శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 43)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
నలుబది మూడవ సర్గ
ఆశ్రమము వెలుపల పూలను కోసుకుంటున్న సీతకు ఆ మాయామృగము కనపడింది. సీతకు సంతోషము, ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి."ఆర్యపుత్రా! లక్ష్మణా! రండి! త్వరగా రండి. ఇక్కడకు రండి. ఇటు చూడండి. ఈ లేడిని చూడండి. అబ్బా! ఎంత బాగుందో! ఎంత ముచ్చటగా ఉందో!" అని అరిచినట్టు పిలిచింది.
రాముడు, లక్ష్మణుడు గబగబా అక్కడకు వచ్చారు. సీత వారికి ఆ లేడిని చూపించింది. సీతతో పాటు రాముడు కూడా ఆ మృగమును చూచి ఆనందించాడు. కాని లక్ష్మణునికి ఆ మృగమును చూచి అనుమానం కలిగింది.
“రామా! ఈ మృగము సామాన్య మృగము మాదిరి లేదు. ఎవరో రాక్షసుడు ఈ మృగవేషము ధరించినట్టు కనపడుతూ ఉంది. ఇదివరలో మారీచుడు కూడా ఇలాంటి మాయావేషములను ధరించి, వేటకు వచ్చిన రాజులను వంచించి, వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని చంపి తినేవాడని మనకు తెలుసు. ఆ మారీచుడు ఈ మృగముకాదు కదా! నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మనము ఎన్నో లేళ్లను చూచాము. కానీ ఇంతటి ప్రకాశవంతమైన, బంగారు వర్ణములో ఉన్న లేడిని చూడలేదు. ఇదేదో రాక్షస మాయగా ఉంది. అసలు ఇటువంటి లేడి భూలోకములో ఉంటుందా అని నా అనుమానము.
రామా! సందేహము లేదు. ఆలోచించిన కొద్దీ నా అనుమానము బలపడుతూ ఉంది. ఇది నిస్సంశయముగా మాయాలేడి. రాక్షస మాయ." అని అన్నాడు లక్ష్మణుడు.
అప్పుడు సీత లక్ష్మణుని చూచి ఇలా అంది. “లక్ష్మణా! నీకు అన్నీ అనుమానాలే. అందమైన లేడి పిల్లను చూచి ఆనందించక అనుమానిస్తావెందుకు. ఈ లేడి పిల్లను మన ఆశ్రమములో ఉంచి పెంచు కుందాము. రోజూ దీనితో నాకు కాలక్షేపము అవుతుంది.
రామా! నాకు ఆ లేడిని తెచ్చి ఇవ్వరా! ప్రాణములతోటి పట్టి తెండి. మన ఆశ్రమ ప్రాంతములో ఎన్నో లేళ్లు సంచరిస్తున్నాయి. కానీ అవి ఈ లేడి అంత అందంగా ఆకర్షణీయంగా లేవు. అసలు ఇలాంటి మృగమును నేను ఇంతవరకూ చూడలేదు. చూడండి. దాని శరీరం చిత్రవిచిత్ర రంగులతో ఎలా మెరిసిపోతోందో! ఆ లేడి మనుషులను చూచి భయపడటం లేదు. నిర్భయంగా తిరుగుతూ ఉంది. దీనిని పెంచుకొని దీనితో వినోదించవలెనని నాకు కోరికగా ఉంది.
ఆహా! ఏమి రూపము! ఏమి సౌందర్యము. దాని అరుపులు కూడా మధురంగా ఉన్నాయి నాధా! దీనిని చూడగానే నా మనసు దీని యందే లగ్నం అయింది. అది నా మనసు హరించింది. దీనిని వదిలి నేను ఒక్కక్షణం కూడా ఉండలేకపోతున్నాను. కాబట్టి నాధా! దీనిని సజీవంగా పట్టి తెండి. మనము వనవాసకాలములో దీనితో వినోదించి, మరలా మనము అయోధ్యకు పోవునపుడు దీనిని మన వెంట అయోధ్యతీసుకొని పోవుదము. దీనిని చూచి అత్తయ్యగారు, భరతుడు, నా చెల్లెళ్లు ఎంతో సంతోషిస్తారు.
