శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 62)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

అరువది రెండవ సర్గ

వివాహం అయినప్పటి నుండి తనను క్షణం కూడా ఎడబాయని సీత ఒక్కసారిగా తనను విడిచి పోవడం చూచి రాముడు హతాశుడయ్యాడు. రాముడికి కన్ను మూసినా తెరిచినా సీత రూపమే కనిపిస్తూ ఉంది. సీత చెట్ల నుండి పూలు కోస్తున్నట్టు, పూపొదలలో తిరుగుతున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఆమెను తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. తన దగ్గరకు రాలేదేమా అని అలుగుతున్నాడు. సీత తనను ఆట పట్టించడానికి తనకు దూరంగా తనకు కనపడకుండా ఉందని ఆమెను రా రమ్మని పిలుస్తున్నాడు. నీవు లేకపోతే పర్ణశాల శూన్యంగా ఉందని నిష్టూరం ఆడుతున్నాడు. ఎంతకూ సీత కనపడలేదు.

మరలా లక్ష్మణుడి వంక చూచాడు. “లక్ష్మణా! నేను ఇంతగా పిలుస్తుంటే, ఇంతగా పరితపిస్తుంటే సీత ఎందుకు రావడం లేదు. సీతను రాక్షసులు చంపి తిని ఉంటారంటావా!" అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు.

మరలా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. “ఓ సీతా! నీకు ఎంత ఆపద సంభవించినది. ఇది తెలిస్తే పాపం కైక ఎంత సంతోషిస్తుందో! ఆమె కోరిక తీరినట్టయింది కదా! సీతా! నీతో కలిసి అయోధ్యనుండి బయటకు కాలు పెట్టాను. వనవాసానంతరము నీవు లేకుండా అయోధ్యలో ఎలా కాలు పెట్టను? సీతను ఎవరికో అప్పగించి వచ్చాను అని తలిస్తే జనం నన్ను పిరికి వాడనీ, పరాక్రమం లేని వాడనీ నిందించరా!

నిజమే! నేను పిరికివాడినే! లేకపోతే చేతిలో ధనుర్బాణములు ఉండగా నిన్ను పోగొట్టుకున్నానే! నేను నిజంగా పిరికివాడినే! మీ తండ్రి జనక మహారాజు వచ్చి 'నాకుమార్తె సీత ఎక్కడ?' అంటే నేను ఏమి సమాధానం చెప్పాలి. ఆయనకు నా మొహం ఎలా చూపించాలి? అసలు నీవు నా పక్కన లేకుండా చూచి మీ తండ్రి జనకుడు మూర్ఛ చెందడా! అందుకే నేను మరలా అయోధ్యకు వెళ్లను? సీతలేని అయోధ్యలో నేను ఉండలేను.” అని సీత తన ఎదురుగా ఉన్నట్టు ఊహించుకొనని మాట్లాడుతున్నాడు.

ఇంతలో లక్ష్మణుని వంక తిరిగాడు. "లక్ష్మణా! నీవు అయోధ్యకు వెళ్లు. నా కోసరం నువ్వు కూడా ఎందుకు ఈ అడవులలో బాధలు పడతావు. భరతుని శాశ్వతంగా రాజ్యం ఏలుకోమని నామాటగా
చెప్పు. నాకు బదులు నా తల్లి కౌసల్యకు నీ తల్లి సుమిత్రకు అభివాదము చెయ్యి. నా తల్లిని జాగ్రత్తగా చూసుకో! ఆమె చెప్పిన పనులు చేస్తూ ఉండు. 

లక్ష్మణా! నా తల్లికి నీవు ఇక్కడ జరిగిన విషయాలు సవిస్తరంగా వివరించు. మాయలేడి రావడం, సీత ఆ లేడి కావాలని కోరడం, నేను దాని కోసరం వెళ్లడం, దానిని కొట్టడం, ఆ లేడి రాక్షసుడుగా మారి అరవడం. నువ్వు రావడం, సీత కనపడకపోవడం, సీత కోసరం నేను విలపించడం, అన్నీ వివరించు." అని అప్పగింతలు పెడుతున్న రాముని చూచి లక్ష్మణుడు భయంతో వణికిపోయాడు. సీతావియోగ దు:ఖం తట్టుకోలేక రాముడు ఎటువంటి దుస్థితికి లోనవుతాడో అని భయపడ్డాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)