శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - డెబ్బది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 73)
శ్రీమద్రామాయణము
అరణ్య కాండము
డెబ్బది మూడవ సర్గ
కబంధుడు ఇంకా రామునితో ఇలా అన్నాడు. “ఓ రామా! నీవు ఇక్కడి నుండి పశ్చిమ దిక్కుగా వెళ్లు. నీకు దారిలో ఫలవృక్షములు, పూలు సమృద్ధిగా పూచే చెట్లు కనిపిస్తాయి. నీవు ఆ వనము దాటిన తరువాత మరొక వనము కనిపిస్తుంది. ఆ వనములో ఉన్న వృక్షములు అన్ని ఋతువులలోనూ పూలు, పండ్లు ఇస్తాయి. అదీ ఆ వనము మహాత్యము. మీరు ఆ వనము దాటితే పంపా సరోవరముచేరుకుంటారు.
ఆ పంపా సరస్సు కలువలతోనూ, పద్మములతోనూ నిండుగా ఉంటుంది.. ఆ సరస్సులో హంసలు, క్రౌంచపక్షులు, ఇంకా ఇతర రకములైన పక్షులు సమృద్ధిగా ఉంటాయి. మీరు ఆ వనములో ఉన్న పండ్లను, సరస్సులో ఉన్న చేపలను తిని ఆ సరస్సులో ఉన్న నీరు తాగి మీ ఆకలి దప్పులు తీర్చుకోవచ్చును. మనోహరమైన ఆ వనములో ప్రవేశించగానే నీ శోకము తీరిపోతుంది.
పూర్వము ఆ వనములో మతంగ మహాముని శిష్యులు నివసించేవారు. ఆ శిష్యులు తమ గురువుగారికి కావలసిన సమిధలు, పండ్లు పూలు తెచ్చేటప్పుడు వారి శరీరమునుండి కారిన చెమట వలన ఆ వనములో పండ్ల చెట్లు పూల చెట్లు మొలిచాయి. అందుకని ఆ చెట్లకు పూచిన పూలు ఎప్పటికీ వాడిపోవు.
ఆ మతంగ మహాముని శిష్యులైన ఋషులకు సేవ చేసిన శబరి అనే సన్యాసిని ఇంకా ఆ వనములో నివసిస్తూ ఉంది. ఆ శబరి నీ దర్శనము కోసరం ఎదురు చూస్తూ ఉంది. నీ దర్శనభాగ్యము కలిగిన తరువాత ఆమె పరలోకము చేరుకుంటుంది.
ఆ పంపా సరస్సు పశ్చిమంగా ఒక ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమములో ఇప్పటికీ మతంగ మహాముని ఏర్పరచిన నియమాలు పాటింపబడుతున్నాయి. ఆ ఆశ్రమమును అడవి జంతువులు గానీ ఇతరులు గానీ పాడు చేయలేరు.
పంపా సరస్సు పక్కనే ఋష్యమూక పర్వతము ఉంది. ఆ పర్వతము మీద చిన్న చిన్న ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఆ పర్వతము బ్రహ్మచే సృష్టింపబడినది అని అంటారు. ఆ పర్వతము మీద నిద్రించిన వారికి స్వప్పములో ఏమి కనిపిస్తుందో మెలుకువ రాగానే అది లభిస్తుంది.. మనసులో చెడు ఆలోచనలు ఉన్నవారు ఆ పర్వతము ఎక్కలేరు. ఒకవేళ ఎక్కినా, నిద్రపోతున్నపుడు రాక్షసులు వారిని చంపుతారు. ఆ ఋష్యమూక పర్వతముమీద ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలోనే సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. సుగ్రీవుడు అతని నలుగురు అనుచరులు అప్పుడప్పుడు పర్వత శిఖరము మీద కు వచ్చి కొంతసేపు విహరించి మరలా గుహాంతర్భాగమునకు వెళు తుంటారు. నీవు వెంటనే వెళ్లి ఆ సుగ్రీవుని కలుసుకో. అతనితో మైత్రి చెయ్యి. నీకు శుభం కలుగుతుంది." అని పలికాడు కబంధుడు.
తరువాత కబంధుడు తన లోకమునకు వెళ్లిపోయాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము డెబ్బదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment