శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది ఏడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 67)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

అరువది ఏడవ సర్గ

“వినదగునెవ్వరుచెప్పిన" అని ఈ నాడు ఒక సామెత ఉంది. శ్రీరాముడు అక్షరాలా ఆ సూత్రాన్నే పాటించాడు. లక్షణుడు తన కన్నా చిన్న వాడు. కానీ తనకు నీతిబోధ చేసాడు. శ్రీరాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు. ఎదురు చెప్పలేదు. బదులు చెప్పలేదు. తర్కించలేదు. విమర్శించలేదు. మౌనంగా అంగీకరించాడు. తన కోపాన్ని తనలోనే అణచుకొన్నాడు. ఎత్తిన ధనుస్సును దించాడు. తమ్ముని ముందు తలవంచి క్లుప్తంగా ఇలా అన్నాడు.

“తమ్ముడా లక్ష్మణా! ఇప్పుడు మనం ఏమి చేద్దాము? ఎక్కడికి వెళదాము. సీత గురించిన ఆధారాలు ఏ ఉపాయంతో దొరుకుతాయో ఆలోచించు." అని అన్నాడు. అన్నయ్య శాంతించడంతో లక్ష్మణుడికి ఉత్సాహం పెల్లుబికింది. 

“అన్నయ్యా! ఎటువంటి పెనుగాలి వీచినా పర్వతము చలించనట్టు, ఎన్ని కష్టములు వచ్చినా నీ వంటి ధీరోదాత్తులు చలించకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. విజయం సాధించాలి. 

అన్నయ్యా! సీతను ఆ రాక్షసులు ఏమి చేసినా ఈ అడవిలోనే చెయ్యాలి. ఎందుకంటే ఈ జనస్థానము రాక్షసులకు బలమైన స్థావరము. అందుకని మనము ఈ అడవిని క్షుణ్ణంగా వెదుకుదాము. మనకు సరి అయిన ఆధారాలు లభిస్తాయి. వాటి ద్వారా సీత జాడ తెలుసుకుందాము. మనం ఇద్దరం కలిసి వెదుకుదాము." అని అన్నాడు.

వెంటనే మారు మాటాడక రాముడు లక్ష్మణుని అనుసరించాడు. ఇద్దరూ అడవిలో సీత కోసం వెదకడం మొదలెట్టారు. వారి శ్రమ త్వరలోనే ఫలించింది. రావణుడు తన రెక్కలు విరగగొట్టగానే జటాయువు ఎగురుతూ పోయి అల్లంత దూరంలో పడ్డాడు. బాధతో మూలుగుతున్నాడు. కొండంత ఎత్తున నేలమీద పడి ఉన్న జటాయువును చూచారు రామలక్షణులు. రామునిలో ఆవేశం పెల్లుబికింది. ఆ కొండంత పక్షికూడా రాక్షసుడే అనుకున్నాడు. ఎందుకంటే అంతకు ముందే లేడి రూపంలో ఉన్న మారీచుని సంహరించాడు. ఇప్పుడు వీడు పక్షిరూపంలో ఉన్న రాక్షసుడు అనుకున్నాడు. అందుకే విల్లు ఎక్కుపెట్టి అర్ధచంద్ర బాణం సంధించాడు.

"లక్షణా! అడుగో సీతను అపహరించి తినివేసిన రాక్షసుడు. సీతను భక్షించి తీరిగ్గా కూర్చుని ఉన్నాడు. వాడిని ఇప్పుడే హతమారుస్తాను." అంటూ ఆవేశంతో పలికాడు.

దూరం నుండి రాముని మాటలను విన్నాడు జటాయువు. “నేను రాక్షసుడిని కాను రామా! నీ తండ్రిగారి స్నేహితుడు జటాయువును. సీత జాడ నాకు తెలుసు.” అని పెద్దగా అరిచాడు.

రామ లక్ష్మణులు గబా గబా జటాయువు దగ్గరకు వెళ్లారు. రెక్కలు విరిగి శరీరం అంతా రక్తంతో తడిసిముద్ద అయి ఉన్న జటాయువును చూచారు. జటాయువు అవసాన దశలో ఉన్నాడు. అందుకని పరామర్శలకు తావు ఇవ్వకుండా తనకు తెలిసిన విషయాలు గబా గబా చెప్పనారంభించాడు.

“రామా! లక్ష్మణా! జాగ్రత్తగా వినండి. సీతను అపహరించింది, నా రెక్కలు విరుగ గొట్టినది రావణుడు అనే రాక్షసరాజు. సీతను రావణుడు అపహరించి ఎత్తుకు పోవడం నేను కళ్లారా చూచాను. అతనితో నేను పోరాడాను. అతని రథాన్ని విరుగగొట్టాను. సారధిని చంపాను. రథానికి కట్టిన గాడిదలను చంపాను. రావణుని కవచం ఛేధించాను. రావణుడు కత్తితో నారెక్కలు ఖండించాడు. నేను కింద పడిపోగానే రావణుడు సీతను ఎత్తుకొని ఆకాశమార్గంలో ఎగిరిపోయాడు. ఇప్పటికే ఆ రాక్షసుడు నన్ను చంపాడు. ఇంకా నువ్వు ఏమి చంపుతావు.” అని అన్నాడు జటాయువు.

రాముడు ధనుస్సును కింద పడేసాడు. రామలక్ష్మణులు జటాయువు ను కౌగలించుకున్నారు. సీత కోసరం తన ప్రాణాలను బలిపెట్టిన జటాయువును పట్టు కొని ఏడ్చారు. జటాయువు ఊపిరి భారంగా తీస్తున్నాడు.

"చూచావా నా దౌర్భాగ్యము. రాజ్యం పోయింది. తండ్రి పోయాడు. నా భార్య అపహరింపబడింది. ఇప్పుడు నా పితృసమానుడు జటాయువు కూడా పోతున్నాడు. నేను ముట్టుకుంటే మహాసముద్రాలు కూడా ఎండి పోతున్నాయి. నావంటి దౌర్భాగ్యుడు ఈ లోకంలో మరొకడు ఉంటాడా! " అని వలా వలా ఏడ్చాడు.

రాముడు జటాయువును కౌగలించుకొని “నా సీతను ఆ రాక్షసుడు ఎక్కడకు తీసుకువెళ్లాడు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది." అని అడిగాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)