శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - డెబ్బది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 75)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
డెబ్బది ఐదవ సర్గ
శబరి తన భౌతిక శరీరమును విడిచి ఉత్తమలోకములు పొందిన తరువాత రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు."లక్ష్మణా! మనము ఆశ్చర్యకరమైన ఈ వనమును చూచినాము. ఏడు సముద్రములు కలిసిన ఈ తీర్థములలో స్నానము చేసాము. మన పితరులకు జలతరణములు విడిచాము. మనకు ఉన్న అశుభములు అన్నీ తొలగిపోయాయి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. మనము ఇప్పుడు పంపాసరస్సు దగ్గర ఉన్న ఋష్యమూక పర్వతమునకు పోవుదము. వానరులకు రాజు అయిన సుగ్రీవుని చూడవలెనని అతనితో మైత్రిచేసుకొనవలెనని నాకు చాలా ఆతురతగా ఉంది. ఎందుకంటే సీతాన్వేషణ కార్యక్రమము సుగ్రీవుని మీదనే ఆధారపడి ఉంది” అని అన్నాడు రాముడు.
“అలాగే అన్నయ్యా! మనము తొందరగా ఋష్యమూక పర్వతము వద్దకు పోవుదము.” అని అన్నాడు లక్ష్మణుడు.
తరువాత రామలక్ష్మణులు పంపాసరోవర తీరమునకు చేరుకున్నారు. ఆ పంపాసరోవరము చాలా మనోహరంగా ఉంది. ఆ సరోవరం నిండా తామరపూలు పూచి ఉన్నాయి. ఆ సరోవరము పక్కనే ఉన్న మతంగ సరస్సు లో రాముడు స్నానం చేసాడు. తరువాత రామలక్ష్మణులు అనేక వృక్షములతో నిండి ఉన్న వనములో ప్రవేశించారు. దాని పక్కనే ఉన్న ఋష్యమూక పర్వతమును
చూచారు.
చూచారు.
"లక్ష్మణా! అదే ఋష్యమూక పర్వతము దాని మీదనే ఋక్షరజస్సు అనే వానరుని కుమారుడు సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. లక్ష్మణా! నీవు సుగ్రీవుని వద్దకు పోయి మన రాక గురించి చెప్పు. నీకు తెలుసు కదా! నేను రాజ్యమును, నా భార్య సీతను పోగొట్టుకొని అపారమైన దుఃఖములో ఉన్నాను. నీవు వెళ్లి నా బదులుగా సుగ్రీవునికి మన గురించి చెప్పు" అని అన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము డెబ్బదిఐదవ సర్గ సంపూర్ణము
అరణ్యకాండము సర్వం సంపూర్ణం.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment