శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఏబది ఐదవ సర్గ
ఆ ప్రకారంగా ఎనిమిది మంది రాక్షసులను జనస్థానమునకు పంపిన తరువాత రావణుడు, ఇంక రాముని వలన ఇబ్బంది లేదనుకున్నాడు. సీత గురించి ఆలోచంచడం మొదలెట్టాడు. సీతను తలచుకుంటేనే రావణుడికి మదనతాపం ఎక్కువ కాసాగింది. ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అని తొందర తొందరగా అంత:పురమునకు వెళ్లాడు.రాక్షస స్త్రీల మధ్య మూర్తీభవించిన శోకదేవత మాదిరి ఉన్న సీతను చూచాడు రావణుడు. సీత కళ్లనుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమెతలవంచి కూర్చుని ఉంది. రావణుడు సీత దగ్గరకు వెళ్లాడు ఆమెను చెయ్యిపట్టుకొని లేవనెత్తాడు. బలవంతంగా ఆమెను తనతో తీసుకువెళ్లాడు. సీతకు తన అంత:పురము అంతా చూపించాడు.
రావణుని అంత:పురము అనేక మేడలతోనూ, ప్రాసాదములతోనూ నిండి ఉంది. అక్కడ వేలకొలది దాసదాసీ జనములు నివసిస్తున్నారు. రావణుని అంతఃపురము అంతా రత్నములతోనూ మణి మాణిక్యాదులతోనూ తులతూగుతూ ఉంది. ప్రాసాదములకు అమర్చిన స్తంభములు అన్నీ బంగారు, వెండితో నిర్మింపబడి ఉన్నాయి. ముఖ ద్వారముల వద్ద దుందుభుల ధ్వనులు శ్రావ్యంగా వినబడుతున్నాయి.
రావణుడు సీతను తీసుకొని సోపానములు అన్నీ ఎక్కాడు. ప్రాసాదములు అన్నీ చూపించాడు. తన అంతఃపురము బయట ఉన్న అందమైన సరస్సులను, బావులను సీతకు చూపించాడు రావణుడు. తన ఐశ్వర్యము అంతా చూచి సీత తనకు వశము అవుతుందని రావణుని భ్రమ.
“ఓ సీతా! ఈ లంకలో బాలురు, వృద్ధులు, యువకులు కలిపి 32 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వారి కందరికీ నేనే రాజును. నేను కనుసైగ చేస్తే చాలు వేయి మంది పరిచారికలు నాముందు చేతులు కట్టుకొని నిలబడతారు. నా కోరిక మన్నిస్తే నేనే నీ దాసుడిని అవుతాను. నా పరిచారికలు అందరూ నీ ఆజ్ఞానువర్తులు అవుతారు.
నేను చేసిన దండయాత్రలలో అనేక మంది అందమైన స్త్రీలను తీసుకొని వచ్చి నా అంత:పురములో ఉంచాను. వారందరికీ నీవే యజమానివి. వారందరూ నీకు పరిచర్యలు చేస్తారు. అందుకని నీవు నా భార్యగా ఉండు. ఇంత ఐశ్వర్యము, ఇన్ని సంపదలు చూచి కూడా ఇంకా సందేహిస్తావు ఎందుకు. వెంటనే నా మదన తాపాన్ని చల్లార్చు. నా రాణిగా ఉండు. నాచే పరిపాలింపబడు లంకారాజ్యము నూరుయోజనముల విస్తీర్ణంతో శోభిల్లుతూ ఉంది. ఈ లంక చుట్టు భయంకరమైన సముద్రము ఉంది. అందువలన మానవమాత్రులు లంక వంక కన్నెత్తి కూడా చూడలేరు. అంతెందుకు సురులు, అసురులు, దేవేంద్రుడు సైతం వచ్చినా నా లంకను జయించలేరు. ముల్లోకములలో నన్ను మించిన పరాక్రమశాలి ఇంకొకరు లేరు.
నీ రామునికి నాకు పోలికే లేదు. రాముడు రాజ్యభ్రష్టుడు. నేను లంకాధీశుడను. రాముడు ముని వృత్తిలో ఉన్నాడు. నేను రాజభోగములు అనుభవించుచున్నాను. రాముడు మానవమాత్రుడు. నేను దైవాంశసంభూతుడను. రాముడు అల్పాయుష్కుడు. నాకు చావు లేకుండా బ్రహ్మ వరం ఉంది. ఇంకా ఆ రాముని గురించి ఎందుకు ఆలోచిస్తావు.
ఓ సీతా! రా! నన్ను వరించు. నేనే నీకు తగిన భర్తను. యౌవనంలో ఉండగానే మనం రతిసుఖాలు అనుభవిద్దాము. నేటి సుఖం నేటిదే. రేపురాదు కదా!
ఓ సీతా! ఇంకా రాముడు వచ్చి నిన్ను రక్షించి తీసుకువెళతాడని ఆశపడుతున్నావేమో! అది ఒట్టి మాట. రాముడు నీ ఊహల్లో కూడా లంక దరిదాపులకు రాలేడు. ఒక వేళ రాముడు సముద్రము దాటి లంకకు వచ్చినా, నా రక్షణలో ఉన్న నిన్ను చూడటం, తాకడం, తీసుకొని వెళ్లడం అసాధ్యం.
నీవు నన్ను వరించి నా రాణివి అయితే, దేవ, దానవ, గంధర్వ, కిన్నెరలు నీకు దాస్యం చేస్తారు. నీవు నేను రాజ్య సింహాసనము మీదకూర్చొని పట్టాభిషేకము చేయించుకుందాము. ఆ అభిషేక జలములతో ఇద్దరం పునీతులము అవుదాము.
నీవు నన్ను వరించి నా రాణివి అయితే, దేవ, దానవ, గంధర్వ, కిన్నెరలు నీకు దాస్యం చేస్తారు. నీవు నేను రాజ్య సింహాసనము మీదకూర్చొని పట్టాభిషేకము చేయించుకుందాము. ఆ అభిషేక జలములతో ఇద్దరం పునీతులము అవుదాము.
సీతా! నీ కొరకు అనేక రకములైన పుష్పములను, సుగంధ ద్రవ్యములను, మైపూతలను తెప్పించాను. వాటిని అలంకరించుకో.
ఓ సీతా! నీకు ఇంకొక విషయం చెప్పడం మరిచాను. నేను నా సోదరుడు కుబేరుడిని జయించి అతని వద్దనుండి పుష్పకము అనే మహా విమానమును తీసుకొని వచ్చాను. ఆ విమానము అద్భుతమైనది విశాలమైనది. నీవు నేను కలిసి పుష్పకవిమానములో విహరిద్దాము. ఇన్ని చెప్పినా, నా వైభవము అంతా చూపించినా నీ ముఖం అలా దీనంగా ఉండటం బాగాలేదు. నాపట్ల ప్రసన్నంగా ఉండు.” అని పరి పరి విధములుగా బతిమాలుకున్నాడు రావణుడు.
రావణుడు అన్ని మాటలు మాట్లాడుతున్నా సీత రావణుడు చూపించిన వాటి వంక కన్నెత్తి కూడా చూడలేదు. తన ముఖాన్ని పమిట చెంగుతో కప్పుకొని ఏడుస్తూ ఉంది. సీత బాధపడటం చూచాడు రావణుడు సీతతో ఇలా అన్నాడు.
“ఓ సీతా! నీకు పెళ్లి అయిందనీ, నన్ను వరిస్తే ధర్మహాని జరుగుతుందనీ అపోహ పడవద్దు. బహు భార్యాత్వము మాదిరి మా రాక్షసులలో బహుభర్తృత్వము ఆచరణలో ఉంది. కాబట్టి దానిని గురించి నీవు దిగులుపడవద్దు. ఓ సీతా! నాకు నీ పాదములే శరణ్యము నీ పాదములు అంటి వేడుకుంటున్నాను. నన్ను నీ దాసునిగా అనుగ్రహించు. నన్ను స్వీకరించు. నీకు తెలుసో లేదో! ఈ రావణుడు ఇంతవరకూ ఏ స్త్రీ ముందరా ఇలా మోకరిల్లి నమస్కరిస్తూ నిలబడలేదు. ఆ గౌరవం నీకే దక్కింది." అని ప్రాధేయ పడ్డాడు. లోలోపల ఇంక నాకు సీత వశము అయింది అని సంతోషంతో పొంగిపోయాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment