శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 42)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
నలుబది రెండవ సర్గ
అప్పటికి రెండు సార్లు రాముడి చేతిలో చావు తప్పించుకున్నా, మూడవసారి రాముడి చేతిలో తనకు చావు తప్పదని రూఢి చేసుకొని రావణుని వెంట బయలుదేరాడు మారీచుడు. ఎన్ని మాటలు మాట్లాడినా తుదకు మారీచుడు తన మాటను మన్నించి తన వెంట వస్తున్నందుకు చాలా సంతోషించాడు రావణుడు. అప్పుడే సీత తన ఒడిలో వాలినట్టు సంతోషపడ్డాడు.మారీచుని కౌగలించుకొని “మారీచా! నామాట విని ఇప్పుడు నువ్వు అసలైన మారీచుడవు అనిపించుకున్నావు. నువ్వు ఇంతకు ముందు మాదిరి రాముడికి భయపడే మారీచుడవు కావు. నీవు కూడా నాతో రా. రథం ఎక్కు. మనం ఇద్దరం రాముని ఆశ్రమం దాకా వెళదాము తరువాత తెలుసుగా. కాస్త సీతను ప్రలోభ పెట్టి నువ్వు నీ ఇష్టంవచ్చినట్టు పారిపో. రామ లక్ష్మణులు అటు పోగానే నేను సీతను తీసుకొని ఇటు వచ్చేస్తాను." అని వ్యవహారాన్ని చాలా తేలిగ్గా తేల్చేశాడు రావణుడు.
తరువాత రావణుడు, మారీచుడు ఇద్దరూ గాడిదలు కట్టిన రథం ఎక్కి దండకారణ్యం వైపు ప్రయాణం సాగించారు. కొన్ని దినములు ప్రయాణించి ఇద్దరూ రాముని ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. రావణుడు, మారీచుడు ఇద్దరూ రథం దిగారు.
“మారీచా! అటు చూడు. అదే రాముని ఆశ్రమము అనుకుంటాను. నేనుచెప్పింది గుర్తు ఉంది కదా. ఆ ప్రకారం చెయ్యి. నేను ఈ పరిసరాలలో దాక్కొని ఉంటాను." అని అన్నాడు రావణుడు.
వెంటనే మారీచుడు తన కామరూప విద్య ప్రభావంతో ఒక బంగారు వన్నెకల లేడి రూపం ధరించాడు. రాముని ఆశ్రమం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. సీత దృష్టి లో పడేట్టు సంచరిస్తున్నాడు. మారీచుడు ధరించిన ఆ లేడి రూపము చాలా సుందరంగా ఉంది. దాని ముఖము సగం తెల్లగా సగం నల్లగా ఉంది. మెడ కొంచెం ఎత్తుగా ఉంది. దాని శరీరము బంగారు రంగుతో మెరుస్తూ ఉంది.
ఆ లేడి అక్కడ ఉన్న పచ్చికను కొరుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అటు ఇటు పరుగెత్తుతూ, గెంతుతూ, భయం భయంగా చూస్తూ ఉంది. కాసేపు అలా ఆడుకొని, కొంచెం సేపు
అలసటగా పడుకొంది. మరలా లేచి గెంతుతూ ఆశ్రమ ద్వారం దగ్గర తచ్చాడుతూ ఉంది. ఎలాగైనా సీత దృష్టిలో పడాలని నానా పాట్లు పడుతూ ఉంది ఆ మాయ లేడి.
అలసటగా పడుకొంది. మరలా లేచి గెంతుతూ ఆశ్రమ ద్వారం దగ్గర తచ్చాడుతూ ఉంది. ఎలాగైనా సీత దృష్టిలో పడాలని నానా పాట్లు పడుతూ ఉంది ఆ మాయ లేడి.
ఇంతలో కొన్ని లేళ్లు అక్కడకు గుంపుగా వచ్చాయి. ఈ మాయలేడి కూడా వాటితో కలిసి ఆడుతూ ఉంది. కాని మిగిలిన లేళ్లు ఈ మాయలేడిని వాసన చూచి ఎందుకో దూరంగా పరుగెడుతున్నాయి. మారీచునకు ఆ లేళ్లను చూస్తుంటే వాటిని కరా కరా నమిలి తినాలని మహాకోరికగా ఉంది. కాని తాను ఉన్న పరిస్థితులలో ఆ పని చేయకూడదని ఆ కోరికను చంపుకున్నాడు.
అదే సమయంలో సీత పూలు కోయడానికి ఆశ్రమం నుండి వెలుపలికి వచ్చింది. ఆశ్రమం బయట ఉన్న పూల చెట్ల నుండి పూలు కోస్తూ ఉంది. ఇంతలో ఆ మాయలేడి సీత కంటపడింది. బంగారు వర్ణంతో మిలా మిలా మెరిసిపోతున్న ఆ లేడి వంక కుతూహలంగా చూచింది సీత. ఆ అరణ్యంలో అంతవరకూ అటువంటి లేడిని సీత చూడలేదు. అందుకని ఆశ్చర్యం ఆ లేడి వంక చూస్తూ ఉంది.
అమ్మయ్య వచ్చిన పని అయిందనుకున్నాడు మారీచుడు. సీత దగ్గరగా వెళ్లి ఆమె తనను అందుకొనేటట్టు ఆమెకు దగ్గరగా అటు ఇటు తిరుగుతున్నాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment