ష్మణుని వంక చూచాడు.
"లక్ష్మణా! సీతను ఆ రాక్షసుడు అపహరించుకు పోతున్నప్పుడు సీత జారవిడిచిన ఆభరణములు, ఉత్తరీయము చూడు. ఇవి మెత్తని గడ్డి మీద పడి ఉంటాయి. అందుకనే విరిగిపోకుండా ఉ న్నాయి. లక్ష్మణా! సీత ఆభరణములను నీవు గుర్తు పట్టగలవా!"అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! నాకు సీత ధరించే ఏ ఆభరణముల గురించి అంతగా తెలియదు. నేను ప్రతిరోజూ ఆమెకు పాదాభివందనము చేయునపుడు ఆమె కాళ్లకు ధరించే నూపురములు చూస్తూ ఉంటాను. కాబట్టి అవి మాత్రమే గుర్తు పట్టగలను.” అని అన్నాడు.
ఆ ఆభరణములను చూచి రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “సుగ్రీవా! ఇవి నిస్సంశయముగా నా సీత ఆభరణములే. ఇది నా సీత ధరించిన ఉత్తరీయము. సీతను అపహరించిన ఆ రాక్షసుడు సీతను ఏ దేశమునకు తీసుకొని వెళ్లాడో చెప్పగలవా? ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో చెప్పగలవా? వాడి మూలంగా రాక్షస జాతి అంతా సర్వనాశనం అవుతుంది. ఇది సత్యము. సీతను అపహరించి ఆ రాక్షసుడు తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. సుగ్రీవా! చెప్పు. ఆ రాక్షసుడి గురించిన వివరాలు చెప్పు. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు. ఇప్పుడే వాడిని సంహరిస్తాను." అని కోపావేశంతో ఊగిపోతూ అన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment