శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 44)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
నలుబది నాలుగవ సర్గ
ఈ విధంగా రాముడు లక్ష్మణునికి ఆ లేడిని చంపాలి అన్న తన నిర్ణయాన్ని, సీత గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు. ఒక కత్తిని తన నడుముకు కట్టుకున్నాడు. ధనర్బాణములను తీసుకున్నాడు. వీపుకు రెండు అమ్ములపొదులను కట్టుకున్నాడు.ఇదంతా క్రీగంటితో చూస్తున్నాడు మారీచుడు. ఇంక రాముడు తనను వేటాడటానికి వస్తున్నాడని గ్రహించి ముందుకు దూకాడు. చెంగు చెంగున గెంతుతూ దూరంగా పారిపోయాడు. అది చూచి రాముడు ఆ మృగము వెంట పరుగెత్తాడు. మారీచుడు రామునికి చిక్కినట్టే చిక్కి మరలా దూరంగా పరుగెత్తుతున్నాడు. రాముడు తన బాణములతో దానిని కొడుతున్నాడు. ఆ బాణములను చిత్రవిచిత్రంగా తిరుగుతూ తప్పించుకుంటూ పరుగెడుతున్నాడు మారీచుడు. మెరుపు తీగవలె ఒక క్షణం కనపడుతూ మరొక క్షణం మాయమౌతూ పారిపోతున్నాడు మారీచుడు.
రామునికి పట్టుదల పెరిగింది. ఆ మృగాన్ని వెంబడిస్తున్నాడు. ఆ ప్రకారంగా మారీచుడు రాముని పర్ణశాలకు దూరంగా తీసుకొని వెళ్లాడు. రామునికి విపరీతంగా కోపం వచ్చింది. ఒక చిన్న జింకపిల్ల తనకు చిక్కకుండా పారిపోయిందని ఉక్రోషంతో ఊగిపోతున్నాడు. అప్పటికే రాముడు అలిసిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మారీచుడు తనకు తానుగా మరి కొన్ని మృగములను సృష్టించుకొని ఆ లేళ్లగుంపులో తాను మెరిసిపోతూ రాముని ముందు తిరుగాడుతున్నాడు.
రామునికి కోపంపెరిగింది. లేచి మరలా పరుగెత్తాడు. మారీచుడూ అందకుండా పరుగెత్తాడు. రాముడు ఒక దివ్యాస్త్రమును సంధించాడు. ఆ లేడికి గురిపెట్టి ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రము నిప్పులు కక్కుకుంటూ ఆ లేడిని తరుముతూ దూసుకుపోయింది. ఆ దివ్యాస్త్రము బారి నుండి మారీచుడు తప్పించుకోలేకపోయాడు. ఆ దివ్యాస్త్రము మారీచుని గుండెలు చీల్చింది. ఆ దెబ్బకు మారీచుడు పైకి ఎగిరి దబ్బున కిందపడ్డాడు.
మరణ కాలంలో మారీచునకు తన నిజస్వరూపము వచ్చింది. అప్పుడు మారీచునికి రావణుని మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే మారీచుడు రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ "హా సీతా! హా లక్షణా!" అని బిగ్గరగా అరిచాడు. మారీచుడు తన భయంకరమైన రాక్షస స్వరూపముతో నేలమీద పడిపోయాడు. మారీచుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది.
లేడి రూపంలో తనను అంతదాకా తీసుకొని వచ్చిన రాక్షసుని చూచిన తరువాత రామునికి లక్ష్మణుని మాటలలో ఉన్న అంతరార్థం అవగతమయింది. అప్పుడు సీతకు ఏమయిందో అని కంగారు పడ్డాడు రాముడు. రామునికి సర్వం బోధపడింది. "వీడు మారీచుడే. సందేహము లేదు. లక్ష్మణుని మాటలు యదార్థములు. అయినా వీడు చస్తూ “సీతా లక్ష్మణా" అని ఎందుకు అరిచాడు. ఆ అరుపులు విని సీత నా గురించి కంగారు పడదు కదా! ఈ అరుపులు విని లక్ష్మణుడు నాకు ఏమైనా ఆపద కలిగిందని అనుకోడు కదా!"
ఈ ఆలోచన రాగానే రాముడి మనసులో కీడు శంకించాడు. రాముని ఒళ్లు జలదరించింది. కొంచెం భయం కూడా కలిగింది. ఇప్పుడు తీసుకుపోడానికి లేడి లేదు. దాని చర్మం లేదు. అందుకని మరొక చుక్కల లేడిని చంపి దాని మాంసమును, చర్మాన్ని తీసుకొని తన పర్ణశాల వైపు వెళుతున్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment