శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - డెబ్బది రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 72)
శ్రీమద్రామాయణము
అరణ్య కాండము
డెబ్బది రెండవ సర్గ
తరువాత రామలక్ష్మణులు కబంధుని శరీరమును పెద్ద లోయ లోకి తోసి నిప్పుపెట్టారు. కబంధుని శరీరము పూర్తిగా కాలిపోగానే, ఆ చితిలోనుండి దివ్యమైన వస్త్రములను ధరించిన ఒక దివ్యపురుషుడు బయటకు వచ్చాడు.“రామా! నీకు సీత ఎలా దొరుకుతుందో చెబుతాను విను. ప్రస్తుతము నీవు సీతా వియోగముతో, రాజ్యము పోగొట్టుకొని బాధపడుతున్నావు. నీ లాగానే రాజ్యము పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని బాధపడుతున్న వానితో నీవు స్నేహం చెయ్యి. నీకు లాభం కలుగుతుంది. ప్రస్తుతము నీకు అటువంటి మిత్రునితో స్నేహము అవసరము. వాని వలన నీవు మిత్రలాభమును పొందుతావు.
వాలి, సుగ్రీవుడు అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వారు వానరులు. అందులో వాలి సుగ్రీవుని భార్యను అపహరించి, సుగ్రీవుని రాజ్యమునుండి వెళ్ల గొట్టాడు. ప్రస్తుతము ఆ సుగ్రీవుడు పంపానదీ తీరములో ఉన్న ఋష్యమూక పర్వతము మీద తన అనుచరులతో నివసిస్తున్నాడు. సుగ్రీవునితో పాటు ఇంకా నలుగురు వానరులు ఉన్నారు. సుగ్రీవుడు మహా పరాక్రమ వంతుడు, సత్యవంతుడు, వినయము కలవాడు. మంచి ధైర్యముకలవాడు. దానికి తోడు మంచి బుద్ధిమంతుడు. కాని కాలము కలిసి రాక, వాలి చేత సుగ్రీవుడు రాజ్యము నుండి బయటకు వెళ్లగొట్టబడ్డాడు. నీలాగే భార్యను, రాజ్యమును పోగొట్టుకొన్న సుగ్రీవుడు సీతను వెదకడంలో నీకు సాయం చెయ్యగలడు. నీవు సుగ్రీవునితో మైత్రి చెయ్యి. నీకు శుభం కలుగుతుంది.
రామా! సీత కోసరము నీవు శోకింపరాదు. కాలమును ఎవరూ అతిక్రమించలేరు. ఏ కాలానికి ఏది జరగాలలో అది జరిగితీరుతుంది. నువ్వు దేనినీ ఆపలేవు. కాబట్టి నీవు వెంటనే సుగ్రీవుని వద్దకు పోయి అగ్ని సాక్షిగా అతనితో మైత్రి చేసుకో. అతడు వానరుడు కదా నాకేం సాయం చేస్తాడులే అని అనుకోకు. అతనిని అవమానించకు. ప్రస్తుతము అతనికి ఇతరుల సాయం కావాలి. నీవు అతనికి సాయం చేస్తే అతడు నీకు సాయం చేస్తాడు. ఒకవేళ నీవు అతనికి సాయం చెయ్యలేకపోయినా, అతడు నీకు సాయం చెయ్యగలడు.
ఇంక సుగ్రీవుని గురించి చెబుతాను విను. సుగ్రీవుడు సూర్యునికి ఒక వివాహిత అయిన వానర స్త్రీ వలన జన్మించాడు. వాలికి భయపడి ఋష్యమూక పర్వతము మీద దాక్కుని ఉన్నాడు.
సుగ్రీవునకు ఈ లోకములో ఉన్న రాక్షసుల స్థావరములు అన్నీ బాగా తెలుసు. ఈ లోకంలో సూర్యుని కిరణములు ఎంతవరకూ ప్రసరిస్తాయో అంతమేరా సుగ్రీవునకు తెలుసు. అతడు వానరులను పంపి సీత జాడ తెలుసుకోగల సమర్థుడు. కాబట్టి సుగ్రీవునితో స్నేహం చెయ్యి. నీభార్య సీత మేరుపర్వతము మీద ఉన్నా, పాతాళములో ఉన్నా వెతికి తీసుకురాగల శక్తి ఉన్నవాడు సుగ్రీవుడు" అని పలికాడు కబంధుడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము డెబ్బది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment