శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఎనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 58)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఏబది ఎనిమిదవ సర్గ
అప్పటిదాకా రాముడు లక్ష్మణుడిని ఏం జరిగింది అని అడగలేదు. తాను ఏం చేసిందిచెప్పాడు. ఇప్పుడు అడగడం మొదలెట్టాడు.“లక్ష్మణా! నేను నిన్నుసీతకు రక్షణగా ఉంచాను కదా! నా సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు? నా సీత ఇప్పుడు ఎక్కడ ఉంది.? పర్ణశాలలో క్షేమంగా ఉందా! ఉందని నీవు చెప్పగలవా? నేను అరణ్యాలకు వస్తున్నా కష్టనష్టాలకు ఓర్చి నన్ను అనుసరించిన సీత ఇప్పుడు ఎక్కడ ఉంది? సీత లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించలేను కదా! మరి నా సీత ఎక్కడుందో చెప్పవా?
లక్ష్మణా! నాకు సీత తోడిదే లోకం. సీత లేకుండా నేను స్వర్గాధిపత్యము కూడా అంగీకరించను. అటువంటి నా సీతను ఏమి చేసావు? సీత జీవించి ఉంటుందంటావా! నా సీత మరణిస్తే, ఆమె
దు:ఖంతో నేను మరణిస్తే, మమ్ములను అడవులకు పంపిన కైక ఆనందిస్తుందేమో కదా! అప్పుడు నాతల్లి కౌసల్య, కైకకు ఊడిగం చేస్తుందేమోకదా!
దు:ఖంతో నేను మరణిస్తే, మమ్ములను అడవులకు పంపిన కైక ఆనందిస్తుందేమో కదా! అప్పుడు నాతల్లి కౌసల్య, కైకకు ఊడిగం చేస్తుందేమోకదా!
లక్ష్మణా! నిజంచెప్పు. సీత జీవించి ఉంది అంటేనే నేను ఆశ్రమానికి వస్తాను. లేకపోతే ఇక్కడే ప్రాణ త్యాగం చేస్తాను. నేను ఆశ్రమం చేరగానే సీత ఎదురొచ్చి చిరునవ్వుతో నన్ను పలకరించక పోతే నేను బతికి ఉండీ వృధా!
లక్ష్మణా! సీత ఇంకా జీవించి ఉందంటావా! లేక నువ్వు ఇటు రాగానే రాక్షసులు ఆమెను చంపి తిని ఉంటారా! ఒకవేళ సీత బతికి ఉంటే, నా వియోగబాధతో ఎంతగా పరితపిస్తూ ఉందో కదా!
లక్ష్మణా! మారీచుడు హా లక్ష్మణా! అని అరిచినప్పుడు నీకు కూడా నాకు అపకారం జరిగిందని అనుమానం కలిగిందా! నేను అరిచినట్టు వినపడ్డ అరుపులు విని నిన్ను సీత పంపగా నా వద్దకు వచ్చావా! లేక నువ్వే ఆ రాక్షసుని అరుపులు విని నాకేమైనా ఆపద జరిగిందని సీతను ఒంటరిగా వదిలి వచ్చావా! ఏది ఏమైనా నీవు ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా వదిలి వచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. నీవు రావడంతో రాక్షసులకు మన మీద పగ తీర్చుకోడానికి ఆస్కారం కల్పించినట్టయింది. ఎందుకంటే, నేను ఖరుడిని, దూషణుడిని, రాక్షసులను చంపానుకదా. అందుకని నా మీద ప్రతీకారము తీర్చుకోడానికి రాక్షసులందరూ పొంచి ఉన్నారు. నీవు కూడా లేని సమయం చూచి రాక్షసులు సీతను చంపి ఉంటారు!
లక్ష్మణా! చూచావా! అడవిలో ఉన్నా నాకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో! ఇదంతా నా పూర్వజన్మపాపఫలం. లేకపోతే నాకే ఇన్ని కష్టాలు రావాలా!"అని కాసేపు తనలో తాను అనుకుంటూ, కాసేపు లక్ష్మణుని చూచి మాట్లాడుతూ వడి వడిగా ఆశ్రమం వేపు నడుస్తున్నావు రాముడు.
రామ లక్ష్మణులు పర్ణశాలను చేరుకున్నారు. పర్ణశాల వద్ద సందడి లేదు. నిర్మానుష్యంగా ఉంది. నడిచి నడిచి అలసి పోయిన ముఖంతో రాముడు ఆశ్రమం చుట్టు పక్కల సీత కోసం ఆతురతగా వెదుకుతున్నాడు. సీత ఎక్కడా కనపడలేదు. చేతులతో ముఖం కప్పుకొని కూలబడ్డాడు రాముడు.
“లక్ష్మణా! నేను అనుకున్నట్లే జరిగింది.” అని రోదిస్తున్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment