శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - డెబ్బదియవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 70)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
డెబ్బదియవ సర్గ
తన బాహుబంధములలో చిక్కిన రామలక్ష్మణులను చూచి కబంధుడు ఇలా అన్నాడు. "ఏంటి అలా చూస్తున్నారు. ఈరోజు మీ ఇద్దరినీ నాకు దేవుడు ఆహారంగా పంపాడు. మీరు ఎంత ప్రయత్నించినా నా నుండి తప్పించుకోలేరు. (అందుకే కబంధ హస్తాలు అనే సామెత వచ్చింది.) ఈ రోజు మీ ఇద్దరూ నాకు ఆహారం కాక తప్పదు." అని అన్నాడు.రాముడు ఆలోచించే పరిస్థితిలో లేడు. సీత పోయిన దు:ఖములో ఉన్న తాను కబంధుని హస్తాలలో చిక్కుకోడంతో రాముడు ఆలోచించే శక్తి కోల్పోయాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని తో ఇలా అన్నాడు.
“రామా! ధైర్యం కోల్పోవద్దు. మనం ఇద్దరం వీడి హస్తాలలో బందీలుగా ఉన్నాము. ఈ పరిస్థితులను మనకు అనుకూలంగా మలచుకోవాలి. నీవు నీ శక్తిని అంతా కూడగట్టుకొని నీ చేతిలో ఉన్న ఖడ్గంతో నీ పక్కఉన్న చెయ్యినరుకు. నేను ఈ పక్కఉన్న చెయ్యి నరుకుతాను. ఇందాకటి నుండి వీడిని పరిశీలిస్తున్నాను. వీడి శక్తి అంతా వీడి బాహువులలో ఉంది. వీడి బాహువులను ఖండిస్తే వీడు మనలను ఏమీ చెయ్యలేడు." అని అన్నాడు లక్ష్మణుడు.
(ఇక్కడ ఒకటి గమనించండి. ఈ సూత్రం మనకు అందరికీ వర్తిస్తుంది. మనకు ఆపదలు వచ్చినపుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాముని వలె మనం ఆలోచించే శక్తి కోల్పోతాము. కాని మనం లక్ష్మణుని వలె ఆలోచించాలి. మనకు ప్రతికూల పరిస్థితులను
అనుకూలంగా మలచుకోవాలి. తగిన ఉపాయం ఆలోచించాలి. ఆపదల నుండి బయట పడాలి. అంతేకాని, ఆపదలు వచ్చినప్పుడు మనలను మనం తిట్టుకుంటూ ఎదుటి వారిని తిట్టడం వలన ఏమీ ప్రయోజనం లేదు. రామాయణం నుండి దీనిని మనం గ్రహించి ఆచరణలో పెట్టి మన జీవితాలను సఫలం చేసుకోవాలి.)
అనుకూలంగా మలచుకోవాలి. తగిన ఉపాయం ఆలోచించాలి. ఆపదల నుండి బయట పడాలి. అంతేకాని, ఆపదలు వచ్చినప్పుడు మనలను మనం తిట్టుకుంటూ ఎదుటి వారిని తిట్టడం వలన ఏమీ ప్రయోజనం లేదు. రామాయణం నుండి దీనిని మనం గ్రహించి ఆచరణలో పెట్టి మన జీవితాలను సఫలం చేసుకోవాలి.)
లక్ష్మణుని మాటలు విన్నాడు కబంధుడు. రామలక్ష్మణులను తినబోయాడు. రాముడు, లక్ష్మణుడు వెంటనే స్పందించారు. క్షణం ఆలస్యం చేయకుండా కబంధుడి రెండు బాహువులను ఖడ్గములతో ఖండించారు. ఎప్పుడైతే చేతులు ఖండింపబడ్డాయో కబంధుడు పెద్దగా అరిచాడు కేకలు పెట్టాడు. వెనక్కు విరుచుకు పడ్డాడు. ఖండింపబడిన తన బాహువులను చూచుకున్నాడు
కబంధుడు. రామలక్ష్మణుల వంక చూచి "ఎవరు మీరు?” అని అడిగాడు.
కబంధుడు. రామలక్ష్మణుల వంక చూచి "ఎవరు మీరు?” అని అడిగాడు.
అప్పుడు లక్ష్మణుడు కబంధునితో "ఇతడు ఇక్ష్వాకు వంశములో జన్మించిన దశరథుని కుమారుడు రాముడు. నేను అతని తమ్ముడు లక్ష్మణుడను. కారణాంతరముల చేత మేము వనవాసము చేస్తున్నాము. మేము ఇంట లేని సమయమున ఎవడో రావణుడు అనే రాక్షసుడు రాముడి భార్య సీతను అపహరించాడు. మేము సీతను వెదుకుతూ నీకు చిక్కాము. ప్రాణాపాయ పరిస్థితులలో, మా ప్రాణాలు కాపాడుకోడానికి నీ చేతులు ఖండించాము. ఇంతకూ నీవు ఎవరవు? ఈ వికృత రూపం ఎందుకు వచ్చింది. ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు లక్ష్మణుడు.
కబంధుడికి ఒక్కసారిగా ఇంద్రుడు చెప్పినమాటలు గుర్తుకు వచ్చాయి. “ఓ పుణ్యపురుషులారా! మీకు శుభం కలుగుగాక! నా అదృష్టం కొద్దీ నాకు మీ దర్శనభాగ్యం కలిగింది. నాకు మేలు చేయడానికే మీరు నా బాహువులను ఖండించారు. నాకు ఈ వికృతరూపము ఎలా వచ్చిందో మీకు సవిస్తరంగా తెలియజేస్తాను.” అని కబంధుడు తన పూర్వ వృత్తాంతమును రామలక్షణులకు ఈ విధంగా చెప్పాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము డెబ్బదియవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment