శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది ఒకటవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 61)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
అరువది ఒకటవ సర్గ
ప్రాణాధికంగా ప్రేమించిన భార్య సీత హటాత్తుగా కనపడక పోయేసరికి రాముడికి దు:ఖము,కోపము ముంచుకొచ్చాయి. దానికి కారణం లక్ష్మణుడు అని రాముని అభిప్రాయము. సీతను గూర్చి అడగాలంటే లక్ష్మణుని అడగాలి. అందుకే పదే పదే లక్ష్మణుని అడుగుతున్నాడు.“లక్ష్మణా! చెప్పు. నా భార్య సీత ఎక్కడ ఉంది. నీకు అప్పగించి వెళ్లాను కదా. నా భార్యను ఏమి చేసావు? ఆమె ఎక్కడకు వెళ్లి ఉంటుంది. నా భార్యను ఎవరు బలవంతంగా తీసుకొని వెళ్లారు? నా భార్యను ఎవరు చంపి తిన్నారు? చెప్పు" అంటూ నిలదీస్తున్నాడు.
లక్ష్మణుడికి సీత గురించి తెలియదు అని రామునికి తెలుసు. కాని మనసు నిలవడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి చేస్తున్నాడు. లక్ష్మణుని విడిచి పెట్టాడు.
చెట్ల దగ్గరకుపోయి “సీతా సీతా రా! ఎక్కడ దాక్కుని ఉ న్నావు” అని బిగ్గరగా పిలుస్తున్నాడు.
"ఓ సీతా! నీవు ఎక్కడన్నా ఆడుకుంటున్నావా! ఇందాక లేడిపిల్ల కావాలి అని అడిగావు కదా. నీకు ఏదైనా లేడి దొరికిందా. దానితో ఆడుతున్నావా. త్వరగా రా” అని ఎలుగెత్తి పిలుస్తున్నాడు.
మరలా రాముడు లక్ష్మణుని వద్దకు వచ్చాడు. “లక్ష్మణా! సీత లేకుండా నేను బతకలేను లక్ష్మణా! సీతా వియోగంతో కృంగి కృశించి చచ్చిపోతాను. నా తండ్రి దశరథుని పరలోకంలో కలుసుకుంటాను. కాని నాకు ఒకటే భయం. నా తండ్రి నన్ను చూచి “నిన్ను 14 ఏళ్లు వనవాసము చెయ్యమన్నాను కదా. వనవాస కాలము పూర్తి కాకుండా అప్పుడే వచ్చావేమిటి" అని అడిగితే ఏమి చెప్పాలి? నా తండ్రి నన్ను “నువ్వు మాట మీద నిలబడే వాడివి కాదు. నీవు అన్నీ అబద్ధాలు చెబుతావు" అని నిందిస్తే ఎలా భరించాలి. " అని లక్ష్మణునితో వాపోయాడు.
మరలా సీత గుర్తుకు వచ్చింది. "సీతా! సీతా! ఎక్కడున్నావు సీతా! నన్ను విడిచి పెట్టి ఎక్కడకుపోయావు సీతా! నన్ను విడువకు సీతా. నీవు లేనిదే నాకు జీవితం లేదుసీతా!" అని బిగ్గరగా ఏడుస్తున్నాడు.
రాముడు ఎంత ఏడ్చినా సీత తిరిగి రాలేదు. ఇదంతా మౌనంగా చూస్తున్నాడు లక్ష్మణుడు. ఇదంతా తన వల్లే కదా అని మనసులో బాధపడుతున్నాడు. కాసేపు సీత అన్న మాటలను భరిస్తే, కాసేపు సీతకు కనపడకుండా మొహం తప్పిస్తే, ఇంత ఆపద వచ్చి ఉండేది కాదు కదా అని వాపోతున్నాడు. కాని తన బాధను బయటకు కనపడనీయకుండా రామునికి ధైర్యం చెబుతున్నాడు లక్ష్మణుడు.
“అన్నయ్యా! ఏమిటీ వెర్రి. నీవంటి ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, ఇంత విషాదము చెందవలెనా! సీత ఎక్కడకూ వెళ్లదు. నీళ్లు తీసుకురావడానికి సరస్సుకు వెళ్లి ఉంటుంది. లేక ఈ అరణ్యములో ఎన్నో కొండగుహలు ఉన్నాయి కదా! ఏ గుహలోనో దాని అందాలు చూస్తూ ఉండి ఉంటుంది. లేక స్నానము చేయడానికి నదికి వెళ్లిందేమో! లేక నిన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉందేమో! తను కాసేపు కనపడకపోతే మనము ఏమి చేస్తామో అని చూడటానికి ఎక్కడన్నా దాగిఉండవచ్చును.
కాబట్టి ఓ రామా! మనము ఆమెను వెదకడానికి ప్రయత్నం చేద్దాము. అంతేకానీ ఇలా దుఃఖించడం వలన ప్రయోజనము లేదు కదా! నీవు దు:ఖము మాని నాకు అనుజ్ఞ ఇస్తే నేను అడవి అంతా గాలించి సీత జాడ తెలుసుకొనివస్తాను." అని అన్నాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడి మాటలకు ఎంతోసంతోషించాడు రాముడు. "లక్ష్మణా! నువ్వు ఒక్కడివే ఎందుకు.మనం ఇద్దరం కలిసి వెదుకుదాము." అని అన్నాడు.
తరువాత రాముడు లక్ష్మణుడు కలిసి సీతను వెదకడం మొదలెట్టారు. అడవి అంతా గాలించారు. పక్కనున్న పర్వతములు అన్నీ కలయతిరిగారు. నదీతీరములు వెదికారు. సరస్సులవద్ద వెతికారు. ఎంత వెదికినా సీత కనపడలేదు.
“లక్ష్మణా! ఎంతవెదికినా సీత కపపడటం లేదు. ఏం చేద్దాము.” అని నిరాశగాఅన్నాడు రాముడు.
“రామా! అంతలోనే నిరాశచెందకుము. సీత మనకు తప్పకుండా కనపడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. సీత బతికేఉంది. అందులో సందేహము లేదు."అని అన్నాడు లక్ష్మణుడు.
“ఏం దొరకడమో ఏమో! మనం ఇద్దరం ఈ అడవి అంతా గాలించాము కదా! సీత సాధారణంగా వెళ్లే ప్రదేశాలు, సరస్సులు, నదీతీరము, పర్వతములు అన్నీ వెదికాము కదా! కాని సీత కనిపించలేదు. ఏం చెయ్యాలో తోచడంలేదు." అని దుఃఖిస్తున్నాడు రాముడు. "సీతాసీతా!" అని మాటి మాటికీ సీతను తలుచుకుంటున్నాడు.
లక్ష్మణుడు రాముని శాయశక్తులా ఓదారుస్తున్నాడు. కాని రాముని దుఃఖము ఉపశమించడం లేదు. అలా సీత కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment