శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 56)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ఏబది ఆరవ సర్గ

తన ముందు అలా ప్రాధేయపడుతున్న రావణుని చూచింది సీత. పక్కన పడి ఉన్న ఒక గడ్డిపరకను తీసి తనకూ రావణుని మధ్య పడవేసింది. రావణునితో ఇలాఅంది.

“ఓ రావణా! ధర్మానికి ప్రతిరూపము, సత్యసంధతకు నిలయము అయిన దశరథుని కుమారుడు రాముడు, ఆజాను బాహుడు, అరవిందదళాయతాక్షుడు అయిన ఆ రాముడు, నా భర్త. నా భర్తే నాకు దైవము. రాముని సోదరుడు లక్ష్మణుడు. వీరిద్దరూ కలిసి నీ ప్రాణములు బలి తీసుకుంటారు. అది తథ్యము. నీవు రాముని ఎదుట నా మీద చేయివేసినట్టయితే, నీసోదరుడు ఖర, దూషణులకుపట్టిన గతే నీకూపట్టి ఉండేది.

ఇందాకటినుండి, నీవు నీ రాక్షస వీరుల గురించి ఏవేవో గొప్పలు చెప్పావు. కానీ అటువంటి రాక్షసులు 14,000 మందిని నా రాముడు ఒంటిచేత్తో మట్టికరిపించాడు. అది మరిచిపోయావా! నా రాముని ధనుస్సునుండి వచ్చిన ఒక్కొక్క బాణము నీ ఒక్కొక్క ప్రాణము తీస్తుంటే అప్పుడు తెలుస్తుంది నా రాముని ప్రతాపం ఏమిటో!

నీవు దేవతలు, దానవులు, అసురులు, గంధర్వులు మొదలగు దేవాసుర గణములతో చావక పోవచ్చు. కాని మానవమాత్రుడైన నా రాముని చేతిలో నీకు చావు తప్పదు. యజ్ఞములో ఊపస్తంభమునకు కట్టిన పశువులాగా నువ్వు గిలా గిలా కొట్టుకుంటున్నావు. నీ చావు త్వరలోనే ఉంది. రాముడు రావడం, నిన్ను చంపడం, నన్ను నీ చెరనుండి విడిపించడం తథ్యం. నీకు ఆయువు మూడింది. నీ వైభవం నశించింది. నీ లంకా రాజ్యలక్ష్మికి వైధవ్యము రానుంది. అది తెలుసుకో!

నేను నా భర్త కలిసి ఉండగా మా ఇద్దరికీ వియోగం కల్పించావు. నీకు కూడా రాబోవు జన్మలలో భార్యవియోగం తప్పదు. వినాశకాలే విపరీతబుద్ధి అని నీకు పోయేకాలం దాపురించబట్టే ఇటువంటి దురుద్ధిపుట్టింది. నేను పవిత్రమైన యజ్ఞభూమిని. నన్ను నీ వంటి ఛండాలుడు తాకనుకూడా తాక జాలడు. నేను రాముని ధర్మ పత్నిని. నా భర్తను తక్క పరపురుషుని కలలో కూడా తలవని దానను. పాపాత్ముడవైన నీవు నన్ను తాకను కూడా తాకలేవు.

నేను రాజహంసను. నీవు కాకివి. నీతో నాకు పొందేమిటి? ఈ శరీరం నీ ఇష్టం. నన్ను బంధించు. చిత్రహింసలకు గురిచెయ్యి. లేకపోతే చంపెయ్యి. నీనుంచి నా ప్రాణాలను కాపాడుకోవాలనే కోరిక నాకు లేదు. నీవు ఏమి చేసినా నేను మాత్రం నీకు లొంగను. జాగ్రత్త!” అని పలికి తలవంచుకొని నిలుచుంది సీత.

సీత మాటలు విని రావణుడు కోపగించుకోలేదు. ఇప్పటిదాకా రావణుడు తన సంపదలు ఐశ్వర్యము చూపి ఆశపెట్టాడు. కానీ సీత లొంగలేదు. ఇప్పుడు సీతను బెదిరించి లొంగదీసుకోవాలని అనుకున్నాడు. సీతను చూచి పరుషంగా ఇలా అన్నాడు.

“ఓ సీతా! ఇంక నీవు ఏమి చెప్పినా నేను వినదలచుకోలేదు. నీకు పన్నెండు మాసాలు గడువు విధిస్తున్నాను. ఈ లోపల నీవు నా సరసన చేరాలి. లేకపోతే నిన్ను వంటశాలకు పంపించి, ముక్కలు ముక్కలు గా నరికించి, నాకు ఆహారంగా తయారు చేయించుకుంటాను. జాగ్రత్త!” అని పలికాడు.

సీతకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో రావణుడు ఇలా అన్నాడు. “మీరు సీతకు కాపలాగా ఉండండి. నయానో భయానో సీతను నాకు వశం చేయండి." అని పలికాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత చుట్టు వలయాకారంలో నిలబడ్డారు.

"ఈ సీత రాజాంత:పురములో ఉండటానికి అర్హురాలు కాదు. మీరు ఈమెను అశోక వనమునకు తీసుకొని వెళ్లండి. ఈమెను ఒక రహస్య ప్రదేశములో ఉంచండి. ప్రతిరోజూ ఈమెను బతిమాలో భయపెట్టో ఆమె మనసు నా మీద లగ్నం అయేట్టు చేయండి.” అని ఆదేశించాడు.

వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీతను అశోకవనమునకు తీసుకొని వెళ్లారు. లంకారాజ్యములో ఉన్న అశోక వనము ఫలవృక్షములతోనూ పూల తోటలతోనూ, చిన్న చిన్న సరోవరములతో నిండి శోభాయ మానంగా ఉంది. ఆ అశోకవనములో శోకదేవత వలె ఉన్న సీత ఆ రాక్షస స్త్రీల వశంలో బందీగా ఉంది. చిన్నప్పటి నుండి సుకుమారంగా పెరిగిన సీత, భయంకారాకారులైన ఆ రాక్షసస్త్రీల ఆకారములు చూచి, అరుపులు విని భయంతో మూర్ఛపోయింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)