పోనీలెండి, ఈ మృగమును సజీవంగా పట్టుకోలేక పోతే, కనీసము దీని చర్మమును అన్నా నాకు బహుమతిగా ఇవ్వండి. నేను దాచుకుంటాను. నేను పూజచేసుకొనేటప్పుడు దీని మీద కూర్చుని పూజచేసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నారు! స్త్రీలు ఇటువంటి విపరీతమైన కోరికలు కోరకూడదన్న మాట నిజమే. కాని, ఈ బంగారు లేడిని చూచి కోరకుండా ఉండలేకపోతున్నాను. ఈ సారికి మన్నించండి.” అని గోముగా ప్రేమగా అడిగింది సీత.
రామునికి కూడా ఆ మృగమును చూస్తే ఆనందం కలిగింది. వెంటనే ఆశ్చర్యము కూడా కలిగింది. సీత ఆ మృగమును కావాలి అంటూ ఉంది. తనకు కూడా ఆ మృగమును వేటాడవలెనని కోరికగా ఉంది. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా! సీత మాటలు విన్నావు కదా. సీతకు ఈ మృగము అంటే ఎంతో ఆసక్తిగా ఉంది. నాకు చూడ ఇటువంటి మృగమును మనము ఈ దండకారణ్యములో ఇంతవరకూ చూడలేదు. అంతే కాదు ఇది దేవలోకములో ఉండవలసిన మృగము. భూలోకములోకి ఎలా వచ్చిందో! అటువంటిది మన కంటపడింది. దీని ఒంటి మీద ఉన్న బంగారుచుక్కలు అతిమనోహరంగా ఉన్నాయి. అసలు ఇటువంటి మృగమును చూచి ఎవరు ఆనందించరు! ఈ మృగము అందరినీ ఆకర్షిస్తుంది.
లక్ష్మణా! సాధారణంగా రాజులు వినోదము కొరకు వేటకు పోయి ఇటువంటి మృగములను చంపుతారు. వాటి మాంసమును తింటారు. అది క్షత్రియులకు సహజము. కాబట్టి మనము ఈ మృగమును చంపి దాని చర్మమును సీతకు ఇస్తాము. నేను సీత ఈ మృగచర్మము మీద సుఖంగా ఆసీనులము అవుతాము. ఏ మృగ చర్మము కూడా దీని చర్మము అంత మృదువుగా ఉండదు అని నేను అనుకుంటాను.
పోనీ నీవు చెప్పినట్టు ఇది రాక్షస మాయ అని అనుకుంటే, మనము దీనిని వెంటనే చంపుదాము. ఆ రాక్షసుడు కూడా చస్తాడు. నీవు చెప్పినట్టు వీడు మారీచుడు అనే రాక్షసుడు అయితే ఇంకా మంచిది. ఈ మారీచుడు ఇదివరకు ఈ దండ కారణ్యములో ఎంతో మంది మునులను తన మాయలతో చంపి తిన్నాడు. వీడే మారీచుడు అయితే అవశ్య వీడిని చంపితీరాలి. వీడు చంపతగ్గవాడు కదా! ఇదివరలో అగస్త్యుడు వాతాపిని చంపినట్టు మనము మారీచుని చంపుదాము. వీడిపీడను, ఈ ప్రాంతంలో వేటకు వచ్చే రాజులకు, ఇక్కడ నివసించే ఋషులకు, లేకుండా చేద్దాము.
అలాకాకుండా, ఈ మృగము మామూలు మృగము అయితే దీనిని చంపి సీతకు చర్మము ఇద్దాము. ఇది రాక్షసుడు అయితే దీనిని చంపి ఇక్కడివారలకు రాక్షసపీడను విరగడ చేద్దాము. కాబట్టి దీనిని చంపడం అవశ్యం ఆచరించతగినది.
లక్ష్మణా! నేను ఈ మృగమును వేటాడి చంపుతాను. నేను వచ్చేదాకా నీవున సీతను రక్షిస్తూ ఉండు. నేను ఒక్కక్షణములో ఈ మృగమును చంపి దాని చర్మమును తీసుకొని వస్తాను. నీవు మాత్రము ఒంటరిగా ఉన్న సీతను నేను వచ్చువరకూ జాగ్రత్తగా రక్షిస్తూ ఉండు.
లక్ష్మణా! కావాలంటే జటాయువు సాయం తీసుకో. నీవు, జటాయువు కలిసి సీతను జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి." అని పలికాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment