శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 2)
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము
రెండవ సర్గ
రామ లక్ష్మణులను చూచి పారి పోయిన సుగ్రీవుడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఒక చోట నిలవడం లేదు. అన్ని దిక్కులా చూస్తున్నాడు. రామలక్ష్మణులు ఎటు వైపు నుండి వచ్చి తన మీద దాడి చేస్తారేమోనని భయంతో వణికిపోతున్నాడు. మహాబలవంతులు, ధనుర్బాణములు ధరించిన రామలక్ష్మణులను చూచి సుగ్రీవునకు ధైర్యం సడలిపోయింది. బాగా ఆలోచించాడు. తన బలం గొప్పదా లేక ఆ మానవుల బలం గొప్పదా అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. తనతో పాటుగా ఉన్న మంత్రులను పిలిచాడు. వారికి రామలక్ష్మణుల గురించి చెప్పాడు.“అదుగో అటు చూడండి. ఆ మానవులు ఇద్దరూ నారచీరలు కట్టుకొని, ధనుర్బాణములు ధరించి దేనికోసమో వెదుకుతున్నారు. వారు వాలి పంపిన వారు అని నా అనుమానము. లేకపోతే క్రూరమృగములు సంచరించు, మానవులు చొరరాని ఈ దుర్గమారణ్యములో ఈ మానవులకు ఏమి పని. వీరు నిశ్శంశయంగా వాలి నాకోసం పంపినవారే. మనము ఇక్కడి నుండి వేరు చోటికి వెళ్లడం మంచిది." అని అన్నాడు సుగ్రీవుడు.
సుగ్రీవుని మాట ప్రకారము ఆ వానరులు అందరూ వేరే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అందరూ వలయాకారంలో కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు. ఆ వానరులలో హనుమంతుడు అనే పేరుగల వానరుడు, రామలక్ష్మణులను గురించి భయపడుతున్న సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు.
“ఓ వానర రాజా! నీవు ఎందుకు వాలిగురించి భయపడ తావు. మనము మలయ పర్వతము మీద ఉన్నాము. వాలి ఈ పర్వతము మీదికి రాలేడు. కాబట్టి వాలి వలన మనకు భయం లేదు. అదీ కాకుండా మనకు కనుచూపు మేరలో వాలి కనపడటం లేదు కదా. మరి నువ్వు వాలి గురించి ఎందుకు భయపడుతున్నావు. నీ భయానికి నాకు కారణం కనిపించడం లేదు. నీవు వాలి గురించి అనవసరంగా భయపడుతున్నావు. ఆ భయం వలన నీకు బుద్ధి క్షీణించింది. పైగా వానరసహజమైన చపలత్వము నిన్ను ఆవహించింది.
సుగ్రీవా! నీవు వానర రాజువు. రాజే ఇలా భయపడితే ఎలాగ? నీ మనస్సును ధృఢంగా ఉంచుకో. అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దు. స్థిరమైన బుద్ధితో ఆలోచించు. స్థిరబుద్ధితో ఆలోచించ లేని రాజు ప్రజలను పాలించడానికి అర్హుడు కాడు. కాబట్టి భయపడటం మాను." అని హితోపదేశం చేశాడు హనుమంతుడు.
హనుమంతుని మాటలతో సుగ్రీవుని భయం తగ్గింది. హనుమంతునితో సుగ్రీవుడు ఇలా అన్నాడు. “అది కాదు హనుమాన్! ఆ మానవులను చూడు. వారు ఆజానుబాహులు. ధృఢకాయులు. ధనుర్బాణములు ధరించిన వారు. వారిని చూచి ఎవరికి భయం కలగదు చెప్పు. వారు వాలి పంపగా నాకోసం వచ్చినవారే. సందేహము లేదు. లేకపోతే ఆ మానవులకు ఈ ఘోరారణ్యములో ఏమి పని. వాలికి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వారిలో వీరూ ఒకరేమో! వీరిని వాలి పంపాడేమో! వాలిని నమ్మకూడదు. శత్రువులను ఒక కంటితో కనిపెట్టి ఉండటం రాజధర్మం కదా! అందులోనూ కపటంగా వ్యవహరించే వాలితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. భయపడకుండా, వారేం చేస్తారులే అని నిర్లక్ష్యంగా ఉంటే, అదును చూచి శత్రువులు మన మీద దెబ్బతీస్తారు. పైగా వాలి చాలా తెలివిగలవాడు. మన గురించి అన్ని విషయములను సేకరిస్తూ ఉంటాడు. అలాంటి వారి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి మనం ఒక పని చేద్దాము. ఓ వానర వీరుడా! హనుమా! నువ్వు సామాన్య మానవుని వేషంలో ఆ మానవుల వద్దకు వెళ్లు. వారి ఇంగితమును గ్రహించు. నీ మాటలతో వారు ఎవరో! ఎక్కడ నుండి వచ్చారో! ఇక్కడకు ఎందుకు వచ్చారో! ఎవరి కోసరం వచ్చారో నేర్పుగా మాట్లాడి తెలుసుకో! వారిని నీ పొగడ్తలతో సానుకూల పరుచుకో. చక్కగా మాట్లాడు. వారి మనోభావాలను గుర్తించు. వారికి నీ మీద విశ్వాసం కలిగేటట్టు ప్రవర్తించు. అసలు వారు ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకో. ఆ మానవులు ఏమైనా దురాలోచనలతో వచ్చారా! లేక నిర్మలమైన మనస్సులతో వచ్చారా అనే విషయం గహించు. అసలు వాళ్లు మంచి వాళ్ల లేక చెడ్డ వాళ్ల అనే విషయాన్ని వారి మాట్లాడే మాటలను బట్టి పసిగట్టు. వెళ్లు. కార్యము సానుకూలం చేసుకొని రా!" అని సుగ్రీవుడు హనుమంతుని రామలక్ష్మణుల వద్దకు దూతగా పంపాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment