శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 54)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఏబది నాలుగవ సర్గ
రావణాసురుడు సీతను తీసుకొని ఆకాశమార్గాన పోతుంటే ఎవరైనా తనను చూస్తారా రక్షిస్తారా అనే ఆశతో సీత కిందికి చూస్తూ ఉంది. అంతలో ఒక కొండశిఖరం మీద కొంత మంది వానరులుకూర్చుని ఉండటం గమనించింది సీత.
సీతకు ఒక ఆలోచన వచ్చింది. రావణుడు వెళుతున్న వేగానికి ఎగురుతున్న తన వల్లెవాటును పట్టుకుంది. తన ఆభరణాలు ఆ వల్లెవాటు వస్త్రములో మూటగా కట్టింది. సరిగ్గా రావణుడు ఆ పర్వతము మీద ఎగురుతున్నప్పుడు. ఆ ఆభరణాల మూటను ఆ వానరుల మధ్య పడేటట్టు జారవిడిచింది. రావణుడు ముందుకు చూస్తూ ఎగురుతూ ఉండటంతో సీత చేసిన పనిని గుర్తించలేదు.
తమ మీద దబ్బున పడ్డ మూటను చూచారు ఆ వానరులు. వెంటనే తలలు పైకెత్తి చూచారు. వారికి ఆకాశంలో ఎగురుతున్న రావణుడు, రావణుని సందిట్లో బందీ అయిన సీత కనిపించారు. వారు రావణుడు వెళ్లిన వేపు చూస్తున్నారు. రావణుడు సీతను తీసుకొని పంపానదిని దాటి దక్షిణదిక్కుగా వెళ్లాడు.
రావణుడు అడవులు, పర్వతములు, నదులు, సరస్సులు దాటుకుంటూ లంకా నగరం వైపు వేగంగా ఎగురుతున్నాడు. తుదకు సముద్రం వద్దకు వచ్చాడు. వేగంగా సముద్రాన్ని దాటాడు. సీతను సందిట్లో ఇరికించుకున్న రావణుడు లంకానగరంలో ప్రవేశించాడు. నేరుగా తన అంత:పురానికి వెళ్లాడు రావణుడు. సీతను తన అంత:పురములో ఒక గదిలో ఉంచాడు. తన అనుచరులను పిలిచాడు.
“ఈమెను నేను చెరబట్టి తీసుకొని వచ్చాను. నా అనుజ్ఞ లేకుండా ఎవరూ ఈమెను తాకడానికి కూడా వీలులేదు. బయట వాళ్లు పురుషులు కానీ, స్త్రీలుకానీ ఈమెను కలవకుండా చూడండి. ఈమె ఏది కోరితే అది ఇవ్వండి. లేదు అనే మాట ఉండకూడదు. ఎవరైనా ఈమెతో నా గురించి చెడుగా మాట్లాడితే వాళ్లకు అదే ఆఖరు రోజు అని గుర్తుపెట్టుకోండి. ఇదినా ఆజ్ఞ" అని కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు.
తరువాత రావణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెంటనే నరమాంసమును తినే ఎనిమిది మంది రాక్షసులను పిలిచాడు.
“మీరు ఆయుధ ధారులై వెంటనే జనస్థానమునకు వెళ్లండి. అక్కడ ఇదివరకు ఖరుడు, దూషణుడు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. మీరు వారి స్థానములో జనస్థానములో నివసించండి. జనస్థానములో ఉన్న ఖరదూషణులను, 14,000 మంది రాక్షసులను రాముడు అనే మానవుడు సంహరించాడు. అందుకని రామునితో మనకు విరోధము ఏర్పడింది. ఇప్పుడు మనము ఆ రాముని మీద పగ, ప్రతీకారము తీర్చుకోవాలి. రాముని చంపిన గాని నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు జనస్థానములో నివసిస్తూ, ఆ రాముని ప్రతి కదలికను నాకు తెలియజేయండి. మీరు ఆ రాముని చంపడానికి సకల సన్నాహాలు చేయండి. మీరు ఎన్నో యుద్ధములలో నాతో పాటు పాల్గొని మీ ధైర్యసాహసాలు, పరాక్రమాలు ప్రదర్శించారు. అందుకని మిమ్ములను ఈ మహత్కార్యం మీద జనస్థానానికి పంపుతున్నాను.” అని పలికాడు.
రావణుని మాటలను శిరస్సున దాల్చారు ఆ ఎనిమిది మంది రాక్షసులు. రావణుడికి నమస్కరించి, లంకను విడిచి జనస్థానము నకు బయలుదేరారు. అప్పటికి రావణుడు శాంతించాడు. అతిలోక సౌందర్యవతి అయిన సీత తన అధీనంలో ఉంది కదా అని పొంగిపోయాడు. ఈ ఎనిమిది మంది రాక్షసుల చేతిలో రాముడు హతం అవుతాడు అని ఆనందించాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment