శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 69)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
అరువది తొమ్మిదవ సర్గ
రామలక్ష్మణులు ఆ ప్రకారంగా జటాయువుకు ఉత్తరక్రియలు నిర్వర్తించి, దక్షిణ దిక్కుగా సీతను వెదుకుతూ వెళ్లారు. పొదలతో, పెద్ద పెద్ద వృక్షములతో, సూర్యరశ్మికూడా చొరబడకుండా ఉన్న కీకారణ్యములో వారు ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తూ జనస్థానము నుండి మూడు కోసుల దూరం వెళ్లారు. అలా వెళుతూ వారు అరణ్యము నంతా సీత కోసం అణువు అణువునా గాలిస్తున్నారు.సీతను రావణుడు అనే రాక్షసుడు తీసుకువెళ్లాడు అని తెలుసు కానీ ఎక్కడకు తీసుకు వెళ్లాడో రామలక్ష్మణులకు తెలియదు. జటాయువు చెప్పలేదు. అందుకని అడవి అంతా గాలిస్తున్నారు. వారు క్రౌంచారణ్యము దాటారు. మతంగుని ఆశ్రమము వైపుకు వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక పర్వతము కనపడింది. ఆ పర్వతము దగ్గర ఒక పెద్ద గుహను వారుచూచారు. ఆ గుహలో అంతా చీకటి మయంగా ఉంది. రామలక్ష్మణులు ఆ గుహ వద్దకు వెళ్లారు. ఆ గుహ దగ్గర వారు వికృతాకారంతో ఉన్న ఒక రాక్షసి ని చూచారు. ఆ రాక్షసిని చూస్తే మామూలు మనుష్యులయితే భయంతో ప్రాణాలు విడుస్తారు.
అలాంటి రాక్షసికి రాముని వెనక నడుస్తున్న లక్ష్మణుడి మీద మోహం కలిగింది. లక్ష్మణుని పట్టుకొని తన వైపుకు లాక్కుంది. తన కోరిక తీర్చమని అడిగింది.
"ఓ సుందరాంగా! నా పేరు అయోముఖి. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు కావాలి. మనం ఇద్దరం హాయిగా క్రీడిద్దాము." అని లక్ష్మణుని పట్టుకొని లాగింది.
లక్ష్మణునికి ఒళ్లు మండింది.. అసలే అయాచితంగా వచ్చి పడిన కష్టాలతో సతమతమవుతున్న లక్ష్మణునికి ఆమె మాటలు విని ఒళ్లు మండి పోయింది. వెంటనే కత్తి తీసి అలవాటైన ప్రకారము, ఆ రాక్షసి ముక్కు చెవులు కోసాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు భయభ్రాంతురాలైన ఆ రాక్షసి అక్కడి నుండి పారిపోయింది. రాముడు ఇదేమీ పట్టించుకోలేదు. తన పాటికి తాను ముందుకు పోతున్నాడు. లక్ష్మణుడు వెంట నడుస్తున్నాడు.
కొంచెం దూరం పోగానే లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. “అన్నయ్యా! నాకు బుజాలు అదురుతున్నాయి. మనసంతా కల్లోలంగా ఉంది. ఎన్నో అపశకునములు కనపడుతున్నాయి. మనకు ఏదో ఆపద జరగబోతున్నట్టు అనిపిస్తూ ఉంది. దానికి సిద్ధంగా ఉండు. కాని మరొక పక్క మనకు జయము కలిగే సూచనగా వంచులకము అని పక్షి కూతకూడా వినపడుతూ ఉంది. " అని అన్నాడు.
రాముడు లక్ష్మణుని మాటలు విని ఏమీ పలకలేదు. మాట్లాడలేదు. ముందుకుపోతున్నాడు. ఇంతలో వారికి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది. ఆ శబ్దానికి అడవిలో జంతువులు అన్నీ చెల్లాచెదురుగా పారిపోయాయి. లక్ష్మణుడు ఆ శబ్దము ఎటునుండి వచ్చినదో ఆ వైపుకు వెళ్లాడు.
ఒక పొదలో లక్ష్మణునికి ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. ఆ రాక్షసుని పేరు కబంధుడు. ఆ రాక్షసునికి కేవలము శరీరము ఉంది. శిరస్సు లేదు. అతని పొట్ట వద్ద ముఖం ఉంది. వక్షస్థలములో ఒక కన్ను ఉంది. పొట్ట దగ్గర పెద్ద నోరు, ఆ నోట్లో పెద్దనాలుక ఉంది. ఆ రాక్షసుడు తన ఒంటి కంటితో ఎంతదూరం అయినా చూడగలడు. తన పొడుగాటి నాలుకను చాచి ఎంతటి జంతువునైనా నోట్లోకి లాక్కోగలడు. ఆ రాక్షసుని శరీరం పెద్ద పర్వతములాగా ఉంది. ఆ రాక్షసుని చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి. ఆ చేతులతో ఆ రాక్షసుడు ఎన్నో జంతువులను తన వైపుకు లాక్కుని తింటూ ఉండేవాడు. ఇప్పుడు వాడి చేతులకు రామలక్ష్మణులు తగిలారు. ఆ రాక్షసుడు తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టుకొని తన వైపుకు లాక్కుంటున్నాడు. రామలక్ష్మణులు నిస్సహాయంగా అతని చేతులలో బందీలుగా అయ్యారు.

లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఈ రాక్షసుడు నన్ను తినేస్తాడు. కనీసం నువ్వు అన్నా వీడిని ఎదిరించి బయటపడు. సీతను వెదుకు. నీకు జయం కలుగుతుంది." అని అన్నాడు.
కాని రాముడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కాని ధైర్యంగా ఉ న్నాడు. “లక్ష్మణా! ధైర్యంగా ఉండు. మనకేం భయం లేదు. నేను వీడిని సంహరిస్తాను." అని అన్నాడు.
కాని రాముడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కాని ధైర్యంగా ఉ న్నాడు. “లక్ష్మణా! ధైర్యంగా ఉండు. మనకేం భయం లేదు. నేను వీడిని సంహరిస్తాను." అని అన్నాడు.
తన చేతులలో చిక్కికూడా రాముడు అలా అనడం కబంధునికి ఆశ్చర్యం కలిగించింది. “ఓ వీరులారా! మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు. ఈ భయంకరమైన అడవిలోకి ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈరోజు నాకు ఆహారంగా మారారు. నా చేతులకు చిక్కిన వారు బతికి బయటకు పోలేరు." అని అన్నాడు కబంధుడు.
కబంధుని మాటలు విని రాముడు వ్యధ చెందాడు. "లక్ష్మణా! మరలా ఇదేమి కష్టము. మనకు కష్టము మీద కష్టము వచ్చి పడుతూ ఉంది. మనము వెతుకుతున్న సీత కనిపించలేదు సరికదా ఇప్పుడు మన ప్రాణం మీదికి వచ్చింది. కాల ప్రవాహంలో ఎంతటి వాళ్ళు అయినా కొట్టుకుపోవలసిందే కదా!" అని అన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment