శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - డెబ్బది నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 74)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
డెబ్బది నాలుగవ సర్గ
తరువాత రామలక్ష్మణులు పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసి పంపాసరోవరము చేరుకున్నారు. వారు సుగ్రీవుని వెతుక్కుంటూ వెళు తున్నారు. వారు పంపా సరోవరము పశ్చిమదిక్కుకు చేరుకున్నారు. అక్కడ వాళ్లకు శబరి నివసించే ఆశ్రమము కనపడింది. వారు ఆ ఆశ్రమము దగ్గర ఉన్న శబరిని చూచారు.రామలక్ష్మణులను చూచిన శబరి సంభ్రమంతో లేచి వారికి ఎదురు వచ్చింది. రామలక్ష్మణుల పాదములకు నమస్కరించింది. వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. అడవిలో తాను సేకరించిన పళ్లను వారికి సమర్పించింది. (ఎంగిలి పళ్లను ఇచ్చింది అన్న విషయం వాల్మీకి రామాయణంలో లేదు). రాముడు శబరిని పరామర్శించాడు.
“ఓ మాతా! నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉందా! నీ తపస్సు సిద్ధించిందా!” అని అడిగాడు.
“రామా! ఈ రోజు నీ దర్శన భాగ్యంతో నా తపస్సు సిద్ధించింది. నీ రాకకోసరమే నేను వేచిఉన్నాను. నీ రాకతో నేను చేసిన తపస్సు, నేను చేసిన గురుసేవ సార్ధకం అయ్యాయి. నీ దయార్ద్రదృష్టి తగిలి నేను ఉత్తమ లోకములకు వెళ్లగలను. నేను సేవచేసిన మునులందరూ ఉత్తమలోకములు పొందారు. నేను మాత్రము నీ దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే నీగురించి వారే నాకు చెప్పారు. “ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు లక్ష్మణ సమేతుడై నీ ఆశ్రమమునకు రాగలడు. నీవు మునికి అతిథి సత్కారములు చేసి తరించు.” అని చెప్పారు. అప్పటి నుండి మీ రాక కోసరం ఎదురు చూస్తున్నాను. రామా! నీవు ఎప్పుడు వస్తావో ఏమో అని ఈ పంపాతీరంలో దొరికే తినే పదార్థములనుసేకరించి ఉంచాను వాటిని నీవుస్వీకరించు.” అని అన్నది శబరి.
శబరి మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు. శబరితో ఇలా అన్నాడు. “ఓ శబరీ! దనువు అనే వాని నుండి నీ గురించి, ఈ ప్రాంతము గురించి, విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షముగా చూడాలని అనుకుంటున్నాను.” అని అన్నాడు.
అప్పుడు శబరి తన వెంట రామలక్ష్మణులను తీసుకొని వెళ్లి ఆ వనము నంతా చూపించింది. “రామా! ఈ వనము మతంగ వనము అని ప్రసిద్ధిచెందింది. మతంగ మహాముని శిష్యులైన నా గురువులు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు చేసారు. ఆ ఋషులు ఇక్కడే దేవతలకు పుష్పములు సమర్పించారు. వారు స్మరించగానే సప్తసముద్రములు ఇక్కడకు వచ్చాయి. ఆ సముద్రములలో వారు స్నానము చేసి ఆరవేసిన నార చీరలు ఇంకా వేలాడుతున్నాయి చూడు. వారి ప్రభావము చేత ఇక్కడ పూచిన పూలు వాడిపోవు. ఫలములు చెడిపోవు. రామా! నీకు ఈ వనములోని విశేషములు అన్నీ చూపించాను. ఇంక నాకు అనుమతి ఇస్తే ఈ దేహమును విడిచిపెడతాను. ఉత్తమ లోకములు పొందిన నా గురువులను చేరుకుంటాను.” అని పలికింది శబరి.
ఆ శబరి మాటలు విన్న రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. శబరికి అనుజ్ఞ ఇచ్చారు. అప్పుడు శబరి తన శరీరమును అగ్నిలో ఆహుతి చేసి ఉత్తమలోకములకు వెళ్లిపోయింది. శబరి తన తపోబలము చేత తాను సేవించిన గురువులు పొందిన ఉత్తమ లోకాలు పొందింది.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము డెబ్బది నాల్గవసర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment