శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 65)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
అరువది ఐదవ సర్గ
సీతా వియోగంతో రామునికి తాను ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. ముల్లోకాల్ని నాశనం చేస్తానని విల్లు ఎక్కుపెట్టడం చూచి లక్ష్మణుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే రామునితో ఇలా అన్నాడు.“రామా! నీవు సౌమ్యుడవు. మృదుస్వభావుడవు. సకల జనులకు హితుడవు. అటువంటి నీవు ముల్లోకములకు హాని కలిగిస్తాను అనడం భావ్యమా! నీ శాంత స్వభావాన్ని విడిచిపెట్టవచ్చునా! చంద్రునికి వెన్నెల, సూర్యునికి వేడి, భూమికి క్షమ ఎలా అలంకారాలో నీకు సౌమ్యత, సాధుజన ప్రియత్వము అలంకారాలు. ఇన్నాళ్లు సంపాదించుకున్న కీర్తిని ఒక్కసారిగా నాశనం చేసుకుంటావా!
సీతను అపహరించింది ఎవడో ఒక రాక్షసుడు. వాడిని శిక్షించాలి గానీ, ముల్లోకాలను క్షోభింపజేయడం యుక్తము కాదు కదా! ఇక్కడ ఏం జరిగిందో, ఎవరెవరికి యుద్ధం జరిగిందో, అసలు ఈ యుద్ధముతో సీతాపహరణమునకు సంబంధం ఉందో లేదో తెలియదు. ఈ రక్తపు మరకలు ఎవరివో తెలియదు. కాని ఇక్కడ ఒక యుద్ధము జరిగింది అన్నమాట వాస్తవము. కాని ఈ యుద్ధము ఇద్దరి మధ్య జరిగిందే కానీ, పెద్ద సైన్యము మధ్య జరిగింది కాదు. పెద్దసైన్యము వచ్చిన గుర్తులు కనిపించడం లేదు. ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఒకడు చావాలి. మరొకడు గెలవాలి. కాబట్టి ఆ చచ్చినవాడు ఇక్కడే ఎక్కడో పడి ఉంటాడు. వాడిని పట్టుకుంటే మనకు సీత జాడతెలియవచ్చు. కాబట్టి ఆ ఇద్దరి గురించి నీవు నీ ఆయుధమును ప్రయోగించడం ఉచితం కాదు. నీ భార్యను అపహరించడం క్షమించరాని నేరము. మనము ఆ నేరము చేసిన అపరాధిని పట్టి శిక్షిస్తాము. నీకు ఈ ప్రకృతి సాయం చేయడం లేదు అని అనుకుంటున్నావు. అలా అని ఎందుకు అనుకుంటున్నావు, దక్షిణ దిక్కుగా పొమ్మని చెప్పింది ఆ మూగజీవాలే కదా! ఇంక చెట్టు, పుట్టలు, పర్వతాలు, నదులు తాము చూచిన విషయాన్ని నీకు ఎలా తెలియజేయగలవు. వాటికి నీకు సాయం చేయాలని ఉన్నా చేయలేవు కదా! అందుకని శాంతం వహించు.
మనము ఇక్కడ ఉన్న మునులను, ఋషులను కలిసి వారి సాయంతో సీతను గురించి వెదుకుదాము. ఈ అడవి, పర్వతములు, నదీతీరములు అణువు అణువునా గాలిద్దాము. సీత జాడ తెలిసే వరకూ, సీతను అపహరించిన వాడు దొరికే వరకూ మనకు అన్ని లోకములు వెదుకుదాము. ఒక వేళ దేవతలు గానీ, దానవులు గానీ ఈ పని చేసి ఉంటే, వారికి ఒక అవకాశం ఇద్దాము. అప్పటికీ వారు దారికి రాకపోతే, అప్పుడు వారిని కఠినంగా శిక్షిద్దాము. ముందు మనము సామోపాయముతోనూ, మన ఉదాత్తమైన శీలము తోనూ, వినయంగా అడుగుదాము. వారు మాట వినకపోతే, అప్పుడు నీ పరాక్రమం చూపించవచ్చును." అని రాముని శాంతింపజేసాడు లక్ష్మణుడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment