శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబదియవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 50)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఏబదియవ సర్గ
రావణుడు సీతను అపహరించుకొని వెళ్లే సమయంలో జటాయువు ఒక వట వృక్షము మీద నిద్రపోతున్నాడు. సీత అరుపులు, రావణుని హుంకారములు విని జటాయువు నిద్రలేచాడు.జటాయువుకు ఏం జరుగుతుందో అర్థం అయింది. వెంటనే ఎగురుతూ పోయి రావణుని రథం మీద వాలాడు. రావణుడు తన రథం ఆపాడు. అప్పుడు జటాయువు రావణునితో ఇలా అన్నాడు.
“రావణా! నేను నిత్యసత్యవ్రతుడను. నా పేరుజటాయువు. నేను గరుడ వంశజుడను. మహా బలిశాలిని. రాముడు అయోధ్యాధి పతి దశరథుని కుమారుడు, ముల్లోకములచేత పూజింపబడేవాడు. ఈమె రాముని భార్య పేరు సీత. నీవు ధర్మమార్గంలో పయనించే మహారాజువు. అటువంటి నీవు ఇతరుల భార్యలను అపహరించ వచ్చునా! ముఖ్యముగా సాటి రాజుల భార్యలను గౌరవించాలి. ఆపదలలో ఉంటే రక్షించాలి కానీ, నీ లాగా అపహరించకూడదు. అదే లోక ధర్మము. కాబట్టి ఇతరుల భార్యల మీద ఉన్న నీ కోరికను మానుకో. ఇది నీ వంటి ధర్మాత్ములు చేయదగ్గపనికాదు. నీ భార్యను ఇతరులు అపహరిస్తుంటే నువ్వు ఎలా రక్షించుకుంటావో, అలాగే ఇతరుల భార్యలను ఎవరైనా అపహరిస్తుంటే నువ్వు రక్షించాలి. కానీ, నువ్వే ఇతరుల భార్యలను అపహరించడం తప్పు కదా! అలాంటి తప్పు చేయకు. ఇతరులు నిన్ను నిందించే పని చేయడం తప్పు కదా!
రావణా! సామాన్యులు ధర్మము, అర్థము, కామము వీటి ఆచరణలో సందేహము కలిగినపుడు, రాజు ఏం చేస్తాడో దానినే అనుసరిస్తారు. కాబట్టి రాజు తన ప్రజలకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి. అటువంటి రాజువైన నీవే ఇటువంటి నిందార్హమైన పని చేస్తే, నీ ప్రజలు ఎవరిని అనుసరించాలి. ఆలోచించు.
ఓ రాక్షస రాజా! నీవు నిరంతర పరకాంతాబిలాషివే. చపలచిత్తుడివే. నీకు రాజ్యాధికారము, లంకాధిపత్యము ఎలా లభించింది అని సందేహముగా ఉంది. దీనిని బట్టి చూడ నీది దుష్టస్వభావము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. నీకు పుణ్యకార్యములు చేయడం తెలిసినట్టు లేదు. అందుకే పాపపు పనులలో నిమగ్నుడవై ఉన్నావు.
పోనీ, నీకు ఎవరైనా అపకారము చేస్తే వారికి అపకారం చేయడం లోక ధర్మము. ఎక్కడో అరణ్యములో ఆకులు అలములు తింటూ కాలం గడుపుతున్న రాముడు, లంకలో ఉన్న నీకు ఎలాంటి అపకారమూ చేయలేదే? అటువంటప్పుడు నీవు రాముని భార్యను ఎందుకు అపహరిస్తున్నావు? అతని పట్ల ఎందుకు అపరాధము చేస్తున్నావు? నీ సోదరులు ఖరుని దూషణుని చంపాడు అని కదా నీ వాదన. కాని వారిని ఎందుకు చంపాడు. శూర్పణఖ పోయి, వారిని రాముని మీదికి యుద్ధానికి పురికొల్పింది. రాముడు ఒక్కడు. వారు 14,000 మంది. రాముడు ఏం చేస్తాడు. యుద్ధం చేసాడు. యుద్ధంలో వారు చచ్చారు. అందులో రాముని తప్పు ఏముంది? రాముడు మీ మీదికి యుద్ధానికి కాలు దువ్వలేదు కదా! మరి ఎందుకు రాముని భార్యను అపహరిస్తున్నావు. కాబట్టి వెంటనే సీతను వదిలిపెట్టు. లేకపోతే రాముని బాణములకు ఆహుతి అవుతావు. ఈ సీతాపహరణంతో నీవు త్రాచుపామును కొంగున కట్టుకొని తిరుగుతున్నావు. నీ మెడకు చుట్టుకొని ఉన్న కాలపాశమును నీవు గుర్తించడం లేదు.
ఓ రావణా! సాధారణంగా మనకు అలవి అయిన పనులే మనం చేయాలి. మనకు జీర్ణం అయ్యే పదార్థాలే మనం తినాలి. అలాగే ధర్మవిరుద్ధమైనవి, అపకీర్తిని తెచ్చిపెట్టేవి అయిన పనులు మనం చేయకూడదు కదా! రావణా! నా సంగతి నీకు తెలుసుగా! నేను పుట్టి 60,000 సంవత్సరములు అయింది. నేను వృద్ధుడను. కాని నీవు యువకుడవు. నేను నిరాయుధుడను. నీవు సాయుధుడవు. అయినా నేను నిన్ను సీతను తీసుకొని పోనీయను. అడ్డుకుంటాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీవు సీతను తీసుకొని పోవడానికి వీలు లేదు. నీవు శూరుడవు అయితే నాతో యుద్ధం చెయ్యి. నిన్ను ఖరుడు పోయిన చోటికే పంపుతాను.
నీవు ఎంతో మందిని చంపి ఉంటావు. కానీ ఇప్పుడు రాముడు నిన్ను చంపగలడు. రాముడు లక్ష్మణుడు ఇక్కడ ఉంటే నీ మరణం ఈ క్షణము సంభవించి ఉండేది. వాళ్లు ఇక్కడ లేకపోబట్టి బతికిపోయావు. చేతనైతే వారు వచ్చేదాకా ఉండి వారితో యుద్ధం చెయ్యి అంతేగానీ, వారు లేనప్పుడు సీతను అపహరించడం వీరత్వము అనిపించుకోదు.
నేను జీవించి ఉండగా నీవు సీతను తీసుకొని ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేవు. నా ప్రాణాలు ఒడ్డి అయిన సరే నేను సీతను కాపాడతాను. రా! నాతో యుద్ధానికి రా! నిన్ను ఈ క్షణమే నీ రథం నుండి కిందకు పడదోస్తాను." అని వీరోచితంగా పలికాడు జటాయువు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment