శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - మూడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 3)
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము
మూడవ సర్గ
సుగ్రీవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు హనుమంతుడు. వెంటనే ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులు ఉన్నచోటికి వెళ్లాడు. హనుమంతుడికి ఆ మానవులు ఎవరో తెలియదు. అందుకని నిజరూపంతో పోకుండా ఒక సన్యాసి వేషము ధరించాడు. రామలక్ష్మణుల ముందుకు వెళ్లాడు. రామ లక్ష్మణులు సన్యాసి వేషములో ఉన్న హనుమంతుని చూచి అభివాదము చేసారు.రామలక్ష్మణులను చూచి హనుమంతుడు ఇలా అన్నాడు.
“మీరు ముని కుమారులవలె ఉన్నారు. కాని మీ చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు వీరుల వలె కనపడుతున్నారు. కాని జటాజూటములు ధరించి ఉన్నారు. మీరు ఒకరిని ఒకరు పోలి ఉన్నారు. కవలలవలె ఉన్నారు. మీరు దేవలోకము నుండి దిగివచ్చిన సూర్య చంద్రుల మాదిరి కనపడుతున్నారు. దేవతారూపములలో ఉన్న మానవుల మాదిరి కనపడుతున్నారు. మీరు ఆజానుబాహులుకదా! మరి మీరు ఎటువంటి అలంకారములు ధరించలేదేమి? మిమ్ములను చూస్తుంటే మీరు ఈ భూమండలము అంతా పరిపాలించ గల సమర్థులు అని నమ్ముతున్నాను. మీ గురించి మాకు తెలపండి. ఇంక నా గురించి చెబుతాను వినండి. నా పేరు హనుమంతుడు. వానర రాజు సుగ్రీవుడు మా ప్రభువు. ఈ ఋష్యమూక పర్వతము మీద ఉన్నాడు. ఆయన మీ గురించి తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు. కాబట్టి మీ వివరాలు నాకు తెలియజేయండి." అని పలికాడు హనుమంతుడు.
ఆ మాటలకు రాముడు చాలా సంతోషించాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది అని అనుకున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా! మనము ఎవరి కోసరం వెదుకుతున్నామో ఆ సుగ్రీవుని మంత్రి మనవద్దకు వచ్చాడు. ఈ వానరుని మాటలు చూడగా మనతో స్నేహము చేయవలెనని తలంపుతో ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఇతడు చాకచక్యంగా మాట్లాడటం తెలిసిన వాడు. మంచి స్నేహశీలి. కాబట్టి లక్ష్మణా! ఇతనితో నీవు మాట్లాడు. నాకు చూడగా ఇతడు నాలుగు వేదములు, వ్యాకరణశాస్త్రము చదివిన వాడులాగా కనపడుతున్నాడు. లేకపోతే ఇంత చాకచక్యముగా, ఒక్క అపశబ్దము కూడా లేకుండా మాటలాడలేడు. లక్ష్మణా! ఇతని శరీరములో ఎక్కడా ఒక్క అవలక్షణము కూడా కనపడటం లేదు. సర్వలక్షణ సంపన్నుడు లాగా ఉన్నాడు. ఇతని మాటలు వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తూ ఉంది కానీ విసుగురావడం లేదు. కాబట్టి నీవు అతనితో మాటలాడుము." అని అన్నాడు రాముడు.
అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో తాము వచ్చిన పని సూటిగా తెలిసాడు. " మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులము. ఇతను రాముడు. నా పేరు లక్ష్మణుడు. నా అన్న రాముని భార్యను ఎవరో రాక్షసుడు అపహరించాడు. ఆమెను మేము వెతుకుతున్నాము. మీ రాజు సుగ్రీవుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడని తెలిసింది. అందువలన మీ రాజు సుగ్రీవునితో స్నేహము చేయవలెనని, పరస్పర సాయము చేసుకొనవలెనని అభిలషించుచున్నాము.” అని సూటిగా బదులు చెప్పాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడు పలికినపలుకులు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. తన రాజు సుగ్రీవుని పని కూడా సానుకూలము అవుతుందని మనసులో అనుకున్నాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment