శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది తొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 49)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

నలుబది తొమ్మిదవ సర్గ

సీత మాట్లాడే మాటలు వింటుంటే రావణుకి కోపం నసాళానికి అంటింది. అసహనంతో, కోపంతో గంతులేసాడు. రెండు చేతులు గట్టిగా చరిచాడు. పెద్దగా గాండ్రించాడు.

“ఓ సీతా! నీకేమైనా పిచ్చా! నా మాటలు అర్థం కావడం లేదా! నా గురించి, నా ఐశ్వర్యము గురించి, నా పరాక్రమము గురించి, నా వైభవము గురించీ ఎంత చెప్పినా నీ చెవికి ఎక్కడం లేదు. నా గురించి నీకు బాగా తెలియదు. నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని బంతిలా పైకి ఎత్తి ఆడుకుంటాను. సముద్రాలన్నీ కలిపి తాగేస్తాను. నా ఎదుట నిలిస్తే మృత్యువును కూడా చంపేస్తాను. సూర్యగమనాన్ని అడ్డుకుంటాను. భూమిని బద్దలు కొడతాను. నా ఇష్టం వచ్చిన రూపం ధరించగలను. ఇప్పుడు నేను ఉన్నది సన్యాసి రూపంలో. నా అసలు రూపం చూడు.” అంటూ రావణుడు తన సన్యాసి రూపం వదిలి పెట్టి తన అసలు రూపం సీత ముందు ప్రదర్శించాడు. పదితలలతో, ఎర్రటి కళ్లతో, ఒంటినిండా బంగారు ఆభరణములతో, నల్లని మేని ఛాయతో, ధనుర్బాణములను ధరించిన రావణుడు సీత ముందు నిలిచాడు.

“ఓ సీతా! చూచావా నా నిజస్వరూపము. ముల్లోకములను శాసించే భర్త కావాలనుకుంటే నన్ను వరించు. నీ లాంటి అతిలోక సౌందర్యవతికి నేను తగిన భర్తను. నేను నీ మాట ఎన్నడూ జవదాటను. నీకు దాసుడిగా ఉంటాను. ఆ వనచరుడైనా రాముని మీది నుండి నీ మనసు మరల్చుకో. నా మీద మనసు లగ్నం చెయ్యి. నీకు శుభం జరుగుతుంది.

నేను ఇంకా నువ్వు చాలా తెలివిగలదానవు మంచి నిర్ణయం తీసుకుంటావు అనుకున్నాను. కాని నీవు ఇంత తెలివి తక్కువదానికి అని అనుకోలేదు. ఒక ఆడుదాని మాటలు విని అడవులకు వచ్చిన బుద్ధిహీనుడిని, రాజ్యభ్రష్టుడిని, అల్పాయుష్కుడిని, మానవమాత్రుడిని నువ్వు ఏం చూసి వరించావో నాకు అర్థం కావడం లేదు. రా! నాతో రా!" అంటూ రావణుడు ముందుకు దూకాడు.

సీతను గట్టిగా పట్టుకున్నాడు. ఒక చేతితో సీత జుట్టు పట్టుకున్నాడు. మెడ కింద చెయ్యి వేసాడు. మరొక చెయ్యి నడుము కింద వేసాడు. సీతను ఎత్తుకొని పోయాడు. రావణుని రథము అతని ముందు సాక్షాత్కరించింది. సీతను రథంలో కూర్చోపెట్టాడు. పెద్ద పెద్ద గా అరుస్తూ సీతను భయపెడుతున్నాడు. తాను కూడా రథం ఎక్కి సీతను తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు.
సీతకు ఏం జరుగుతుందో తెలీడం లేదు. “రామా రామా” అంటూ అరుస్తూ ఉంది. పాములా మెలికలు తిరిగిపోతూ ఉంది. రావణుడి కబంధ హస్తాలనుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. కాని రావణుడు తన పట్టు వీడలేదు. తన రథంతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. సీత “రామా రామా” అంటూ అరుస్తూనే ఉంది. రావణుడు ఆమెను గట్టి పట్టుకున్నాడు. రథం ఆకాశమార్గాన వేగంగా పోతూ ఉంది.

“రామా! నన్ను ఈ దుర్మార్గుడు అపహరించుకొని పోతున్నట్టు నీకు ఎలా తెలుస్తుంది. ఇంక నీవు నన్ను చూడలేవు కదా! నేను ఎక్కడ ఉన్నదీ నీకు ఎలా తెలుస్తుంది! రామా! నీవు దుష్టులను శిక్షిస్తావు కదా! దుర్మార్గుడైన ఈ రాక్షసుని శిక్షించి నన్ను రక్షించవా! ఈ రాక్షసుని చెరనుండి నన్ను విడిపించవా! ఒరేయి రావణా! తప్పు చేస్తున్నావు. పాపం చేస్తున్నావు, ఈ పాపానికి ఫలితం అనుభవిస్తావు. రాముడి చేతిలో చస్తావు! అయ్యో! రామా! నా బాధ ఎవరికి చెప్పుకోను. ఆహా! ఆ కైక కోరిక ఈ నాటికి తీరినట్టుంది. నాకు ఇన్నికష్టాలు వచ్చాయి.

ఓ వనదేవతలారా! ఓ వృక్షములారా! ఓ పర్వత పంక్తులారా! ఈ దుర్మార్గుడు రావణుడు నన్ను అపహరించుకొని పోతున్న సంగతి నా రామునికి చెప్పండి. గలా గలా పారే ఓ గోదావరీ నదీ మాతా! నన్ను ఈ రాక్షసుడు అపహరించుకుపోతున్న సంగతి నా రామునికి తెలియజేయి! ఓ వన్య మృగములారా! ఓ పక్షులారా! నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ఈ దుర్మార్గుడు తీసుకుపోతున్న సంగతి నా రామునికి చెప్పండి. నాకు తెలుసు. నేను యమలోకంలో ఉన్నా నా రాముడు నన్ను తన బలపరాక్రమాలతో మరలా వెనక్కు తీసుకురాగలడు. మీరు నా రామునికి నా గురించి తెలియజెయ్యండి చాలు." అని పరి పరి విధాలా ప్రకృతితో మొరబెట్టుకుంటూ ఉంది సీత.

ఇంతలో సీతకు ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న జటాయువు కనిపించాడు. “ఓ జటాయువూ! ఇటు చూడు. నేను! సీతను! ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని తీసుకొని పోతున్నాడు. ఈ విషయం రామునికి చెప్పు. వీడు రాక్షసుడు. క్రూరుడు. చేతిలో ఆయుధం ఉంది. వీడిని నువ్వు ఏమీ చేయలేవు. నన్ను కాపాడలేవు. కనీసం నా గురించి రామునికి తెలియజెయ్యి. నన్ను ఈ దుర్మార్గుడు అపహరించుకు పోతున్న సంగతి రామునికి లక్ష్మణునికి తెలియజెయ్యి." అని బిగ్గరగా అరుస్తూ ఉంది సీత.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)