శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 68)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

అరువది ఎనిమిదవ సర్గ

జటాయువు ఆఖరి క్షణాలలో ఉన్నాడు. అది చూచి రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! జటాయువు మనకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ చెప్పలేకపోతున్నాడు. ఇతని కంఠస్వరము క్షీణిస్తూ ఉంది.” అన్నాడు.

జటాయువును చూచి “జటాయువూ! ఒక్కసారి కళ్లు తెరువు. మాట్లాడు. సీత గురించి చెప్పు. సీతను రావణుడు ఎందుకు తీసుకెళ్లాడు. ఎక్కడకు తీసుకెళ్లాడు. రావణునికి నేను ఏమీ అపకారము చేయలేదే. మరి సీతను ఎందుకు తీసుకెళ్లినట్టు? ఆ సమయంలో సీత ఎలా ఉంది. ఆమె ఏమైనా చెప్పిందా! ఇంతకూ ఆ రావణుడు అనే రాక్షసుడు ఎలా ఉంటాడు. అతని గురించి చెప్పు. అతను మహా పరాక్రమవంతుడా! అతని నివాసము ఎక్కడ. అతడు ఏమి చేస్తుంటాడు. జటాయూ! మాట్లాడు" అని ఆతురతగా అడుగుతున్నాడు రాముడు.

జటాయువు నెమ్మదిగా కళ్లు తెరిచాడు. రాముని వంక చూచి ఇలా అన్నాడు. “రామా! రావణుడు రాక్షసుడు. మాయావి. తన మాయతో అధికమైన వాయువును సృష్టించి, సీతను ఆకాశమార్గంలో తీసుకెళ్లాడు. అతడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. రామా! నా చూపు మందగిస్తోంది. నాకు ప్రాణాలు పోతున్నాయి. రావణుడు సీతను వింద ముహూర్తంలో అపహరించాడు. ఆ ముహూర్తంలో ఏవస్తువు పోయినా, తొందరలోనే ఆ వస్తువు తిరిగి తన యజమానికి లభిస్తుంది. ఆ విషయం రావణునికి తెలియదు. నీ సీత నీకు తొందరలోనే లభిస్తుంది. నీవు తొందరలలోనే రావణునితో యుద్ధము చేసి, రావణుని చంపి, నీ సీతను తిరిగి పొందుతావు." అని అంటూ ఉండగానే జటాయువు నోటి నుండి రక్తం పడింది. కళ్లు మూతలు పడ్డాయి.

మరలా జటాయువు ఓపిక తెచ్చుకొని రామునితో “రామా! రావణుడు విశ్రవసుని కుమారుడు. కుబేరునికి సోదరుడు....." అని ఇంకా ఏమో చెప్పబోతూ ప్రాణాలు వదిలాడు జటాయువు.
అది తెలుసుకోలేని రాముడు “ఇంకా ఇంకా రావణుని గురించి చెప్పు" అని జటాయువును కుదిపి కుదిపి అడుగుతున్నాడు. జటాయువు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. జటాయువు తల వాల్చి కిందకు జారిపోయాడు.

జటాయువు చనిపోయాడని తెలుసుకున్న రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. "లక్ష్మణా! ఈ జటాయువు నా తండ్రికి స్నేహితుడు. ఈ దండకారణ్యంలో తన మానాన తాను బతుకుతూ, నా కొరకు, సీతను రక్షించుట కొరకు, తన ప్రాణాలు సైతం బలిపెట్టాడు. ఇంకా ఎంతో కాలము బతకవలసిన వాడు మనకోసం ప్రాణాలు కోల్పోయాడు. కేవలము నాకు సాయం చెయ్యాలని, సీతను రక్షించాలని, రావణునితో యుద్ధం చేసి, రావణుని చేతిలో చంపబడ్డాడు. మంచివారు, వీరులు, శూరులు, పరోపకారము చేసేవారు, మనుష్యులలోనే కాదు, జంతువుల లోనూ పక్షులలోనూ
ఉంటారని ఈ జటాయువు నిరూపించాడు. ఈ జటాయువు మరణము, అందులోనూ నా కోసం మరణించడం నాకు అత్యంత దు:ఖమును కలిగించింది. సీతా వియోగము కన్నా ఎక్కువ దు:ఖము అనుభవిస్తున్నాను. నా తండ్రి నాకు ఎంత పూజనీయుడో ఈ జటాయువు కూడా అంతే పూజనీయుడు.

లక్ష్మణా! మనము ఈ జటాయువుకు దహన సంస్కారములు జరిపిద్దాము. కట్టెలు తీసుకురా!" అని అన్నాడు.

తరువాత రాముడు, లక్ష్మణుడు జటాయువుకు దహనసంస్కారములు చేసారు. రాముడు జటాయువు ఆత్మశాంతికి ప్రార్థించాడు. “ఓ జటాయువూ! ఎల్లప్పుడూ యజ్ఞములు చేసే వారికి, నిత్యము అగ్నిహోత్రము చేసేవారికి ఎటువంటి పుణ్యలోకములు లభిస్తాయో, ఆ పుణ్యలోకములు నీకు లభించుగాక! సన్యాసులకు, యుద్ధములో మరణించినవారికి ఎలాంటి ఉత్తమ లోకాలు లభిస్తాయో అవి నీకు లభించునుగాక! నా చేత దహన సంస్కారములు పొందిన నీవు ఉత్తమ లోకములు పొందుతావు!" అని పలికాడు రాముడు.

తరువాత లక్ష్మణుడు దర్భలను తీసుకొని వచ్చాడు. రోహి మృగములనుచంపి ఆ మాంసమును తీసుకొని వచ్చాడు. రాముడు దర్భలు నేలమీద పరిచాడు. రోహి మృగము మాంసముతో ముద్దలు చేసి ఆ దర్భల మీద పెట్టి జటాయువుకు మంత్రపూర్వకంగా పిండప్రదానము చేసాడు. తరువాత రాముడు లక్ష్మణుడు గోదావరీ నదికి వెళ్లి స్నానం చేసి శాస్త్రోక్తంగా జటాయువుకు జలతర్పణములు విడిచారు. రాముని చేత ఉత్తర క్రియలు జరిపించుకున్న జటాయువు ఉత్తమలోకములకు వెళ్లాడు. తరువాత రామలక్ష్మణులు సీతను వెదుక్కుంటూ అడవిలోకి వెళ్లారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)