శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది ఎనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 48)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
నలుబది ఎనిమిదవ సర్గ
“ఓ సీతా! నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను దశకంఠుడను. నేను కుబేరునికి తమ్ముడిని. నా పేరు రావణుడు. మృత్యువుకు భయపడి మానవులు ఎలా పారిపోతారో అలాగా నన్ను చూచి దేవతలు, గంధర్వులు, దానవులు భయంతో పారిపోతారు. నేను నా సోదరుడు కుబేరునితో యుద్ధమే చేసి జయించాను. నాకు భయపడి కుబేరుడు సకల భోగములతో తులతూగుతున్న తననగరమును విడిచి కైలాసంలో తలదాచు కొన్నాడు. నేను కుబేరుని జయించి అతని పుష్పక విమానమును అపహరించాను. దాని మీద నేను ఆకాశంలో విహరిస్తుంటాను.
నాకు కోపం వచ్చింది అని తెలిసిన మరుక్షణం దేవతలు దేవేంద్రునితో సహా పారిపోతారు. నేను ఉన్నచోట వాయువు నెమ్మదిగా వీస్తాడు. సూర్యుడు తన కిరణముల తీవ్రతను తగ్గించుకుంటాడు. నేను ఉన్నచోట చెట్టుకూడా తమ ఆకులను కదల్చలేవు. నదులు ప్రవహించ లేవు. నేను ఈ ప్రకృతినంతా శాసిస్తాను.
సముద్రము మధ్యలో ఉన్న నా లంకానగరము సకల భోగములలో దేవేంద్రుని అమరావతిని తలదన్నుతుంది. లంకా నగరం బంగారు ప్రాకారాలు, బంగారు మేడలు మణితోరణాలతో నిండి ఉంటుంది. నా లంకా నగరము ప్రశస్తమైన ఏనుగులు, గుర్రములతో నిండి ఉంటుంది. ఎల్లప్పుడూ మంగళ వాద్యములు మ్రోగుతూ ఉంటాయి. నువ్వు నాతో కలిసి లంకా నగరంలో అడుగుపెడితే నీ రాముని, నీ వాళ్లను అందరినీ మరిచి పోతావు. భోగాలలో మునిగితేలుతావు. ఆ రాచ భోగాలలో మునిగిన నీకు సామాన్య మానవుడైన రాముడు ఎన్నటికీ గుర్తుకురాడు.
నీకు తెలుసో లేదో. అసలు దశరథుడు రాముడికి రాజ్యం ఇవ్వకుండా అడవులకు ఎందుకు పంపాడంటావు. రాముడంటే అతని తండ్రి దశరథునికి ఇష్టం లేదు. అందుకే తన ప్రియపుత్రుడు భరతునికి రాజ్యం ఇచ్చాడు. నీ భర్త రాముడు రాజ్యభ్రష్టుడు. తెలివితక్కువవాడు. పైగా తాపస వృత్తిలో ఉన్నాడు. అటువంటి మొగుడి పక్కన ఉన్నంత కాలమూ నీవు ఈ జన్మలో అయోధ్యకు రాణివి కాలేవు. నువ్వు ఊ అంటే లంకా రాజ్యానికి రాణివి అవుతావు.
ఇంక నేనంటావా ఈ లోకంలో ఉన్న రాక్షసులందరికీ రాజును. పైగా నువ్వు అంటే కామంతో పడిచస్తున్నాను. నేనే నిన్నుకోరి లంకనుండి నీ వద్దకు వచ్చాను. కాబట్టి నన్ను కాదనకు. నన్ను కాదంటే ఇంతటి అదృష్టాన్ని కాలదన్నుకున్నానే అని జీవితమంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతావు. యుద్ధంలో రాముడు నా కాలి గోరు కూడా కదపలేడు. నీ అదృష్టం కొద్దీ నీవు నా కంటపడ్డావు. నాతోరా! నిన్ను సుఖాలలో ముంచెత్తుతాను. "అని సీతను ప్రలోభపెట్టాడు రావణుడు.
రావణుని మాటలు విన్న సీత కోపంతో ఊగిపోతున్న నాగ కన్య మాదిరి బుసలు కొట్టింది.
“ఓరి రాక్షసా! దుర్బుద్ధివి. ఇంద్రియ లోలుడివి. రావణా! నీవు నీ వాళ్లతో సహా సర్వనాశనం అయిపోతావు. నీ లంకా రాజ్యము సముద్రంలో కలిసిపోతుంది. ఇంద్రుని వద్దనుండి శచీదేవిని బలాత్కారంగా తీసుకొని పోయి జీవిస్తావేమోగానీ, రాముని వద్దనుండి నన్ను అపహరించి క్షణకాలము కూడా నీవు జీవించలేవు. నువ్వు అమృతము తాగినా నీకు రాముని చేతిలో చావు తప్పదు." అని పరుషంగా పలికింది సీత.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment