శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఐదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 5)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ఐదవ సర్గ
హనుమంతుడు రామలక్ష్మణులను తన బుజముల మీద ఎక్కించుకొని ఋష్యమూక పర్వతము నుండి మలయ పర్వతమునకు తీసుకొని వెళ్లాడు. రామలక్ష్మణులను మలయపర్వతము మీద దించి, సుగ్రీవుని వద్దకు వెళ్లాడు.“ఓ సుగ్రీవా! వీరు రాముడు లక్ష్మణుడు అనే పేర్లు గల రాజకుమారులు. నేనే వీరిని నా వెంట తీసుకొని వచ్చాను. రాముడు మహా పరాక్రమ వంతుడు. రాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టిన వాడు. ధర్మము తెలిసిన వాడు. దశరథుని కుమారుడు. తండ్రి ఆజ్ఞప్రకారము వనవాసము చేస్తున్నాడు. రాముడు వనవాసము చేయుచుండగా రావణుడు అనే రాక్షసుడు ఈయన భార్య సీతను అపహరించాడు. ఆ రాముడు ప్రస్తుతము నీ శరణు కోరుతున్నాడు. రాముడు, లక్ష్మణుడు నీతో స్నేహము చేయవలెనని అభిలషిస్తున్నారు. వీరి స్నేహమును అంగీకరించు. దీని వలన మీ ఇద్దరికీ లాభము చేకూరుతుంది. వీరిరువురూ పూజింప తగిన వారు. వీరిని మిత్రులుగా స్వీకరించి పూజించు." అని పలికాడు హనుమంతుడు.
ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషించాడు. రాముని చూచి ఇలా అన్నాడు. “ఓ రామా! మీ గుణగణముల గురించి హనుమంతుడు నాతో చెప్పాడు. మీరు ఉత్తమ మానవులు. నేను వానరుడను. ఈ వానరుడితో స్నేహము కోరుతున్నారంటే, ఇది మీరు నాకు చేస్తున్న సత్కారముగా భావిస్తున్నాను. మీకు నాతో స్నేహం చేయడం ఇష్టం అయితే, నా చేతులు మీకోసం చాస్తున్నాను. మీ చేతితో నా చేతిని తాకండి. కరచాలనం చెయ్యండి." అని అన్నాడు సుగ్రీవుడు.
సుగ్రీవుడు పలికిన పలుకులు విన్న రాముడు చాలా సంతోషించాడు. సుగ్రీవుని హస్తము పట్టుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం అంగీకరించాడు. సుగ్రీవుని గాఢంగా కౌగలించుకున్నాడు. ఈ సన్నివేశము చూచి హనుమంతుడు చాలా ఆనందించాడు. రెండు కర్రలతో నిప్పుపుట్టించాడు. అగ్ని రగిల్చాడు. ఆ అగ్నిని రాముడు సుగ్రీవుని మధ్య ఉంచాడు. రాముడు, సుగ్రీవుడు ఆ అగ్ని చుట్టు ప్రదక్షిణము చేసారు. అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవులు మిత్రులయ్యారు.
సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు. “మనము ఇద్దరమూ సమానమైన దు:ఖములో ఉన్నాము. ఒకరి దు:ఖములను ఒకరం పంచుకుందాము. ఇకమీదట మన సుఖదు:ఖములను సమానంగా
పంచుకుందాము." అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు పక్కనే ఉన్న సాల వృక్షము నుండి ఒక కొమ్మను విరిచాడు. కింద పరిచాడు. రాముడు సుగ్రీవుడు దాని మీద కూర్చున్నారు. తరువాత హనుమంతుడు ఒక చందన వృక్షము కొమ్మను తెచ్చి లక్ష్మణునికి కానుకగా ఇచ్చాడు. సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు.
“ఓ రామా! నా అన్న వాలి నన్ను చాలా అవమానించాడు. నాతో శతృత్వము పెంచుకున్నాడు. నా నుండి నా భార్యను లాక్కున్నాడు. నన్ను రాజ్యము నుండి తరిమేసాడు. నేను, నా అన్న వాలికి భయపడి, అపరిమిత మైన దుఃఖమును అనుభవిస్తూ, ఈ ఋష్యశృంగ పర్వతము మీద నివసిస్తున్నాను. రామా! ఇప్పుడు నాకు నీ అభయము కావాలి. నాకు వాలి నుండి రక్షణ కావాలి. నా రాజ్యము నాకు కావాలి. నా భార్య నాకు కావాలి. ఇదంతా నీ వల్లే జరగాలి." అని అన్నాడు సుగ్రీవుడు.
రాముడు సుగ్రీవుని మాటలకు నవ్వుతూ ఇలా అన్నాడు. “నేను నీకు తప్పకుండా సాయము చేస్తాను. నీ భార్యను అపహరించిన వాలిని చంపి నీ భార్యను నీకు తెచ్చి అప్పగిస్తాను. ఈ బాణములు చూచావు కదా. ఇవి అమోఘమైనవి. వీటితో వాలిని వధిస్తాను.” అని అన్నాడు రాముడు.
రాముని మాటలు విని సుగ్రీవుడు పరమానంద భరితుడయ్యాడు. “ఓ రామా! నీ మాటలు వింటుంటే నాకు నా భార్యను తిరిగి పొందినంత ఆనందంగా ఉంది. నాకు వాలి వలన కలిగిన
భయాన్ని శాశ్వతంగా తొలగించు. వాలి నన్ను మరలా ఎటువంటి బాధ పెట్టకుండా చెయ్యి" అని అన్నాడు సుగ్రీవుడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment