శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఒకటవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 51)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ఏబది ఒకటవ సర్గ

జటాయువు పలికిన పలుకులను చాలా తేలిగ్గా తీసుకున్నాడు రావణుడు. రావణుని దృష్టిలో జటాయువు ఒక సామాన్య పక్షి. అందువల్ల జటాయువు మాటలను లెక్క చేయలేదు. జటాయువు మాటలకు బదులు కూడా పలకలేదు. కానీ ఒక పక్షి తనను అంతలేసి మాటలు అంటుదా. తనకే నీతులు చెబుతుందా అని కోపం ముంచుకొచ్చింది. ఒక్క ఉదుటున జటాయువు మీదికి ఎగిరాడు.
రావణునికి జటాయువుకు ఘోరయుద్ధం జరిగింది. రెండు పర్వతములు ఢీకొన్నట్టు ఉంది. రావణుడు జటాయువు మీద నారాచముల వర్షం కురిపించాడు. జటాయువు ఆ బాణములను తనరెక్కలతో చెల్లాచెదరు చేసింది. వాడి అయిన తన గోళ్లతో ముక్కుతో రావణుని మొహం, శరీరం అంతా రక్కింది. రావణుడు పదిబాణములను జటాయువు మీద ప్రయోగించాడు.

జటాయువుకు రావణుని రథంలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ సీత కనపడింది. ఆమె బాధ చూచి జటాయువు రావణుడు ప్రయోగించిన బాణములను లెక్కచేయలేదు. రావణుని ధనుస్సును అతని చేతిలోనుండి ఎగురగొట్టాడు. బాణములను విరిచాడు. రావణుడికి కోపం ముంచుకొచ్చింది. మరొక ధనుస్సు తీసుకున్నాడు. వేలకొలది బాణములను జటాయువు మీద ప్రయోగించాడు. రావణుడు వదిలిన బాణములు జటాయువును కప్పివేసాయి.

జటాయువు ఆకాశంలో ఎగురుతూ ఆబాణములను తనరెక్కలతో చెదరగొట్టింది. మరలా రావణుని ధనుస్సును తన కాళ్లతో విరిచింది. రావణుని కవచమును తన ముక్కుతో చీల్చింది. తన రెక్కలతో ఆ కవచమును ఊడగొట్టింది. తరువాత జటాయువు రావణుని రథమునకు కట్టిన గాడిదలను చంపింది. రావణుని రథమును విరుగగొట్టింది. రావణుని రథానికి కట్టిన పతాకమును విరిచింది. రావణుని తలమీద తన కాళ్లతో తన్నుతూ ఉంది. ముక్కుతో పొడుస్తూ ఉంది.
రావణుడు సీతను పొదివి పట్టుకొని నేలమీదికి దూకాడు. అప్పటికి జటాయువు అలసినట్టు కనపడ్డాడు. రావణుడు సీతను పట్టుకొని మరలా ఆకాశంలోకి ఎగిరాడు. లంక వైపుగా పోసాగాడు. జటాయువు కూడా రావణుని తో పాటు పైకి ఎగిరాడు. రావణునికి అడ్డంగా నిలిచాడు. రావణుని తో ఇలా అన్నాడు.

“రావణా! ఇంకా నీకు బుద్ధిరాలేదా! నీవు సీతను అపహరించడం నీ వినాశనానికి దారి తీస్తుంది. నువ్వే కాదు రాక్షస వంశము మొత్తం నాశనం అవుతుంది. సీతను అపహరించడం అంటే విషం కలిపిన నీరు తాగడం వంటిది అని తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు బుద్ధిలేకుండా ప్రవర్తిస్తూ నీ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీ కంఠం చుట్టు యమపాశము బిగుసుకుంటూ ఉంది. నీవు దానిని తప్పించుకోలేవు. రామలక్ష్మణులు నిన్ను ఎన్నటికీ క్షమించరు. అయినా రావణా! చేతనైతే రామలక్ష్మణులతో వీరోచితంగా పోరాడు. వారిని ఓడించి సీతను తీసుకుపో. అంతే గానీ వారు ఆశ్రమంలో లేని సమయంలో, దొంగమాదిరి సీతను అపహరించడం వీరత్వం అనిపించుకోదు. నీవంటి వీరుడు చేయదగ్గ పనికాదు. చావు దగ్గర పడ్డవాడే ఇటువంటి పనిచేస్తాడు. చెడ్డ ఫలితములను ఇచ్చు కర్మలను నీవు వరాలిచ్చిన బ్రహ్మకూడా చేయడే. నీవు ఎందుకు చేస్తున్నావు?” అని రావణునికి హితోక్తులు చెప్పాడు.

కాని రావణునిలో ఏమాత్రం మార్పు రాలేదు. అందుకని జటాయువు మరలా రావణుని వీపు మీద వాలి రావణుని గోళ్లతో చీల్చాడు. అతడి జుట్టు పీకాడు. ముక్కుతో రక్కాడు. రావణుడు తప్పించుకోలేకపోతున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. ఒక చేత్తో సీతను చంకలో ఇరికించుకున్నాడు. రెండో చేత్తో జటాయువు వీపు మీద బాదాడు. జటాయువు పైకి ఎగిరి రావణుని పది బుజములను చీల్చింది. రావణుని బుజాలు విరిగి కిందపడ్డాయి. విచిత్రంగా రావణునికి కొత్తగా బుజాలు మొలిచాయి.

అప్పుడు రావణుడు సీతను కింద దింపాడు. జటాయువును రెండు చేతులతో కొట్టాడు. జటాయువుకు, రావణునికి కొంచెంసేపు ముష్టియుద్ధం జరిగింది. రావణుడు కిందపడి ఉన్న ఖడ్గమును తీసుకొన్నాడు. తన మీదికి వస్తున్న జటాయువు రెక్కలను నరికాడు. పక్షికి రెక్కలే ఆయుధములు. ఆ రెక్కలు విరగగానే జటాయువు నేలకూలాడు. నేల మీద పడిన జటాయువును చూచి సీత బిగ్గరగా రోదించింది. ఆఖరి ఆశకూడా అలా నేలకూలినందుకు సీతకు దు:ఖము ఆగలేదు. గబా గబా జటాయువు వద్దకు పరుగెత్తింది. జటాయువు మీద పడి ఏడిచింది సీత.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)