శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నాలుగవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 4)

శ్రీమద్రామాయణము

కిష్కింధాకాండము

నాలుగవ సర్గ

లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు వారు తమకు శత్రువులు కారనీ, వాలి పంపిన వారు కారనీ, ఒక కార్యము నిమిత్తము తిరుగుతున్నారనీ, వీరి మైత్రితో సుగ్రీవుని కష్టములు కూడా గట్టెక్కుతాయని సంతోషించాడు. వీరు కూడా సుగ్రీవుని వలె కష్టములలో ఉన్నట్టున్నారు. వీరి కష్టములను సుగ్రీవుడు తీర్చగలడు. అప్పుడు వీరు కూడా సుగ్రీవునకు సాయము చెయ్యగలరు. వాలి నుండి సుగ్రీవునికి రాజ్యప్రాప్తి కలుగుతుంది.” అని సంతోషించాడు.

తరువాత హనుమంతుడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “మీరు చూడబోతే మునికుమారులవలె ఉన్నారు. కాని చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు ఎవరికోసమో వెతుకుతున్నట్టు కనపడుతూ ఉంది. మీ గురించి వివరంగా చెప్పండి. మీ మాటలు నేను మా రాజుకు చెప్పాలి కదా!" అని అన్నాడు హనుమంతుడు.

అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు. "ఓ హనుమా! ఈయన పేరు రాముడు. ఇక్ష్వాకు వంశములో జన్మించిన అయోధ్యాధిపతి దశరథుని పెద్ద కుమారుడు. గుణవంతుడు, రాజ్యము చేయుటకు అర్హుడు. కాని ఒకానొక కారణమున రామునికి రాజ్యము లభించలేదు. పైగా అరణ్యవాసము సంప్రాప్తించింది. రాముని భార్య పేరు సీత. సూర్యుని విడిచి కాంతి ఉండలేనట్టు, రాముని భార్య సీత కూడా, భర్తను విడిచి ఉండలేక, రామునితోపాటు అరణ్యములకు వచ్చింది.
నేను రాముని తమ్ముడను. నా పేరు లక్షణుడు. నేను నా అన్న వదిలను సేవించుకుంటూ వారి వెంట అరణ్యములకు వచ్చాను. మేము పర్ణశాలలో లేని సమయమున, సీత ఒంటరిగా ఉన్నప్పుడు, మాయావి అయిన ఒక రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించాడు. మేము సీతను వెతుకుతూ ఉండగా, మా తండ్రి దశరథునికి మిత్రుడు అయిన జటాయువు అనే పక్షిరాజు కనిపించి, సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి, దక్షిణ దిక్కుగా ఆకాశమార్గమున తీసుకొని వెళ్లాడు అని చెప్పాడు.

తరువాత మేము అడవిలో సీతను గూర్చి వెతుకుతూ ఉండగా, దనువు అనే వాడు శాపవశమున వికృతాకారముతో మమ్ములను కబళించడానికి ప్రయత్నించాడు. అతని వలన మాకు మీ సుగ్రీవుని గురించి తెలిసింది. సీతను అపహరించిన వారి గురించి తెలుసుకొనడంలో సుగ్రీవుడు సామర్థ్యము కలవాడు అని అతడు మాకు తెలిపాడు. సుగ్రీవుని వెతుకుతూ మేము ఇక్కడకు వచ్చాము.

నీ ప్రశ్నలకు సమాధానంగా నేను మా గురించి, ఇక్కడకు మా రాక గురించి వివరంగా చెప్పాను. మేము మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాము. నేను, రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు పొందాము. అయోధ్యాధిపతిగా ఉన్నప్పుడు ఏ రాముడు తన ప్రజలకు ధన కనక వస్తు వాహనములను విరివిగా పంచి పెట్టాడో, ఏ రాముడు ముల్లోకములకు రక్షకుడో ఆ రాముడు మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాడు. ఏ దశరథుడు అందరికీ శరణాగత రక్షకుడుగా ఉండేవాడో, ఆ దశరథకుమారుడు రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు కోరుతున్నాడు. ధర్మాన్ని పాలిస్తూ, లోకమునకు రక్షణ అందించిన నా రాముడు మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాడు." అని అన్నాడు లక్ష్మణుడు.  

లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. “మా సుగ్రీవుడు మీతో తప్పకుండా మైత్రి చేస్తాడు. సుగ్రీవుడు కూడా బాధలలో ఉన్నాడు. సుగ్రీవుడు తన అన్న వాలితో వైరము పెట్టుకున్నాడు. ఎందుకంటే, వాలి తన తమ్ముడు సుగ్రీవుని భార్యను అపహరించాడు. సుగ్రీవుని అవమానించాడు. రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. మీ మాదిరి మా రాజు సుగ్రీవుడు కూడా అరణ్యములలో దీనంగా కాలం గడుపుతున్నాడు. మా రాజు సుగ్రీవుడు మాతో కలిసి సీతను వెదకడంలో మీకు సాయపడగలడు. మేమందరమూ కలిసి సీతను వెదుకుతాము. రండి మనం అందరము మా రాజు సుగ్రీవుని వద్దకు వెళదాము." అని అన్నాడు హనుమంతుడు.

ఆ మాటలు విన్న లక్ష్మణుడు రాముని చూచి “రామా! సుగ్రీవునికి కూడా మన అవసరము ఉంది. మనకూ సుగ్రీవుని అవసరము ఉంది. కాబట్టి మన కార్యము సఫలము అయినట్టే. ఇతని మాటలు ముఖ కళవళికలు చూస్తుంటే నాకు ఇతని మీద నమ్మకం కలుగుతూ ఉంది. ఇతని ముఖం చూస్తే ఇతడు అబద్ధం ఆడతాడు అని అనిపించడం లేదు. మనం వీరితో స్నేహం చేయవచ్చు." అని అన్నాడు లక్ష్మణుడు.

ఇంతలో హనుమంతుడు తన సన్యాసి రూపము విడిచి తన నిజరూపము అయిన వానర రూపము ధరించాడు. శరీరం పెంచాడు. రామలక్ష్మణులను తన బుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్లాడు. హనుమంతుడు కూడా తన రాజు సుగ్రీవునికి మరలా రాజ్య పాప్తి కలుగుతుందనే సంతోషంతో రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)