శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 45)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

నలుబది ఐదవ సర్గ

మారీచుడు గొంతు మార్చి రాముని గొంతుతో “హా సీతా! హా లక్షణా!" అంటూ అరిచిన అరుపులు ఆశ్రమంలో ఉన్న సీతకు, బయట నిలబడి ఉన్న లక్ష్మణునికి వినపడ్డాయి.

లక్షణుడు ఆ అరుపులను పట్టించుకోలేదు. 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో మట్టుబెట్టిన రాముడు, కేవలం ఒక రాక్షసునికి బెదిరి అలా అరుస్తాడా! అసంభవం. ఇదేదో రాక్షస మాయ. ఆ మాయలకు లోబడరాదు"అని నిర్ణయించుకున్నాడు.

కాని సీతలో స్త్రీ సహజమైన భయము ఆందోళనా మొదలయ్యాయి. వెంటనే లక్ష్మణుని పిలిచింది.
“లక్ష్మణా! విన్నావుగా మీ అన్నగారు అరిచిన అరుపులు. మీ అన్నగారు ఏదో భయంకరమైన ఆపదలో ఉన్నట్టు ఉన్నారు. లేకపోతే అలా కేకలుపెట్టరు. నువ్వు సత్వరమే వెళ్లి మీ అన్నగారిని రక్షించు."అని తొందర పెట్టింది.

సీత మాటలకు లక్ష్మణుడు చలించలేదు. మరలా సీత లక్ష్మణుని తొందర పెట్టింది. "లక్ష్మణా! నా మనసు అంతా ఆందోళనగా ఉంది. నా ప్రాణములు నిలవడం లేదు. తొందరగా వెళ్లు. ఏమయిందో తెలుసుకో. రాముని రక్షించు. రాముడు ఏ రాక్షసుల వాత పడ్డాడో. లేక పోతే అలా అరవడు. తొందరగా వెళ్లవయ్యా!! అని తొందర పెట్టింది సీత.

అయినా లక్ష్మణుడు కదలలేదు. చుట్టు ఏమైనా ఆపద పొంచి ఉన్నదా అని పరికిస్తున్నాడు. అప్పుడు సీతలో అనుమాన బీజం మొలకెత్తింది. అనుమానం మనసులో నాటుకోవాలే కానీ, దానికి హద్దు ఉండదు. శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. సీత ప్రస్తుతం అదే అవస్థలో ఉంది. అనుమానానికి కోపం తోడైతే ఇంక చెప్పేదేముంది. ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడతారు.

“లక్ష్మణా!ఏమీటా మౌనం. మీ అన్న అరుపులు నీకు వినపడలేదా! నేను చెప్పిన మాటలూ వినపడలేదా! నీ అన్న ఆపదలో ఉంటే రక్షించవలసిన బాధ్యత నీకు లేదా! నీ అన్నను రక్షించడానికి నీవు వెళ్లడం లేదంటే నీవు నీ అన్నకు మిత్రుడివి కావు. శత్రువు.

ఆ! నాకు అర్థం అయింది. నీకు నా మీద కోరిక ఉంది. అందుకే నీ అన్న రాముని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావు. నీకు నా మీద దురాలోచన ఉండటం వలననే నీవు రాముని రక్షించడానికి వెళ్లడం లేదు. రాముడికి ఆపద కలగాలనీ, మరణించాలనీ నీవు కోరుకుంటున్నావు కదూ! రాముడు తిరిగి రాడని నమ్మకంతో ఉన్నావు కదూ! నీకు రాముని మీద ఏ మాత్రం ప్రేమలేదు. నా మీద కోరిక ఉంది. అందుకే ఇలా చేస్తున్నావు.

లక్ష్మణా! అసలు నువ్వు మాతో అరణ్యాలకు ఎందుకు వచ్చినట్టు? రాముని రక్షించడానికే కదా! ఆ రాముడే ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? లక్ష్మణా! నీకు రాముని రక్షించడమే ప్రధానమైన కర్తవ్యము అంతే కానీ నా ఎదురుగా నిలబడటం కాదు. నన్ను రక్షించడం కాదు ముఖ్యం. ముందు నీవు రాముని వద్దకు వెళ్లు. ఆపదలో ఉన్న రాముని రక్షించు.” అంటూ సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కిందపడిపోయింది.

అది చూచి లక్ష్మణుడు ఊరుకోలేకపోయాడు. సీతతో ఇలా అన్నాడు. “ఓ విదేహ రాజపుత్రీ! ఊరడిల్లుము. రామునికి ఏమీ కాదు. రాముని రాక్షసులు గానీ, దేవతలు గానీ, గంధర్వులు కానీ, నాగులు కానీ, ఆఖరుకు మానవులు కానీ జయించలేరు. ఇందులో సందేహము ఏ మాత్రము లేదు. యుద్ధములో దేవేంద్రుని కూడా జయించగల రామునికి ఒక రాక్షసుని వల్ల ఆపద కలగడం అసంభవం. రాముని చంపడం ఎవరి తరమూ కాదు. రాముడు నన్ను నీకు రక్షణగా ఇక్కడ ఉంచాడు. నిన్ను ఒంటరిగా ఈ అడవిలో వదిలి నేను వెళ్లడం క్షేమం కాదు. కాబట్టి నీ దు:ఖాన్ని వదిలిపెట్టు. నీ భర్త ఆ మృగాన్ని చంపి తీసుకురాగలడు.

ఓ జనకరాజపుత్రీ! సావధానంగా ఆలోచించు. అది రాముని కంఠస్వరము కాదు. రాక్షసుల మాయ. నా అనుమానము నిజం అయితే ఆ మాయా మృగము మారీచుడు. వాడే రామబాణంతో చచ్చేటప్పుడు అలా అరిచిఉంటాడు. నిన్ను జాగ్రత్తగా కాపాడమని రాముడు నిన్ను నా వద్ద ఉంచాడు. నిన్ను అంతే జాగ్రత్తగా రామునికి అప్పగించవలసిన బాధ్యత నాది. అందుకని నిన్ను ఈ అడవిలో ఒంటరిగా విడిచి ఇక్కడి నుండి వెళ్లడం నాకు ఇష్టం లేదు.

సీతా! మరొక మాట. రాముడు జనస్థానములో ఉన్న రాక్షసులను అందరినీ చంపాడు. అది నీకు తెలుసు. ఆ కారణం చేత రాక్షసులు అంతా రాముడి మీద కోపంతో, శతృత్వంతో ఉన్నారు. రాక్షసులు వింత వింత గొంతులతో అరుస్తూ ఉంటారు. వాటిని మనము పట్టించుకోకూడదు. కాబట్టి నీవు రాముని గూర్చి చింతపడవలదు. రాముడు క్షేమంగా తిరిగి వస్తాడు. " అని అన్నాడు లక్ష్మణుడు.

లక్ష్మణుని మాటలు సీత చెవికి ఎక్కలేదు. ఆమెకు అనుమానము ఎక్కువ అయింది. కోపంతో లక్ష్మణునితో ఇలా అంది.

"ఓ లక్ష్మణా! నీవు రఘువంశములో చెడ బుట్టావు. నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది. ఈ అడవిలో రామునికి ప్రాణాపాయము ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు నీ కోరిక సిద్ధించింది. అందుకే రామునికి సాయంగా వెళ్లను అంటున్నావు. నీకు దుర్బుద్ధి పుట్టింది అనడానికి ఇంతకన్నా ఏమి కావాలి?

ఇది నీకు పుట్టిన బుద్ధా! లేక నువ్వు భరతుడు కలిసి ఆడుతున్న నాటకమా! ఏది ఏమైనా మీ కోరిక సిద్ధించదు. నేను మీకు దక్కను. మనసా వాచా కర్మణా రాముడినే కోరుకుంటున్న నేను మీకు వశం అవుతానని ఎలా అనుకున్నారు! నా రాముడు లేకుండా నేను ఈ భూమి మీద క్షణకాలం బతకలేను. నీ ఎదుటనే ప్రాణత్యాగము చేసుకుంటాను.” అని వలా వలా ఏడుస్తోంది సీత.

లక్ష్మణునికి ఆమెను ఎలా ఓదార్చాలో, ఎలా అనునయించాలో, ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు.

“అమ్మా సీతా! నీకు ఎలా బదులు చెప్పాలో అర్ధం కావడం లేదు. నీవు అలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. నీ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాగే మాట్లాడుతుంది అనేది లోకవిదితము. కాని నీవు జనకుని కుమార్తెవు. రాముని భార్యవు. నీవు కూడా ఇలా మాట్లాడటం భావ్యం కాదు. నీ మాటలు నా చెవులలో ములుకుల వలె గుచ్చుకుంటూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఓర్పుతో సహించాను. ఇంక సహించలేను. నేను నా అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్నాను. దీనికి ఈ వనదేవతలే సాక్షులు. కాని నీవే మనసులో దురాలోచన పెట్టుకొని నన్ను నిందిస్తున్నావు. నీవు కోరినట్టే నేను రాముని రక్షించడానికి వెళుతున్నాను.

ఓ జనకరాజపుత్రీ! ఈ వనదేవతలే నీకు రక్షగా ఉందురు గాక! నీకు క్షేమం అగుగాక! ఓ సీతా! ప్రస్తుతము నాకు అనుకూలమైన శకునములు కనపడటం లేదు. మరలా నేను, నువ్వు రాముడు కలిసి ఉండగా చూస్తానో లేదో అని అనుమానంగా ఉంది. " అని వెళ్ళనా వద్దా అని తటపటాయిస్తున్నాడు లక్ష్మణుడు.

అది చూచి మరలా సీత సూటి పోటి మాటలు అనడం మొదలెట్టింది. “ఓ లక్ష్మణా! ఎందుకు అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు. రామునికి ఏదైనా ప్రమాదం జరగాలని కోరుకుంటున్నావా! రామునికి జరగకూడనిది జరిగితే నేను గోదావరిలో దూకుతాను. ఉరిపోసుకొని చస్తాను. లేదా ఆ ఎత్తైన పర్వతము మీదికి ఎక్కి కిందికి దూకుతాను. విషం తాగుతాను. అగ్నిలో దూకుతాను. చస్తాను. అంతేగానీ నేను పరపురుషుని నా పాదముతో కూడా తాకను." అని నెత్తీ నోరూ బాదుకుంటూ ఏడుస్తూ ఉంది సీత.

సీత ఏడుపు భరించలేకపోయాడు లక్ష్మణుడు. ఏమి అయితే అది అవుతుందని, సీతకు నమస్కరించాడు. మరలా మరలా వెనక్కు తిరిగి చూచుకుంటూ, కనులనిండా నీరు నిండగా, ఆ స్థలం వదిలి రాముని వెదుక్కుంటూ వెళ్లాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)