శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది తొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 59)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఏబది తొమ్మిదవ సర్గ
అప్పటి వరకు సీత ఆశ్రమంతో ఉంటుంది అనే ఆశతో వడివడిగా ఆశ్రమానికి వచ్చారు రామలక్ష్మణులు. కాని సీత ఆశ్రమంలో లేదు అని తెలిసిన తరువాత సీతను రాక్షసులు అపహరించడం కానీ, చంపడం కానీ చేసి ఉంటారని రూఢి చేసుకున్నాడు రాముడు.ఇప్పుడు లక్ష్మణుని చూచి సూటిగా ఒక ప్రశ్న వేసాడు. “లక్ష్మణా! నేను నీ మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో, సీతను నట్టడివిలో వదిలి వచ్చాను కదా! మరి నా 'ఆజ్ఞలేకుండా నీవు ఆమెను ఎందుకు వదిలివచ్చావు? ఇది నీకు భావ్యమా!" అని సూటిగా ప్రశ్నించాడు రాముడు.
అప్పుడు లక్ష్మణుడు రామునితో జరిగింది జరిగినట్టు పూసగుచ్చినట్టు వివరించాడు. “రామా! నేను స్వయంగా సీతను విడిచి రాలేదు. నేను నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేదు. నీ మాట శిరసావహించి సీతను కాపాడుతున్నాను. కానీ సీత హా సీతా హా లక్ష్మణా అన్న నీ అరుపులు విని నన్ను నీ వద్దకు పొమ్మని, నిన్ను రక్షించమనీ ప్రేరేపించింది. ఆమె బలవంతంతోనే నేను ఆమెను విడిచి నీ వద్దకు వచ్చాను.
నీవు అరిచినట్టు అరుపులు వినపడగానే, సీత తల్లడిల్లిపోయింది. నన్ను చూచి "లక్ష్మణా! మీ అన్న ఆపదలో ఉన్నాడు. వెళ్లు. ఆయనను రక్షించు." అని నన్ను తొందరపెట్టింది. అయినా నేను కదలలేదు. నన్ను వెళ్లమంటూ అనేక సార్లు తొందరపెట్టింది. అప్పటికీ నేను ఆమెతో ఇలా అన్నాను.
"సీతా! రాముని భయపెట్టే, రామునికి అపకారం చేసే వాడు ఈ భూమి మీద లేడు. నీవు నిశ్చింతగా ఉండు. అది రాముని కంఠస్వరము కాదు. ఎవరో రాముని అనుకరించారు.
ఓ సీతా! దేవతలు కూడా రాముని రక్షణ కోరతారే! అటువంటి రాముడు ఒకరి రక్షణ కోరతాడా! అసంభవము. ఇది రాక్షసుల పన్నాగము. రాక్షసమాయ. దీనికి మీరు ఒక సాధారణ స్త్రీ వలె భయపడవద్దు. నిశ్చింతగా ఉండండి.
ఓ సీతా! రాముడి బలపరాక్రమ ములు నాకు తెలుసు. రాముని జయించగలవాడు ముల్లోకములలో లేడు. ఇంక ఈ సామాన్య రాక్షసుడు ఎంత?” అని ఆమెను అనునయించాను.
కాని రామా! సీత నన్ను అనకూడని పరుషమైన మాటలు అన్నది.
“నీ సోదరుడు మరణించిన తరువాత నువ్వు నన్నుపొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. నీవు ఎన్నటికీ నన్ను పొందలేవు. నీవు భరతుడు కలిసి ఈ పన్నాగము పన్నినట్టు ఉన్నారు. లేకపోతే రాముడు అంతగా అరుస్తున్నా ఎందుకు వెళ్లవు? నీవు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న శత్రువువు. నీవు రాముని వెంట ఉంటూ రాముని చావు కోరుకుంటున్న కనపడని శత్రువు.” అని నన్ను నానారకాలుగా నిందించింది. ఆ నిందలు భరించలేక నేను సీతను విడిచి నీకోసం రావలసి వచ్చింది." అని వివరించాడు లక్ష్మణుడు.
అయినా రాముడు ఆ సమాధానంతో తృప్తి చెందలేదు. "ఏది ఏమైనా లక్ష్మణా! నీవు నా ఆజ్ఞను ధిక్కరించి సీతను అడవిలో విడిచి రావడం మంచిది కాదు. నా బలపరాక్రమములు తెలిసి కూడా, సీత ఆవేశంతో కోపంతో ఏవేవో అన్నదని, నీవు సీతను ఒంటరిగా అడవిలో విడిచి రావడం ఏం బాగుంది? నీవు సీతను నిస్సహాయ స్థితిలో విడిచి రావడం నాకు ఏ మాత్రం సంతోషంగా లేదు.
ఏవో నాలుగు పరుష వాక్కులు సీత పలికిందని అలా ఒంటరిగా విడిచి పెట్టి వస్తావా! అంటే అంది. ఏమయింది. ఆమెకు కోపం వచ్చింది సరే! నీవు కూడా ఎందుకు కోపం తెచ్చుకున్నావు. నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించావు. నీవు అన్ని విధాలా తప్పు చేసావు. సరిదిద్దుకోలేని తప్పు చేసావు. నేను వెంబడించిన మృగాన్ని నేను నా బాణంతో కొట్టాను. వెంటనే వాడు రాక్షసుడిగా మారి కిందపడ్డాడు. నేను అరిచినట్టు నా గొంతుతో అరిచాడు. ఆ అరుపులను సీత గుడ్డిగా నమ్మింది. ఆమె కోపాన్ని తట్టుకోలేక నీవు ఆమెను వదిలి వచ్చావు. అంతే కదా! దాని ఫలితంగా నాసీత నాకు దూరం అయింది." అని రాముడు లక్ష్మణుని చేతలను తప్పు పట్టాడు.

అరణ్యకాండము ఏబది తొమ్మిదవ సర్గ. సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment