శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది నాల్గవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 64)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
అరువది నాల్గవ సర్గ
రాముడికి ఇంకా ఆశ చావలేదు. 'ఏమో సీత ఎక్కడికైనా వెళ్లిందేమో. మనము అనవసరంగా ఆందోళన పడుతున్నామేమో' అనే ఆలోచన వచ్చింది. వెంటనే లక్ష్మణుని పిలిచి"లక్ష్మణా! నీవు వెంటనే గోదావరీనదీ తీరానికి వెళ్లు. అక్కడ సీత తామరపూలు కొయ్యడానికి కానీ,స్నానానికి కానీ వెళ్లిందేమో చూడు.' ఇదే ఆఖరి ఆశ." అన్నాడు రాముడు.
అన్న మాట ప్రకారము లక్ష్మణుడు గోదావరీ నదీతీరానికి వెళ్లాడు. తీర ప్రాంతము అంతా వెదికాడు. కానీ సీత జాడ ఎక్కడా కనపడలేదు. నిరాశతో రాముని వద్దకు వచ్చాడు.
“అన్నయ్యా! నేను గోదావరి తీరం అంతా వెదికాను. బిగ్గరగా అరిచాను. సీత ఎక్కడా కనిపించలేదు." అని చెప్పాడు.
ఆఖరి ఆ ఆశ కూడా వమ్ముకావడంతో రాముడు హతాశు డయ్యాడు. కాని రామునికి ఇంకా కొన ఆశ మిగిలి ఉంది. “లక్ష్మణుడు సరిగా చూచాడో! లేదో ఏమో!" అని తానే స్వయంగా గోదావరీ నదీ తీరానికి వెళ్లాడు. సీతా! సీతా!అని బిగ్గరగా అరుస్తూ ఆ ప్రాంతమంతా కలయ తిరిగాడు.
రావణుడు సీతను అపహరించిన సంగతి అక్కడ ఉన్న వృక్షములకు, జంతువులకు, పక్షులకు, గోదావరీ నదికి తెలుసు. కాని అవి చెప్పలేవు. రాముడు నిరాశ చెందాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు.
“లక్ష్మణా! నేను ఎంత ఎలుగెత్తి పిలిచిననూ ఈ వనములో ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, గోదావరి నది ఎవరూ బదులు చెప్పడం లేదు. ఏం చేయాలి. నీ పాణిని గ్రహించిన సీత ఏదీ అని సీత తల్లి తండ్రులు అడిగితే నేను ఏమి సమాధానము చెప్పాలి.
లక్ష్మణా! నా రాజ్యము పోయినా, అరణ్యవాసము సంప్రాప్తిం చినా, నేను అధైర్యపడక సీతను చూచి బతుకుతున్నాను. ఇప్పుడు ఆ సీత నన్ను విడిచి పోయింది. ఇప్పుడు నేను ఎవరిని చూచి బతకాలి. నాకు ధైర్యము చెప్పేవాళ్లు ఎవరు.
లక్ష్మణా! చూచావా! ఈ మృగములు నన్ను చూచి తలలు ఎత్తి ఏమో చెప్పాలి అనుకుంటున్నాయి. కాని చెప్పలేకపోతున్నాయి. సీత గురించి వీటికి తెలిసి ఉంటుంది. ఉండు వీటిని అడుగుతాను." అని రాముడు ఒక్కొక్క మృగం దగ్గరకు పోయి “సీత ఎక్కడ ఉందో నీకు తెలుసా!" అని ప్రతి మృగమును అడుగుతున్నాడు.
వాటి కళ్ల వెంట కన్నీరు కారుతూ ఉంది. కాని ఏమీ చెప్పలేకపోతున్నాయి. కాని అవి ఒక సంకేతమును ఇచ్చాయి. ఆ మృగములు తమ మోరలు ఎత్తి అరుస్తూ దక్షిణ దిక్కుకు పరుగెడుతున్నాయి. ఆకాశం వంక చూస్తున్నాయి. మరలా దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి.
రాముడు సీతా వియోగ దుఃఖంలో ఉన్నాడు. కానీ లక్ష్మణుడు సూక్ష్మబుద్ధితో వాటి సంకేతాలు గ్రహించాడు.
“రామా! గమనించావా! నువ్వు “మీరు సీతను చూచారా!సీత ఎక్కడకు వెళ్లింది” అని అడగగానే ఈ మృగములు ఆకాశం వంక చూస్తూ దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి. ఎవరో సీతను ఆకాశ మార్గంలో దక్షిణదిక్కుగా తీసుకువెళ్లినట్టు వాటి చర్యలను బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి మనము దక్షిణ దిక్కుగా వెళ్లి వెదుకుదాము. సీత జాడ ఏమైనా తెలుస్తుందేమో!" అని అన్నాడు లక్ష్మణుడు.
ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి గడ్డిపరక దొరికినా లాభమే అన్నట్టు రాముడికి లక్ష్మణుడు చెప్పిన ఈ చిన్న మాట ఆశను రేకెత్తించింది. “లక్ష్మణా! అలాగే చేద్దాము. పద పోదాం.” అన్నాడు
రాముడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ దక్షిణ దిక్కుగా వెళు తున్నారు.మార్గంలో సీత ధరించిన పూలు చెల్లాచెదురుగా పడిఉ డటం చూచారు.
రాముడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ దక్షిణ దిక్కుగా వెళు తున్నారు.మార్గంలో సీత ధరించిన పూలు చెల్లాచెదురుగా పడిఉ డటం చూచారు.
రాముడు ఆపూలను చూచాడు. "లక్ష్మణా! ఈ పూలు చూచావా! ఈ రోజు ఉదయం నేను అడవిలో నుండి కోసుకొని వచ్చి సీతకు ఇచ్చాను. ఈ పూలు ఇంకా వాడిపోలేదు. ఇప్పుడు ఈ పుష్పాలు మనకు దారి చూపుతున్నాయి." అని సంతోషించాడు.
మరలా రాముడు తన ధోరణిలో మాట్లాడుతున్నాడు. “ఓ పర్వతములారా! మీకు సీత జాడ తెలుసు. ఎవరు తీసుకొనిపోయారో తెలుసు. తెలిసీ చెప్పకపోయారో నా బాణములతో మిమ్ములను పిండి పిండి చేస్తాను.” అని పెద్దగా అరిచాడు. రాముని మాటలకు పర్వతములు బదులు చెబుతున్నాయా అన్నట్టు రాముని మాటలు ప్రతిధ్వనించాయి.
ఇంతలో నేలమీద అటు ఇటు పరుగెట్టినట్టు పెద్ద పెద్ద అడుగులు, చిన్న చిన్న అడుగులు కనపడ్డాయి. పెద్ద అడుగులు రాక్షసునివి గానూ చిన్న అడుగులు సీతవి గానూ పోల్చుకున్నారు రామలక్ష్మణులు. ఆతురతగా ముందుకు నడిచారు. వారికి ఒక వటవృక్షము దగ్గర విరిగిన ధనుస్సు బాణములు, ముక్కలైన రథము కనపడ్డాయి. అక్కడ ఒక యుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడ్డాయి. అక్కడక్కడా విరిగిన ఆభరణములు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వాటిని సీత ఆభరణములుగా గుర్తించాడు రాముడు. వారు అక్కడ సీత జాడ కోసరం నిశితంగా వెదుకుతున్నారు.
“లక్ష్మణా! ఇటు చూడు. ఇక్కడ నేల మీద రక్త బిందువులు కనపడుతున్నాయి. ఇది చూస్తుంటే ఇక్కడ ఆ రాక్షసుడు సీతను చంపి ఉంటాడు. లక్ష్మణా! చూస్తుంటే ఇక్కడ ఇద్దరు రాక్షసులు యుద్ధము చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఇదుగో ఇటు చూడు! బంగారముతో అలంకరింపబడిన ధనుస్సు ఇక్కడ విరిగిపడి ఉంది. ఇది ఎవరిది అయి ఉంటుందో తెలియదు. లక్ష్మణా! ఇటుచూడు. ఇక్కడ బంగారుకవచము పడిఉంది. ” అని అన్నాడు రాముడు.
“అన్నయ్యా! ఇక్కడ ఎవరిదో పెద్ద ఛత్రము పడిఉంది. అదుగో అక్కడ పిశాచముఖములు కలిగిన గాడిదలు చచ్చి పడిఉన్నాయి. ఇవన్ని చూస్తుంటే నువ్వు అన్నట్టు ఇక్కడ ఏదో యుద్ధము జరిగినట్టు కనపడుతూ ఉంది." అని అన్నాడు లక్ష్మణుడు.
“లక్ష్మణా! ఈ రథము ఎవరిదో మహారాజుదిగా ఉంది. అంతా బంగారంతో చేయబడి ఉంది. ఇక్కడ పడిఉన్న బాణములు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి. బంగారపు ములికలు కలిగి ఉన్నాయి. రెండు అమ్ములపొదులు కూడా ఉన్నాయి. రథసారథికూడా చచ్చిపడి ఉన్నాడు. ఈసారథి చేతిలో రథమునకు కట్టిన గాడిదల కళ్ళెములు, కొరడా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు చామరములు వీచే వాళ్లుకూడా చంపబడినట్టున్నారు. వాళ్ల శరీరాలు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. వీరందరూ ఇక్కడ జరిగిన యుద్ధములో చంపబడినట్టున్నారు" అని రాముడు అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూస్తున్నాడు.
లక్ష్మణుడు కూడా వారిని చూచి వారు రాక్షసులు అని పోల్చుకున్నాడు. కాని సీత ఏమయిందో తెలయడం లేదు. రామునికి అర్థం అయింది. ఇదంతా రాక్షసుల పని అని. లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు.
"ఓ లక్ష్మణా! ఇదంతా చూస్తుంటే ఇక్కడ రాక్షసుల మధ్య యుద్ధం జరిగినట్టు కనపడుతూ ఉంది. సీతను తీసుకువెళ్లడం గానీ, చంపి తినడం గానీ జరిగి ఉండవచ్చు. సీత గురించి ఇక్కడ ఘోరయుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడు తున్నాయి. దేవతలుగానీ వనదేవతలు గానీ సీతను రక్షించలేదు. ఏది ఏమయినా నాకు తీరని నష్టం కలుగజేసారు. నాకు సహజంగా దయాగుణం ఉంది. అనవసరంగా నేను ఎవరికీ అపకారము చెయ్యను. నా దయా గుణమును దేవతలు, వనదేవతలు, రాక్షసులు నా చేతగానితనంగా భావిస్తున్నారు. నన్ను పరాక్రమము లేని వాడుగా అనుకొంటున్నారు. నా దయాగుణమే నాకు శత్రువుగా పరిణమించింది.
అందుకని, నేను నా దయాగుణమును తొక్కిపట్టి, విజృంభిస్తాను. సకల భూతములను, రాక్షసులను నాశనం చేస్తాను. యక్ష, గంధర్వ, పిశాచ, దానవులను క్షోభపెడతాను. ఎవరినీ సుఖంగా బతకనివ్వను. నా అస్త్రశస్త్రములతో ముల్లోకములను అల్లకల్లోలం చేస్తాను. ఈ దేవతలు నా సీతను నాకు క్షేమంగా అప్పగించకపోతే నా పరాక్రమము ఏమిటో వారికి తెలియజేస్తాను." అని పలికి విల్లు ఎక్కుపెట్టాడు రాముడు.
"లక్ష్మణా! ఇక్కడ ఉన్న వారందరికీ నా సీతకు ఏమయిందో తెలుసు. కానీ నాకు చెప్పడం లేదు. వారు, దేవతలు కానీ, రాక్షసులు గానీ, నా సీత జాడ చెప్పకపోయినా, నా సీతను నాకు సజీవంగా నాకు అప్పగించకపోయినా, ఈ బాణంతో ముల్లోకములను క్షోభింపజేస్తాను.” అని విల్లు ఎక్కుపెట్టాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment