శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 53)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఏబది మూడవ సర్గ
రావణుడు ఆకాశమార్గాన ఎగురుతున్నాడు. సీత వాడి చేతిలో పిట్ట మాదిరి నలిగిపోతూ ఉంది. రావణుని చూచి సీత ఇలా అంది.“ఓరి రావణా! నీచుడా!నాభర్త ఇంటలేని సమయంలో, కుక్క మాదిరి ఇంట్లోకి దూరి, దొంగమాదిరి నన్ను అపహరించుకొని పోతున్నావే. నీకు సిగ్గులేదట్రా! నీదీ ఒక పరాక్రమమేనా! దమ్ముంటే, ధైర్యం ఉంటే నా భర్త ఉన్నప్పుడు నా వంక కన్నెత్తిచూడు. నా భర్త నిన్ను భస్మం చేస్తాడు.
ఒక ఆడదాన్ని అపహరించడానికి ఇంత పన్నాగమా! ఒక లేడిని పంపి, నా భర్తను దూరంగా పంపి నన్ను అపహరిస్తావా! నీదీ ఒక మగతనమేనా నీచుడా! నా మామగారి చిరకాల మిత్రుడు అయిన జటాయువు నన్ను రక్షించడానికి వస్తే ఆయనను కూడా చంపుతావా! నీ దుర్మార్గానికి హద్దులేదా! నీ పేరు గొప్ప గా చెప్పుకుంటున్నావు. ఇదా నీ పరాక్రమము. పక్షిని చంపడమా నీ వీరత్వము.
ఎటువంటి దుర్మార్గుడైనా ఒంటరిగా ఉన్న స్త్రీని కన్నెత్తి కూడా చూడడే. అటువంటిది నువ్వు ఎంతటి నీచుడివి అయితే నన్ను అపహరించుకు పోతావు! ఇంతటి నీచమైన పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా! ఇటువంటి సిగ్గుమాలిని పని చేసినందుకు, నీ ప్రజలే నిన్ను నిందిస్తారని నీకు తెలియదా! నీవు పుట్టిన వంశము ఎట్టిది! నీవు చేసే పని ఎట్టిది! నీ వంశంలో చెడబుట్టావు కదా దుర్మార్గుడా! నీకు ధైర్యం ఉంటే కాసేపు నన్ను భూమి మీద దింపు. రామలక్ష్మణులు వచ్చేంత వరకూ ఆగు. అప్పుడు నీ సైన్యంతో కూడా రా. రాముడితో యుద్ధం చెయ్యి నువ్వు యమపురికి వెళతావో నన్ను తీసుకొని లంకకు వెళుతావో అప్పుడు తెలుస్తుంది. రామలక్ష్మణుల బాణములు నిన్ను దహించి వేస్తాయి.
కాబట్టి ఓ రావణా! నా మాట విను. నన్ను విడిచిపెట్టు. లేకపోతే నీ సర్వనాశనం తథ్యం. నీవు నన్ను బలాత్కారంగా తీసుకుపోతే మాత్రం నేను నీకు లొంగుతాను అని అనుకుంటున్నావా! అది కలలో మాట. నేను నీకు ఏ మాత్రం లొంగను. నా ప్రాణాలు అన్నా విడుస్తాను కానీ నిన్ను తాకను. కాబట్టి నీ ప్రయాస అంతావ్యర్థము అవుతుంది. నీకు మరణకాలము సమీపించింది అందుకనే ఇటువంటి వ్యర్థమైన పనికి పూనుకున్నావు. నీకు నరకములో వైతరిణీ నది, కత్తుల బోను సిద్ధంగా ఉన్నాయి. నాకు ఇంత అపకారము చేసిన నీవు ఎంతో కాలము జీవించలేవు. నీవు నన్ను ఎక్కడ దాచి పెట్టినా నా భర్త ఆ చోటికి రాగలడు. నిన్ను చంపి నన్ను దక్కించుకుంటాడు. నా భర్త రాముని బారి నుండి తప్పించుకోడం నీ తరం కాదు.
ఓ రావణా! నా రాముడు ఒంటరిగా, ఎవరి సాయమూ లేకుండా, 14,000 మంది రాక్షసులను, నీ తమ్ములను చంపాడు అని గుర్తులేదా! అటువంటి రాముడు, తన భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే వాడిని తన బాణాలకు బలి చేయకుండా ఊరుకుంటాడా!"
ఈ విధంగా సీత రాముని నిందిస్తూ ఉంది. సీత మాటలను రావణుడు లక్ష్యపెట్టలేదు. సీతను సందిట ఇరికించుకొని ఆకాశమార్గంలో లంకవైపు ప్రయాణం చేస్తున్నాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment