శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - డెబ్బది ఒకటవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 71)

శ్రీమద్రామాయణము

అరణ్య కాండము

డెబ్బది ఒకటవ సర్గ

"ఓ రామా! నేను దనువు కుమారుడను. దానవుడను. నేను బ్రహ్మను గూర్చి తపస్సు చేసాను. నా తపస్సుకు మెచ్చి బ్రహ్మ నాకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. ఆ వర గర్వముతో నేను నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. నా పూర్వ రూపము చాలా అందంగా ఉండేది. నేను దేవేంద్రునితో సమానంగా ప్రకాశిస్తూ ఉండేవాడిని. నేను కామ రూపుడను. కోరిన రూపము ధరించగలవాడను. నేను అప్పుడప్పుడు భయంకరమైన రూపములను ధరించి అరణ్యములో తపస్సుచేసుకొనుచున్న మునులను ఋషులను భయపెట్టేవాడిని.

ఒక సారి నేను ప్రస్తుతము ఉన్న కబంధ రూపములో స్థూలశిరుడు అనే పేరుగల ఋషిని భయపెట్టాను. అప్పుడు నాకు అవయవములు అన్నీ సక్రమంగానే ఉండేవి. కాని వికృతముగా ఉండే విధంగా ఆయనను భయపెట్టాను. ఆయనకు కోపం వచ్చింది. “నీవు ఇదే రూపంలోనే శాశ్వతంగా ఉండుదువుగాక!" అని శపించాడు.

నాకు భయం వేసింది. ఆ ముని కాళ్ల మీద పడి శరణు వేడుకున్నాను. శాపమునకు విమోచనము ప్రసాదించమని అడిగాను. అప్పుడు ఆ ముని “రాముడు నీ దగ్గరకు వచ్చి నీ భుజములను ఖండించిన రోజు నీకు నీ స్వస్వరూపము వస్తుంది." అని శాపవిమోచనము ప్రసాదించాడు. తరువాత నాకు ఈ వికృత రూపము వచ్చింది.

ఒక సారి నేను ఇంద్రుని ఎదిరించాను. ఇంద్రుడు తన వజ్రాయుధముతో నా తలమీద బుజాల మీద కొట్టాడు. దానితో నా తల పొట్టలోకి దూరిపోయింది. నా బాహువులు, నా కాళ్లు, తొడలు
శరీరంలోకి చొచ్చుకుపోయాయి. మరీ వికృతంగా తయారయ్యాను. నడవలేను. “ఇంద్రా! నన్ను ఈ విధంగా చేసావు. నేను ఆహారం ఎలా సంపాదించుకోవాలి? ఎలా జీవించాలి ?" అని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నాకు ఒక యోజనము పొడవు ఉండే చేతులు, పొట్టలోనే ఒక నోరు ప్రసాదించాడు. “రామలక్ష్మణులు ఎప్పుడు నీచేతులు ఖండిస్తారో అప్పుడు నీకు పూర్వరూపము వస్తుంది." అని చెప్పాడు. అప్పటినుండి నేను నా చేతులు చాచి యోజనము లోపల ఉన్న జంతువులను నా చేతులతో పట్టి తింటూ మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు నా బాహువులు ఖండించి నాకు శాప విమోచనం కలిగించారు. మీరు నాకు దహన సంస్కారములు
చేయండి. అప్పుడు నాకు పూర్వ రూపము వస్తుంది. ఇంతకూ మీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి. నేను మీకు తగిన సాయం చేస్తాను." అని అన్నాడు కబంధుడు.

రాముడు ఇలా చెప్పాడు. “నేను, నా సోదరుడు లక్ష్మణుడు ఆశ్రమములో లేని సమయములో రావణుడు అనే రాక్షసుడు నా భార్య సీతను అపహరించాడు. మాకు అతని పేరు రావణుడు అనీ, అతను రాక్షస రాజు అనీ తెలుసు. అతను ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. మేము దారీ తెన్నూ లేకుండా సీత కోసరము వెతుకుతున్నాము. నీకు తెలిసినట్టయితే, మాకు ఆ రాక్షసుని గురించి తెలియచెయ్యి. మేము నీకు శాపవిమోచనము కావించాము కాబట్టి నీవు కూడా మాకు తగిన సాయం చెయ్యి. నీవు కోరినట్టు నీకు దహన సంస్కారములు చేస్తాము." అని అన్నాడు రాముడు.

“రామా! నాకు ఎలాంటి దివ్యదృష్టి లేదు. అందుకని నేను ఆ రాక్షసుని గురించి చెప్పలేను. కాని మీకు సీత జాడ గురించి చెప్పగల వారిని గురించిన సమాచారము ఇవ్వగలను. అతనికి ఈ మూడు లోకములలో ఎవరు ఎక్కడ ఉన్నదీ బాగా తెలుసు. కొన్ని కారణాంతరాల వల్ల అతడు ముల్లోకములూ తిరిగాడు. నీవు అతనితో స్నేహం చేసి సీత జాడతెలుసుకో! రామా! సూర్యుడు అస్తమించ బోతున్నాడు. మీరు సూర్యాస్తమయమునకు ముందు నన్ను దహనం చేసి నాకు పూర్వరూపము వచ్చేట్టు చెయ్యండి." అని చెప్పాడు కబంధుడు.

శ్రీమద్రామాయణము
అరణ్య కాండము డెబ్బది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)