శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 99)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
తొంభయ్యి తొమ్మిదవ సర్గ
శత్రుఘ్నుడు తన వెంటరాగా భరతుడు వడి వడి గా రాముని వద్దకు వెళుతున్నాడు. భరతుని వెనక వసిష్ఠుడు, దశరథుని ముగ్గురు భార్యలను తీసుకొని వెళుతున్నాడు. సుమంత్రుడు కూడా భరతుని వెనుకనే వెళుతున్నాడు.భరతునికి దూరంగా ఒక పర్ణశాల కనపడింది. ఆ పర్ణశాల ముందు కొన్ని కట్టెలు,పుష్పములు కనపడ్డాయి. అక్కడ ఉన్న చెట్లకు కొన్ని నారచీరలు వేలాడుతున్నాయి. రాముడు అక్కడే ఉన్నాడు అని రూఢి అయింది భరతునికి. ఉద్వేగంతో వెళుతున్నాడు భరతుడు.
“శత్రుఘ్నా! చూచావా! ఇదే భరద్వాజుడు చెప్పిన ప్రదేశము. ఇక్కడే మందాకినీ నది ప్రవహించుచున్నది. ఇక్కడి చెట్లకు నారచీరలు వేలాడుతూ ఉన్నాయి. అదుగో ఆపర్ణశాల దగ్గర ఉన్న అగ్నినుండి పుట్టిన పొగ పైకి లేస్తూ ఉంది. రాముడు ఇక్కడే ఉన్నాడు అని నా అనుమానము. మనము ఇక్కడే రాముని చూస్తాము.
సుమంత్రా! అయోధ్యా సింహాసనముమీద కూర్చోవలసిన రాముడు ఇక్కడ కటిక నేల మీద పద్మాసనము వేసుకొని కూర్చొని ఉన్నాడు. దీని కంతటికీ నేనేకారణము. నా మూలముననే రామునికి ఇన్ని కష్టములు వచ్చినవి. నేను, రాముడు సీత పాదముల మీద పడి క్షమాపణ కోరిన కాని నా మనసు శాంతించదు." అని అంటూ భరతుడు దూరంగా ఉన్న ఆ పర్ణశాల వైపు నడుస్తున్నాడు.
భరతుడు ఆ పర్ణశాలను సమీపించాడు. భరతుని మనస్సంతా ఉద్వేగపూరితంగా ఉంది. ఆ పర్ణశాల లోపలికి తొంగి చూచాడు. జటలు కట్టిన వెంట్రుకలతో, నేల మీద జింక చర్మము పరచుకొని దాని మీద కూర్చుని ఉన్న రాముని చూచాడు భరతుడు. రామునికి అటు ఇటు సీత లక్ష్మణులు కూర్చొని ఉన్నారు.
భరతునికి దు:ఖము పొంగుకొని వచ్చింది. రాముడి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లాడు. భరతుని కళ్లనిండా నీళ్లు తిరిగాయి. కళ్లు సరిగా కనిపించడం లేదు. దు:ఖముతో గొంతు బొంగురుపోయింది. ఆ బొంగురు గొంతుతో భరతుడు ఇలా అన్నాడు.
“రామా! నీవా ఈ నేలమీద కూర్చొని ఉన్నది. అమాత్యులు సేవిస్తూ ఉంటే, రాజ సింహాసనము మీద కూర్చోవలసిన నీవు జింక చర్మమీద కూర్చొని ఉన్నావా! పట్టు పీతాంబరములు ధరించవలసిన నీవు నారచీరలు కట్టుకొని ఉన్నావా! చిత్ర విచిత్రములైన పుష్పములు ధరించవలసిన నీ శిరసు మీద ఆ జటలు ఎలా ధరించావు? ఒక రాజుగా యజ్ఞయాగములు చేయవలసిన నీవు, ఇక్కడ అడవులలో కష్టములు పడుతున్నావా? అగరు, చందనముతో అలరార వలసిన నీ శరీరము మట్టికొట్టుకొని పోయినదా! సుఖపడవలసిన నీవు ఇలా కష్టములు పడుతుంటే ఆ కష్టములకు కారణమైన నాకు ఈ సుఖములు ఎందుకు?" అని ఏడుస్తూ రాముని పాదముల మీద పడ్డాడు భరతుడు. రాముని పాదములను తన కన్నీటితో తడుపుతున్నాడు.
ఒక సారి తల ఎత్తి రామా! అని పిలిచి మరలా రాముని పాదముల మీదపడిపోయాడు భరతుడు. తరువాత భరతునికి మాటలు రాలేదు. బిగ్గరగా ఏడుస్తున్నాడు. శత్రుఘ్నుడు కూడా దు:ఖము ఆపుకోలేక రాముని పాదముల మీద పడ్డాడు.
రాముడు తమ్ములను చూచిన సంభ్రమంతో భరత శత్రుఘ్నులను తన రెండు చేతులతో పొదివి పట్టుకొని లేవనెత్తాడు. రాముడు భరత శత్రుఘ్నులను గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు, రామునికి కూడా దు:ఖము ఆగలేదు. భోరున విలపిస్తున్నాడు. ఇంతలో వెనుకగా వస్తున్న సుమంత్రుడు, వసిష్ఠుడు కూడా పర్ణశాల లోపలికి వచ్చారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment