శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - మొదటి సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 1)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

మొదటి సర్గ

రామ లక్ష్మణులు పంపా సరస్సును సమీపించారు. ఆ సరస్సు చూడటానికి చాలా మనోహరంగా ఉంది. సరస్సునిండా పద్మములు,కలువలు వికసించి ఉన్నాయి. ఆ సరస్సు అందాలు చూడగానే రాముని హృదయం అంతా బాధతో నిండి పోయింది.

"లక్ష్మణా! ఈ సరస్సు చూడు ఎంత హృదయానందాన్ని కలిగిస్తూ ఉందో. కాని సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ సరస్సు అందాలు ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు. సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ ప్రకృతి అందాలు ఇంకా దు:ఖమును ఎక్కువ చేస్తున్నాయి. నా మనోవ్యధ ఎప్పుడు తీరుతుందో ఏమో! కాని లక్ష్మణా! ఈ వనములో ఉన్న పుష్పముల మీదినుండి వీచు గాలి మనకు మార్గాయాసమును పూర్తిగా తొలగించినది.

లక్ష్మణా! ఆ కోయిలలు చూడు ఎలా కూస్తున్నాయో. సీత కూడా ఆ కోయిల కూతలు విని నన్ను పిలిచి ఆ కోయిల కూతలు నాకూ వినిపించేది. నా సీత నాకు దొరకని పక్షంలో, నా సీతను నేను చూడని పక్షంలో నేను బతికి ఉండటం వృధా! ఇటువంటి సుందర దృశ్యములు ఎన్ని చూచినా సీతను చూచిన దానితో సాటి రావు కదా! పైగా ఈ వసంత ఋతువు దృశ్యములు, ఈ మలయమారుతము, వసంత శోభ నా వ్యధను ఎక్కువ చేస్తున్నాయి. నా సీతను ఆ రాక్షసుడు ఎత్తుకొని పోకపోయి ఉంటే నేను కూడా సీత తో కలిసి ఈ వసంత ఋతువు శోభను తనివిదీరా అనుభవించేవాడిని కదా!

లక్ష్మణా! సీత బతికి ఉంటే, సీత ఉన్న చోటున కూడా ఈ వసంత ఋతువు ఉంటుంది కదా! సీత కూడా నా మాదిరే విరహవేదన అనుభవిస్తూ ఉంటుంది కదా! నా మాదిరే సీత కూడా ఈ వసంత శోభను అనుభవించలేదు కదా! అవును. ఈ మనోహర దృశ్యములు ఆమెకు కూడా ఏమాత్రం ఆనందాన్ని కలిగించలేవు. ఎందుకంటే నేను, సీత దేహాలు వేరైనా మా మనసులు ఒకటే. నా మనస్సు ఆమె మీద, ఆమె మనస్సు నా మీదా లగ్నం అయి ఉన్నాయి.

లక్ష్మణా! నేను సీత కలిసి ఉన్నప్పుడు మా ఇద్దరికీ ఆహ్లాదమును కలిగించిన ఈ మలయమారుతము ప్రస్తుతము నాకు అగ్ని వీచికలవలె తాకుతూ ఉన్నాయి. 

లక్ష్మణా! చూచావా! ఆ కాకి ఎలా అరుస్తూ ఉందో! నాకు మరలా సీతా సంయోగం కలుగుతుందని చెబుతూ ఉన్నట్టు లేదూ! సీతకు పద్మములు అంటే ఎంతో ఇష్టం. ఈ పంపా సరోవరములో ఉన్న పద్మములను చూచి సీత ఎంత సంతోషించేదో కదా! సీత లేకుండా నేను ఈ పద్మముల శోభను అనుభవించలేకున్నాను.

లక్ష్మణా! సీత నా దగ్గరగా ఉన్నప్పుడు నాకు ఏయే వస్తువులు, దృశ్యములు ఆనందాన్ని కలిగించాయో అవే వస్తువులు,అవే దృశ్యములు ఇప్పుడు నాకు భేదాన్ని కలిగిస్తున్నాయి. 

లక్ష్మణా! సీత నాకు కనపడితే, సీతతో సహా నేను ఇక్కడనే స్థిరనివాసము ఏర్చరచు కొనవలెనని కోరికగా ఉంది. సీతతో సహా ఇక్కడ ఉంటే, నాకు దేవేంద్రపదవి కూడా అక్కరలేదు అనిపిస్తూ ఉంది. అయోధ్యకు కూడా తిరిగి వెళ్లను. ఇక్కడే ఉండిపోతాను. ఈ వనసీమలలో, ఈ సరోవర తీరములలో, పచ్చికబయళ్లలో సీతతో విహరిస్తూ ఉంటే, నాకు ఏ చింతా ఉండదు. ఏ వస్తువూ కావాలని అనిపించదు. ఈ అందమైన పంపాసరస్సులో నేను సీత జలకాలాడటం కన్నా ఆనందం
ఏముంటుంది చెప్పు.

లక్ష్మణా! నేను లేకుండా నా సీత ఇంకా ప్రాణాలతో ఉంటుందంటావా! ఏమో! ఆలోచించే కొద్దీ నా మనసు వికలం అవుతూ ఉంది. సీత తండ్రి జనకమహారాజు వచ్చి నా సీత ఏదీ అని అడిగితే ఏమని చెప్పాలో అర్థంకావడం లేదు. నా దురదృష్టం కొద్దీ నేను రాజ్యాన్ని పోగొట్టుకొని అడవులకు వచ్చాను. సీత కూడా నా వెంట రావాలా! ఒకవేళ వచ్చినా రాక్షసుల చేత అపహరింపబడాలా! అంతా నా దురదృష్టం కాకపోతే మరేమిటి! రాజ్యభ్రష్టుడు, బుద్ధిలేని వాడు అయిన నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన సీత లేకుండా నేను ఎలా జీవించేది!

లక్ష్మణా!సీత ఎంత మధురంగా మాట్లాడేది. నాతో పరిహాసమాడేది. అటువంటి సీత పలుకులు మరలా ఎప్పుడు వింటానో కదా! నాతో పాటు అడవిలో ఎన్నో కష్టములు అనుభవించుచున్నా, సీత తాను ఏ కష్టములు పడనట్టుగా ఆనందించుచున్నట్టు కనపడేది. నాతో ఎంతో సంతోషంగా మాటలాడుతూ ఉండేది. అటువంటి సీతను వదిలి నేను ఒంటరిగా అయోధ్యకు వెళితే, నా తల్లి కౌసల్య “రామా! నా కోడలు సీత ఎక్కడ. ఆమెను ఎక్కడ వదిలి వచ్చావు”అని అడిగితే నేను ఏమని సమాధానము చెప్పాలి.

ఓ లక్ష్మణా! నేను సీత లేకుండా అయోధ్యకు రాలేను. కాబట్టి నీవు ఒంటరిగా అయోధ్యకు వెళ్లు. నేను ఈ అరణ్యములలోనే సీతా వియోగంతో నా తనువు చాలిస్తాను.” అని విలపించాడు రాముడు.

ఆ మాటలు అన్నీ ఓపిగ్గా విన్నాడు లక్ష్మణుడు. “ఓ రామా! ఉ త్తమకులములో పుట్టిన వాడవు. అమిత పరాక్రమవంతుడవు. నీవే ఇలా అధైర్యపడితే ఎలా! నీ వంటి నిర్మల బుద్ధి కలవారికి ఈ ప్రకారము మందబుద్ధితో ఆలోచించడం శోభించదు. రామా! మనకు ఎక్కువ ప్రియమైన వాళ్లు దూరమైనపుడు దు:ఖముకలగడం సహజము. దానికి ఉపాయం వెతకాలి కానీ, ఇలా దు:ఖించడం వలన ప్రయోజనము లేదు. ముందు మనము ఆ రావణునిజాడ కనుక్కోవాలి. వాడు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా వాడిని వదిలేది లేదు. వాడు సీతను తెచ్చి అప్పగించాలి. లేకపోతే మనచేతిలో చావాలి. అన్నిటికన్నా ముందు నీవు ధైర్యంగా ఉండాలి. ఈ దీనత్వాన్ని వదిలిపెట్టాలి. కార్యరంగంలోకి దూకాలి. దానికి తగిన ఉత్సాహమును తెచ్చుకోవాలి. మానవ శరీరానికి ఉత్సాహాన్ని మించిన బలం వేరొకటి లేదు. ఉత్సాహవంతునకు లభించనిది ఏదీ లేదు. ఉత్సాహవంతుడు ఓటమిని ఎరుగడు. కాబట్టి రామా! నీవుకూడా ఉత్సాహమును తెచ్చుకో. సీతను తిరిగి సాధించుటకు ప్రయత్నము చెయ్యి. నీ పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ శోకాన్ని పక్కనపెట్టు. మనస్సును నిగ్రహించుకో.” అని రామునికి హితబోధ చేసాడు లక్ష్మణుడు.
లక్ష్మణుని మాటలతో రాముడు తన శోకాన్ని విడిచిపెట్టాడు. ధైర్యము, ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. 

రాముడు, లక్ష్మణుడు పంపాసరోవరమును దాటారు. వీరిద్దరినీ ఋష్యమూక పర్వతము పైనుండి సుగ్రీవుడు అనే వానర రాజు చూస్తున్నాడు. సుగ్రీవునికి భయం పట్టుకుంది. ఆ మానవులు ఇద్దరూ వాలి పంపగా తనకోసం వచ్చారేమో, తనను చంపుతారేమో అని భయపడ్డాడు. ఆ భయంతో కుంగిపోయాడు సుగ్రీవుడు. వెంటనే సుగ్రీవుడు తన వెంట ఉన్న వానరులతో సహా అక్కడి నుండి పారిపోయాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము మొదటి సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)