శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది ఏడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 47)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
నలుబది ఏడవ సర్గ
సన్యాసివేషములో ఉన్న రావణుడు తన గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే, సీత మనసులో ఇలా అనుకుంది."ఇతడు సన్యాసి. బ్రాహ్మణుడు. పైగా అతిథి. ఈయన అడిగిన వివరాలు చెప్పకపోతే శపిస్తాడేమో. ఉన్నవి ఉన్నట్టు చెబితే తప్పేమిటి" అని మనసులో అనుకొంది. అప్పుడురావణుని చూచి ఇలా అంది.
" ఓ బ్రాహ్మణోత్తమా! నేను మిథిలా నగరానికి రాజు జనకుని కుమార్తెను. అయోధ్యా నగరాధి పతి దశరథుని కోడలను. రాముని భార్యను. నా పేరు సీత. నేను చిన్నతనమునుండి రాజభోగములు అనుభవించాను. నా వివాహము అయిన తరువాత కూడా 12 సంవత్సరములు నా అత్తవారి ఇంట రాజభోగములు అనుభవించాను.
నా భర్త రామునికి పట్టాభిషేక సమయములో మా మామగారి మూడవ భార్య కైక ఆయనను రెండు వరములు కోరింది. ఒకటి రాముని అరణ్యవాసము. రెండవది తన కుమారుడు భరతుని పట్టాభిషేకము. అప్పుడు నా భర్తకు 25 సంవత్సరాలు. నా భర్త పట్టాభిషేకము ఆగిపోయింది. తండ్రి మాట ప్రకారము నా భర్త 14 ఏళ్లు అరణ్యవాసము చేస్తున్నాడు. ఆయన సహధర్మచారిణిగా నేను కూడా ఆయనతో పాటు అరణ్యవాసము చేస్తున్నాను. ఆయన సవతి తల్లి కుమారుడు లక్ష్మణుడు కూడా మాతో అరణ్యములకు వచ్చాడు. ఆ ప్రకారంగా మేము ముగ్గురము ఈ అరణ్యములో నినసిస్తున్నాము. నా భర్త రాముడు, నా మరిది లక్ష్మణుడు అడవిలో ఒక జింకను వేటాడటానికి వెళ్లారు. వారు తొందరలోనే వస్తారు. శ్రేష్టమైన జింక మాంసము తెస్తారు.
ఇంతకూ తమరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? తమరి గోత్రనామములు ఏమిటి? ఈ దండకారణ్యములో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు?” అని ఎదురు ప్రశ్నలు వేసింది సీత.
సీత వేసిన ప్రశ్నలకు రావణుడు ఇలా బదులు చెప్పాడు. “ఓ సీతా! నా పేరు రావణుడు. నేను రాక్షస రాజును. నన్ను చూస్తే దేవతలు, అసురులు, పన్నగులు, అందరూ భయపడతారు. నిన్ను చూచిన వెంటనే నాకు నీ మీద మోహము కలిగింది. నిన్ను చూచిన తరువాత, నేను నీ దగ్గర తప్ప నా ఇతర భార్యల దగ్గర కామభోగములు అనుభవింపలేను అని అనుకుంటున్నాను. నేను ఎంతో మంది స్త్రీలను పట్టి తెచ్చి నా భార్యలుగా చేసుకున్నాను. నీవు నాతో వస్తే నిన్ను వారందరికీ పట్టమహిషిని చేస్తాను. నేనుపాలించే నగరము పేరు లంకానగరము. సముద్రమధ్యలో ఒక పర్వతము మీద నిర్మించబడి ఉంది. నా నగరములో అనేక సుందర ఉద్యానవనములు ఉన్నాయి. నీకు ఈ అరణ్యవాసము ఎందుకు, నాతో వస్తే ఆ ఉద్యానవనములలో హాయిగా విహరించవచ్చును. సీతా! నీవు నాకు భార్యవు అయితే నీకు అయిదు వేలమంది దాసీలు సేవలు చేస్తారు. నన్ను వరించు. నాతో రా!" అని అన్నాడు రావణుడు.
ఆ మాటలు విన్న సీతకు కోపము ముంచుకొచ్చింది.
“రావణా! నేను నా భర్త రాముని తప్ప మరొకరిని కలలో కూడా తలంచను. నా రాముడు మహాపర్వతము వంటి వాడు. అజేయుడు. సర్వలక్షణ సంపన్నుడు., వటవృక్షము వంటి వాడు. సత్యవాక్పరిపాలకుడు. అట్టి రాముడు నాకు భర్త. నేను నా భర్తను తప్ప మరొకరిని కన్నెత్తికూడా చూడను. ఇంకా నా రాముడు మహా బాహుడు. ఉన్నత వక్షస్థలము కలవాడు. నరులలో ఉత్తముడు. సింహము వంటి వాడు. నా రాముడు జితేంద్రియుడు. కీర్తిమంతుడు. సింహము వంటి భర్తకు భార్యనైన నన్ను ఒక నక్కమాదిరి కోరుతున్నావు. నీకు కనీసము నన్ను తాకే అర్హత కూడా లేదు. నన్నుకోరుతున్నావు అంటే నీకు మరణము ఆసన్నమయినది అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే సింహము వంటి రాముని జూలు పట్టుకొని లాగుతున్నావు. మంధర పర్వతమును పైకిఎత్తాలని, కాలకూట విషాన్ని తాగాలని ఉత్సాహపడుతున్నావు. సూదితో కంటిలో నలుసును తీసుకుంటూ నీ కళ్లు నీవే పొడుచుకుంటున్నావు. అలాగే వాడియైన కత్తిని నాలుకతో నాకుతున్నావు. పెద్ద రాయి కట్టుకొని సముద్రమును ఈదాలని అనుకుంటున్నావు. సూర్యచంద్రులను మింగాలని చూస్తున్నావు. అగ్నిని కొంగున ముడి వెయ్యాలని ప్రయత్నిస్తున్నావు. రాముడి భార్యను పొందాలి అని అనుకోడం వాడి అయిన శూలాల మీద నడవడమే. నాశనమైపోతావు. జాగత్త!
ఓ రావణా! నీవు రాముని కాలి గోటికి కూడా చాలవు. అది తెలుసుకో! రాముడు సింహం అయితే నువ్వు నక్క. రాముడు సముద్రము అయితే నువ్వు మురికినీరు ప్రవహించే పిల్లకాలువ.
రాముడు ఏనుగు అయితే నువ్వు దోమ. రాముడు గరుడుడు అయితే నువ్వు కాకి. రాముడు నెమలి అయితే నువ్వు నీటి కొంగ. రాముడు హంస అయితే నువ్వు గ్రద్ద. నీకూ రామునికి అంత తేడా ఉంది. నీచేయి నామీద పడితే రాముడు నిన్ను సంహరించగలడు. జాగ్రత్త!" అని అన్నది సీత.
రాముడు ఏనుగు అయితే నువ్వు దోమ. రాముడు గరుడుడు అయితే నువ్వు కాకి. రాముడు నెమలి అయితే నువ్వు నీటి కొంగ. రాముడు హంస అయితే నువ్వు గ్రద్ద. నీకూ రామునికి అంత తేడా ఉంది. నీచేయి నామీద పడితే రాముడు నిన్ను సంహరించగలడు. జాగ్రత్త!" అని అన్నది సీత.
కానీ సీతకు లోలోపల భయంగానే ఉంది. ఆ భయం తట్టుకోలేక నేలమీద పడిపోయింది. రావణుడు సీతను మరింత భయపెట్టడానికి తన గురించి ఇంకా చెప్పనారంభించాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment