శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఏడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 57)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఏబది ఏడవ సర్గ
లంకలో సీత పరిస్థితి ఇలాఉంటే, అక్కడ అరణ్యములో మారీచుని చంపిన రాముడు, వెనక్కు తిరిగి పర్ణశాలకు వస్తున్నాడు. అప్పుడు రామునికి నక్కకూత వికృతంగా వినిపించింది. అపశకునసూచకమైన ఆ నక్కకూత విని రాముడు మనసులో కీడు శంకించాడు. సీతకు లక్ష్మణునికి ఏదైనా ఆపద కలిగిందేమో అని భయపడ్డాడు. అప్పుడు మారీచుడు తన గొంతును అనుకరిస్తూ సీతా లక్ష్మణా అని అరిచిన అరుపులు గుర్తుకు వచ్చాయి రామునికి.
“అయ్యో! ఆ అరుపులు నావి అనుకొని, నాకేమైనా ఆపద కలిగిందని శంకించి, సీత లక్ష్మణుని నా రక్షణ కొరకు పంపలేదు కదా! ఆ సమయంలో రాక్షసులు సీతకు ఏమైనా అపాయము తలపెట్టారో ఏమో! అవును ఇప్పుడు అంతా అర్థం అయింది. ఇది రాక్షసుల మాయోపాయమే. మారీచుడు మాయలేడి రూపం ధరించి నన్ను ఆశ్రమానికి దూరంగా తీసుకొని వెళ్లాడు. నేను మారీచుని కొట్టినపుడు హా సీతా! హా లక్ష్మణా! అని అరిచాడు. సీత తప్పకుండా లక్ష్మణుని నా రక్షణ కోసం పంపి ఉంటుంది.
నేను, లక్ష్మణుడు, దగ్గర లేని సమయంలో సీత క్షేమంగా ఉంటుందా! అసలే ఈ జనస్థానములో ఉన్న రాక్షసులతో నాకు విరోధము ఉంది. ఆ విరోధమును మనసులో పెట్టుకొని రాక్షసులు సీతకు ఏమైనా అపాయం తలపెట్టారో ఏమో! దానికి తోడు అప శకునములు కూడా కనపడుతున్నాయి.” ఈ విధంగా ఆలోచిస్తూ రాముడు ఆశ్రమం వైపు వడి వడిగా వస్తున్నాడు.
ఎంత కాదనుకున్నా రాముని మనస్సు సీత గురించి లక్ష్మణుని గురించి వారి క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తనను వెదుక్కుంటూ వస్తున్న లక్ష్మణుడు కనిపించాడు. లక్ష్మణుని చూడగానే రాముడికి కోపం వచ్చింది. దానితో పాటు దు:ఖం కూడా వచ్చింది. లక్ష్మణుని చేతులుపట్టుకొని ఇలా అన్నాడు.
“నేను నిన్ను సీతకు రక్షణగా ఆశ్రమంలో ఉండమన్నాను. కానీ నీవు సీతను ఒంటరిగా ఆశ్రమంలో విడిచి వచ్చావు. అలా ఎందుకు చేసావు. ఇంకా సీత క్షేమంగా ఉందంటావా? లక్ష్మణా! నాకు అన్నీ అపశకునములు కనపడుతున్నాయి. సీత గురించి నా మనసంతా ఆందోళన చెందుతూ ఉంది. వీటిని బట్టి చూస్తే సీతకు ఏదో ఆపద కలిగి ఉంటుంది. లేదా సీత సంహరింపబడి ఉంటుంది. రాక్షసులు ఆమెను భక్షించి ఉంటారు. ఇందులో సందేహం ఉండటానికి వీలు లేదు.
లక్ష్మణా! మనము మరలా సీతను ప్రాణాలతో చూడగలము అంటావా! ఆ మృగాల అరుపులు, నక్కల కూతలు వింటుంటే సీత క్షేమం మీద అనుమానం కలుగుతూ ఉంది. అసలు జరిగిందేమిటంటే, సీత ఆ మృగము కావాలని కోరిన తరువాత నేను ఆ మృగమును వెంబడించాను. ఆ మృగాన్ని నా బాణంతో కొట్టాను. నా బాణం తగిలిన ఆ మృగం పెద్దరాక్షసునిగా మారిపోయింది. అప్పుడు అర్థం అయింది అది రాక్షస మాయ అని. అందుకే అంటున్నాను.
ఆశ్రమంలో సీత క్షేమంగా ఉండదు. ఆమెను ఎవరన్నా అపహరించి ఉండాలి. లేక ఆమెను రాక్షసులు చంపి ఉండాలి. ఒక వేళ ఆమెను ఏ రాక్షసుడైనా అపహరించి ఉంటే, ఎంతో దూరం వెళ్లి ఉ ౦డరు. మార్గ మధ్యంలోనే ఉంటారు." అని రాముడు తనలో తాను అనుకుంటూ వడి వడిగా పర్ణశాల వంక వస్తున్నాడు. లక్ష్మణుడు రాముని అనుసరించి వస్తున్నాడు.
ఆశ్రమంలో సీత క్షేమంగా ఉండదు. ఆమెను ఎవరన్నా అపహరించి ఉండాలి. లేక ఆమెను రాక్షసులు చంపి ఉండాలి. ఒక వేళ ఆమెను ఏ రాక్షసుడైనా అపహరించి ఉంటే, ఎంతో దూరం వెళ్లి ఉ ౦డరు. మార్గ మధ్యంలోనే ఉంటారు." అని రాముడు తనలో తాను అనుకుంటూ వడి వడిగా పర్ణశాల వంక వస్తున్నాడు. లక్ష్మణుడు రాముని అనుసరించి వస్తున్నాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment