శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 63)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
అరువది మూడవ సర్గ
రాముడి దు:ఖానికి అంతులేకుండా పోయింది. లక్ష్మణుడు ఎంత ఓదారుస్తున్నా రాముడు సీత మీద ఉన్న ప్రేమ వలన ఆమెకోసం విలపిస్తున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు.“నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను. అందుకనే నాకు కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. నేను ఊరికే అనడం లేదు లక్ష్మణా! నాకు రాజ్యం పోయింది. బంధుమిత్రులు దూరం అయ్యారు. తల్లి దూరం అయింది. తండ్రి మరణించాడు. ఇప్పుడు నా భార్యకూడా నాకు దూరం అయింది. ఇది పాపకర్మల ఫలితం కాదా!
సీతను ఎవరైనా ఎత్తుకుపోతుంటే ఆమె ఎంతగా విలపించి ఉంటుందో తలచుకుంటేనే భయంగా ఉంది. సందేహము లేదు. సీతను రాక్షసులే అపహరించారు. నరమాంస భక్షకులైన రాక్షసులు సీతను అపహరించి, ఆమె కంఠమును ఖండించి ఆమె నెత్తురు తాగి ఉంటారు. ఆ సమయంలో ఆమె ఎంతగా ఏడ్చిందో కదా!
లక్ష్మణా! నీకు తెలుసుకదా! సీత, నేను, ఆ శిలాఫలకము మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు గడిపాము కదా! లక్ష్మణా! సీత గోదావరికి స్నానం నిమిత్తం వెళ్లి ఉంటుందంటావా! కాని ఆమె ఎప్పుడూ ఒంటరిగా గోదావరికి స్నానానికి వెళ్లదే! నేను తోడు లేనిదే సీత కనీసము తామరపూల కోసరం కూడా తటాకమునకు వెళ్లదు. ఎందుకంటే సీత మహాభయస్తురాలు." అని లక్ష్మణునితో అన్నాడు.
తల పైకి ఎత్తాడు. ఆకాశంలో సూర్యుడు వెలుగుతున్నాడు. "ఓ సూర్యభగవానుడా! నీవు లోకమంతా వెలుగుతుంటావు కదా! నా సీత ఎక్కడైన కనపడిందా! నీవు చూచావా! చూస్తే నాకు చెప్పవా!” అని సూర్యుడిని వేడుకున్నాడు. అలాగే వాయుదేవుడిని కూడా వేడుకున్నాడు.
ఇదంతా చూచిన లక్ష్మణుడికి కూడా దుఃఖం ముంచుకొచ్చింది. తనూ దు:ఖిస్తే రాముడు ఇంకా దైన్యానికి లోనవుతాడని తనలో తాను తమాయించుకున్నాడు, రాముని చూచి ఇలా అన్నాడు.
“రామా! ఇంక చాలు. సీత కోసం దు:ఖించడం మాను. ఇలా దు:ఖిస్తూ కూర్చుంటే సీత తిరిగి వస్తుందా! పద. సీతను వెదుకుదాము. నీ వంటి బుద్ధిమంతులు కష్టములు వచ్చినప్పుడే ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి రామా! ధైర్యము తెచ్చుకో. " అని రామునికి ధైర్యవచనాలు పలికాడు. కానీ రాముడి మీద అవి పనిచేయలేదు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment